Valmiki Ramayanam - Balakanda - Part 6







ఆఱవసర్గము
దశరథునిపాలనలో అయోధ్యానగరవైభవము


తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వ సంగ్రహః |
దీర్ఘదర్శీ మహాతేజాః పౌర జానపద ప్రియః |1-6-1|
ఇక్ష్వాకూణం అతిరథో యజ్వా ధర్మపరో వశీ |
మహర్షికల్పో రాజర్షిః త్రిషు లోకేషు విశ్రుతః |1-6-2|
బలవాన్ నిహత అమిత్రో మిత్రవాన్ విజిత ఇంద్రియః |
ధనైః సంచయైః అన్యైః శక్ర వైశ్రవణ ఉపమః |1-6-3|
యథా మనుర్ మహాతేజా లోకస్య పరిరక్షితా |
తథా దశరథో రాజా లోకస్య పరిరక్షితా |1-6-4|
దశరథమహాఆజు వేదార్థములను బాగుగా ఎఱిగినవాడు, ధనదానాదులచే శూరులను, పండితులను ఆదరించి, తనవశమునందు ఉంచుకొనెడివాడు, భావిపరిణామములను ముందుగా గుర్తించువాడు, మిక్కిలి ప్రతాపశాలి, పురజనులకును, గ్రామప్రజలకును ప్రియమును గూర్చువాడు, ఇక్ష్వాకువంశజులలో అతిరథుడు, విధ్యుక్తముగా యజ్ఞములను చాయువాడు, ధర్మకార్యములయందు నిత్రతుడు, ప్రజలనందఱిని అదుపులోనుంచగలవాడు, మహర్షితుల్యుడు, రాజర్షి, ముల్లోకములయందును సుప్రసిద్ధుడు, చతురంగబలములు గలవాడు, శత్రువులను తుదముట్టించెడువాడు, సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు, నిషిద్ధ విషయములయందు మనసుపెట్టనివాడు, ధనకనక వస్తువాహనములను, తదితర నిధులను కల్గియుండుట యందు ఇంద్రునితో, కుబేరునితో సమానుడు. అట్టి దశరథమహారాజు లోకపరిరక్షణయందు మహా తేజశ్శాలియైన వైవస్వతమనువువలె తనకోసల రాజ్యమును పరిపాలించెను. [1 - 4]

తేన సత్యాభిసంధేన త్రివర్గం అనుష్టితా |
పాలితా సా పురీ శ్రేష్టా ఇంద్రేణ ఇవ అమరావతీ |1-6-5|
సత్యసంధుడును, ధర్మమును, ధర్మమునకులోబడి అర్థకామములను పరిరక్షించువాడును ఐన దశరథుడు ఇంద్రుడు అమరావతిని వలె అయోధ్యను పాలించెను. [5]

తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మనో బహుశ్రుతాః |
నరాః తుష్ఠాః ధనైః స్వైః స్వైః అలుబ్ధాః సత్యవాదినః |1-6-6|
శ్రేష్ఠమైన ఆయోధ్యనగరమునందలి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి. వారు ధర్మాత్ములు. అనేకశాస్త్రములను అధ్యయనము చేసినవారు, తాము కష్టపడి సంపాదించిన ధనముతోడనే తృప్తిపడువారు, లోభగుణము లేనివారు, సత్యమును పలికెడువారు. [6]

అల్ప సంనిచయః కశ్చిద్ ఆసీత్ తస్మిన్ పురోత్తమే |
కుటుంబీ యో హి అసిద్ధర్థః అగవా అశ్వ ధన ధాన్యవాన్ |1-6-7|
మహానగరమందలి గృహస్థులలొ ఒక్కడును సంపన్నుడు కానివాడుగాని, గోవులు, అశ్వములు, ధనధాన్య సమృద్ధియు లేనివాడుగాని లేడు. వారందఱును తమ సంపదలను ధర్మకార్యములకును, ధర్మబద్ధముగా అర్థ, కామపురుషార్థములను సాధించుటకును వినియోగించెడివారే. [7]

