శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మ అర్ధ సహితం హితం |
వ్యక్తం అన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః |1-3-1|
ధర్మాత్ముడైన వాల్మీకిముని ఇదివరలో నారదమహర్షివలన ధర్మసహితమైన రామకథను వినియుండెను. మహానుభావుడైన శ్రిరామచంద్రుని వృత్తాంతములో ఇంకను విశేషాంశములు ఏవైనను కలవేమోయని ఆలోచింపసాగెను. [1-3-1]
ఉపస్పృస్య ఉదకం సమ్యక్ మునిః స్థిత్వా కృతాఞ్జలిః |
ప్రాచీన అగ్రేషు దర్భేషు ధర్మేణ అన్వేషతే గతిం |1-3-2|
మునీశ్వరుడు తూర్పువైపు కొనలుగల ధర్భలపై కూర్చొని, విధ్యుక్తముగా ఆచనముచేసి, భగవంతుని స్మరించుచు నమస్కరించెను. పిదప తనతపశ్శ్క్తిచే (దివ్యదృష్టితో) రామకథారీతినిగూర్చి ఆలోచన చేయసాగెను. [1-3-2]

రామ లక్ష్మణ సీతాభిః రాజ్ఞా దశరథేన |
భార్యేణ రాష్ట్రేణ యత్ ప్రాప్తం తత్ర తత్త్వతః |1-3-3|
హసితం భాషితం ఏవ గతిర్యాయత్ చేష్టితం |
తత్ సర్వం ధర్మ వీర్యేణ యథావత్ సంప్రపశ్యతి |1-3-4|
సీతారామలక్ష్మణులు, దశరథమహారాజు, అతనిభార్యలు, ఆయనరాజ్యప్రజలు (రాజ్యము) మొదలగు వారినిగూర్చియు, వారిప్రసన్నదరహాసములు, మధుర భాషణములు, గంభీర గమనములు, కార్యకలాపములు మున్నగువాటినిగూర్చియు బ్రహ్మవరప్రభావముచేత యోగదృష్టితో యథాతథముగ కన్నులగట్టినట్లు మునికి విదితమాయెను. [1-3-3, 4]

స్త్రీ తృతీయేన తథా యత్ ప్రాప్తం చరతా వనే |
సత్యసంధేన రామేణ తత్సర్వం అన్వవేక్షత |1-3-5|
తతః పశ్యతి ధర్మాత్మా తత్ సర్వం యోగమాస్థితః |
పురా యత్ తత్ర నిర్వృత్తం పాణావ ఆమలకం యథా |1-3-6|
సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతోగూడి దండకారణ్యమునకు వెళ్ళుటను, జరిగినసంఘటనలను అన్నింటిని ఆతపస్వి దర్శించెను. అంతట ధర్మాత్ముడైన వాల్మీకికి యోగశక్తి ప్రభావమున రామాయణసంఘటనములన్నియును ఆమూలాగ్రముగ కరతలామలకములయ్యెను (విశదమాయెను). [1-3-5, 6]

తత్ సర్వం తాత్త్వతో దృష్ట్వా ధర్మేణ మహామతిః
అభిరామస్య రామస్య తత్ సర్వం కర్తుం ఉద్యతః |1-3-7|
కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం |
సముద్రం ఇవ రత్నాఢ్యం సర్వ శ్రుతి మనోహరం |1-3-8|
శ్రీరామునిగుణములను యోగదృష్టితోదర్శించి, సంతోషమున వెలుగొందుచున్న వాల్మీకి మిక్కిలి మనోహరుడైన శ్రీరాముని యొక్క చరిత్రమును రచించుటకు పూనుకొనెను. శంఖములు, ముత్యపుచిప్పలు మొదలగు సాధారణవస్తువులు కలిగియున్నను సముద్రము ముఖ్యముగా రత్నాకరమేయైనట్లు రామాయణము కామార్థగుణములను అప్రధానముగా కలిగియున్నను ప్రధానముగా ధర్మమోక్షములనే ప్రతిపాదించును. ఇంకను అది వీనులకు విందొనర్చునది, మనస్సునకు ఆనందమును గూర్చునది - వేదసార సంగ్రహము. [1-3-7, 8]

యథా కథితం పూర్వం నారదేన మహాత్మనా |
రఘు వంశస్య చరితం చకార భగవాన్ మునిః |1-3-9|
నారదమహర్షి ఇదివరలో చెప్పినరీతిగా పరమపూజ్యుడైన వాల్మీకిముని రఘువంశమున అవతరించిన శ్రీరామునియొక్క చరితమును రచించెను. [1-3-9]

జన్మ రామస్య సుమహద్ వీర్యం సర్వానుకూలతాం |
లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్య శీలతాం |1-3-10|
దశరథుని తపఃఫలముగా శ్రీమహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడుగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయనపరాక్రమము, అందఱికిని అనుకూలముగానుండు సత్ప్రవర్తన, అందఱిప్రేమలను చూరగొనుట, ఇతరుల అపరాధములను మన్నించుట, ఎల్లరను అనుగ్రహించులక్షణము, సత్యస్వభావము మొదలగు విషయములను కావ్యమున ముని వర్ణించెను. [1-3-10]

నానా చిత్ర కథాః అన్యాః విశ్వామిత్ర సహాయేన |
జానక్యాః వివాహం ధనుషః విభేదనం |1-3-11|
రామ రామ వివాదం గుణాన్ దాశరథేః తథా |
తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్ట భావతాం |1