కామీ వా కదర్యో వా నృశంసః పురుషః క్వచిత్ |
ద్రష్టుం శక్యం అయోధ్యాయాం అవిద్వాన్ నాస్తికః |1-6-8|
పురమునందలిజనులలో కామాతురుడుగాని, కదర్యుడు (లోభి) గాని, క్రూరుడుగాని, విధ్యా హీనుడుగాని, నాస్తికుడు గాని ఎంతగా వెదికినను కానరాడు. [8]

సర్వే నరాః నార్యః ధర్మశీలాః సు సంయతాః |
ముదితాః శీల వృత్తాభ్యాం మహర్షయ ఇవ అమలాః |1-6-9|
అయోధ్యయందలి స్త్రీపురుషులు ధర్మప్రవర్తనచే శ్రేష్ఠులు, ఇంద్రియనిగ్రహముగలవారు, సత్స్వభావము గలవారు, సదాచార సంపన్నులు, మహర్షులవలె నిర్మలహృదయులు [9]

అకుణ్డలీ అముకుటీ అస్రగ్వీ అల్పభోగవాన్ |
అమృష్టో అలిప్తాఙ్గో అసుగంధః విద్యతే |1-6-10|
అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివాడు లేడు, శిరస్త్రాణమును, తలపాగ మొదలగువానిని ధరింపని వాడు లేడు, తనసంపదకు తగినట్లుగా భోగములను అనుభవింపనివాడు లేడు, అభ్యంగనస్నానములను చేయనివాడు లేడు, చందనాదికములను అలదుకొననివాడూ లేడు, నుదుట తిలకమునుగాని, కస్తూరిని గాని బొట్టుగా ధరింపని వాడు లేడు. [10]
అమృష్ట భోజీ అదాతా అపి అనఙ్దనిష్కధృక్ |
అహస్తాభరణో వా అపి దృశ్యతే అపి అనాత్మవాన్ |1-6-11|
అయోధ్యయందు ఆకలితో అలమటించువారు లేరు, అందఱును తనివిదీర భుజించువారే, అతిథి - అభ్యాగతులను ఆదరించెడివారే, అర్థులకు దానములను చేయువారే, బాహుభూషణములను, కంఠాభరణములను, కంకణములను, ఉంగరములను ధరించెడివారే, అందఱును అంతఃకరణ శుద్ధిగలవారే. [11]

అనాహిత అగ్నీః అయజ్వా క్షుద్రో వా తస్కరః |
కశ్చిత్ అసీత్ అయోధ్యాయాం ఆవృత్తో సంకరః |1-6-12|
అయోధ్యానగరమునందు అగ్నికార్యములను చేయనివాడుగాని, సొమయాగమును ఆచరింపని వాడుగాని, విద్యలను అరగొరగా నేర్చినవాడు గాని, చాలియుచాలని సంపదగలవాడుగాని లేడు. దొంగలుగాని, వర్ణసంకరులుగాని అచట లేనేలేరు. [12]
స్వ కర్మ నిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియాః |
దాన అధ్యన శీలాః సంయతాః ప్రతిగ్రహే |1-6-13|
అయోధ్యయందలి బ్రాహ్మణులు సర్వదా విధ్య్క్తములైన స్వకర్మలయందు నిరతులు, ఇంద్రియములను జయించినవారు, దానశీలురు, జపము, వేదాధ్యయనము చేసెడి స్వభావముగలవారు, దానములను స్వీకరించుటయందు విముఖులు. [13]

నాస్తికో అనృతీ వా అపి కశ్చిత్ అబహుశ్రుతః |
అసూయకో అశక్తో అవిద్వాన్ విద్యతే క్వచిత్ |1-6-14|
దశరథుని పరిపాలన కాలమునందు జానపదులలో నాస్తికులు గాని, అసత్యవాదులు గాని, శాస్త్రములను అభ్యసింపనివారుగాని, అసూయాపరులుగాని, ఇహపర సాధనయందు అశక్తులుగాని, అజ్ఞానులుగాని లేరు. [14]

అషడంగ విత్ అస్తి అవ్రతో అసహస్రదః |
దీనః క్షిప్త చిత్తఓ వా వ్యథితో వా అపి కశ్చన |1-6-15|
నగరమున వేదాంగములు (శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము) తెలియనువాడుగాని, వ్రతములను ఆచరింపనివాడుగాని లేడు, వేలకొలది ద్రవ్యములు దానముచేయనివాడు గాని, దీనుడుగాని, వ్యాకులచిత్తుడుగాని, రోగపీడుతుడుగాని లేడు. [15]

కశ్చిన్ నరో వా నారీ వా అశ్రీమాన్ అపి అరూపవాన్ |
ద్రష్టుం శక్యం అయోధ్యాయాం అపి రాజన్య అభక్తిమాన్ |1-6-16|
అచటి స్త్రీపురుషులలో కాంతిరహితులుగాని, సౌందర్యహీనులు గాని, రాజభక్తి లేనివారుగాని మచ్చునకైనను కనబడరు. [16]

వర్ణేషు అగ్ర్య చతుర్థేషు దేవతా అతిథి పూజకాః |
కృతజ్ఞాః వదాన్యః శూరా విక్రమ సంయుతాః |1-6-17|
దీర్ఘ ఆయుషో నరాః సర్వే ధర్మం సత్యం సంశ్రితాః |
సహితాః పుత్ర పౌత్రైః నిత్యం స్త్రీభిః పురోత్తమే |1-6-18|
నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు నాలుగు వర్ణములవారు దేవతలను, అతిథులను పూజించుచుండెడివారు. చేసినమేలును మఱువనివారు, ప్రీతితో దానములను చేసెడివారు, బ్రాహ్మణులు పాండిత్యమునందును, శాస్త్రవాదములయందును, శూరులు, పరాక్రమవంతులు, ఇతరులు తమతమరంగములలో వీరులు, శూరులు, మహానగరమునందలి జనులు ఎల్లరును ధర్మములను ఆచరించువారు, సత్యమార్గమును వీడనివారు. అందువలన వారు ధీర్ఘాయుష్మంతులు. భార్యాపుత్త్ర పౌత్త్రాదులతో కూడియుండువారు. [17 - 18]

క్షత్రం బ్రహ్మముఖం ఆసీత్ వైశ్యాః క్షత్రం అనువ్రతాః |
శూద్రాః స్వ ధర్మ నిరతాః త్రీన్ వర్ణాన్ ఉపచారిణః |1-6-19|
క్షత్రియులు బ్రాహ్మణులయెడ గౌరవముగలిగి రాజ్యపాలన చేయుచుండెడివారు, వైశ్యులు క్షత్రియులఆజ్ఞలను పాటించెడివారు, శూద్రులు తమతమ ధర్మములనాచరించుచు మూడువర్ణములవారిని సేవించుచుండెడివారు. [19]

సా తేన ఇక్ష్వాకు నాథేన పురీ సు పరిరక్షితా |
యథా పురస్తాత్ మనునా మానవేంద్రేణ ధీమతా |1-6-20|
ఇక్ష్వాకువంశజుడైన దశరథమహారాజు అయోధ్యానగరమును పూర్వము ప్రతిభామూర్తియు, మానవేంద్రుడును ఐన మనువువలె చక్కగా రక్షించుచుండెను. [20]

యోధానాం అగ్ని కల్పానాం పేశలానాం అమర్షిణాం |
సంపూర్ణా కృత విద్యానాం గుహా కేసరిణాం ఇవ |1-6-21|
అచటి యోధులు పరాక్రమమున అగ్నివంటివారు, కుటిలత్వము లేనివారు, పరాభవములను మాత్రము సహింపనివారు, శస్త్రాస్త్రాదియుద్ధవిధ్యలయందు ఆఱితేఱినవారు. అట్టి యోధులచేనిండి, నగరము సింహములచే గుహవలె దుర్భేద్యమై యుండెను. [21]

కాంభోజ విషయే జాతైః బాహ్లికైః హయ ఉత్తమైః |
వనాయుజైః నదీజైః పూర్ణా హరిహయ ఉత్తమైః |1-6-22|
వింధ్య పర్వతజైః మత్తైః పూర్ణా హైమవతైః అపి |
మదాన్వితైః అతిబలైః మాతఙ్గైః పర్వతోఉపమైః |1-6-23|
ఇరావత కులీనైః మహాపద్మ కులైః తథా |
అంజనాదపి నిష్క్రాంతైః వామనాదపి ద్విపైః |1-6-24|
కాంభోజదేశపు జాతిగుఱ్ఱములతోడను, బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమాశ్వములతోడను, వనాయురాజ్యమున బుట్టిన మేలుజాతి హయములతోడను, సింధుదేశమున జన్మించిన శ్రేష్ఠములైన గుఱ్ఱములతోడను, ఉచ్చైశ్రవమువంటి ఉత్తమోత్తమ హయములతోడను పురము విలసిల్లుచుండెను. వింధ్యపర్వతమున బుట్టిన మదపుటేనుగులతోడను, హిమవన్నగమున జన్మించిన మహాగజములతోడను, బాగుగా బలిసి మిక్కిలి మదించి, పర్వతములవలెనున్న మాతంగములతోడను, ఐరావతవంశమున జన్మించినట్టివియు, పుండరీకమను పేరుగల మహాపద్మజాతికి చెందినవియు, వరుణదిగ్గజమైన అంజనజాతికి చెందినవియు, దక్షిణ దిగ్గజమైన వామనజాతిలో ఉద్భవించినవియు అగు భద్రగజములతోడను పురము నిండియుండెను. [22 - 24]

భద్రైః మంద్రైః మృగైః ఏవ భద్ర మంద్ర మృగైః థథా |
భద్ర మంద్రైః భద్ర మృగైః మృగ మంద్రైః సా పురీ |1-6-25|
భద్రజాతి గజములతోడను, మంద్రజాతి ఏనుగుల తోడను మృగజాతివారణములతోడను, అట్లే, భద్రమంద్ర, భద్రమృగ, మృగమంద్ర - అను రెండేసి జాతుల సాంకర్యముగల ఏనుగులతోడను, మంద్ర మృగ అను మూడేసి జాతుల సంకర గజములతోడను, ఎల్లప్పుడు మదించి యుండి, పర్వత సమానములైన ఏనుగులతోడను అయోధ్య విలసిల్లుచుండెను. [25]

నిత్య మత్తైః సదా పూర్ణా నాగైః అచల సన్నిభైః |
సా యోజనే ద్వే భూయః సత్యనామా ప్రకాశతే |
యస్యాం దశరథో రాజా వసన్ జగత్ అపాలయత్ |1-6-26|
నగరము వెలుపలగూడ రెండు యోజనముల మేరకు వ్యాపించియుండెను. సార్థకనామధేయముగల అయోధ్యను (యోద్ధుం అశక్యా, ఇతరులకు జయించుటకుసాధ్యముగానిది) దశరథమహారాజు పరిపాలించుచుండెను. [26]

తాం పురీం మహాతేజా రాజా దశరథో మహాన్ |
శశాస శమిత అమిత్రో నక్షత్రాణీవ చంద్రమాః |1-6-27|
రాజశిరోమణియు, మహాతేజశ్శాలియు ఐన దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములనువలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను. [27]
తాం సత్య నామాం దృఢ తోరణ అర్గలాం
గృహైః విచిత్రైః ఉపశోభితాం శివాం |
పురీం అయోధ్యాం నృ సహస్ర సంకులాం
శశాస వై శక్ర సమో మహీపతిః |1-6-28|
నగరము పేరుకు తగినట్లుగా దృడమైన గడియలుగల కవాటములతోడను, చిత్రములైన గృహములతోడను, శోభిల్లుచుండెను. వేలకొలది పురజనులతో కలకలలాడుచు శుభప్రదమైన పురిని ఇంద్రసమానుడైన దశరథమహారాజు పరిపాలించుచుండెను. [28]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షష్ఠస్సర్గః |1-6|
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ఆఱవసర్గము సమాప్తము






Om Tat Sat


(Continued ....)


(My humble salutations to the lotus feet of  Swamy jis, Philosophic Scholars and greatful to Wikisource  for the collection)

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Blog Archive

Visitors

Labels

Blog Archive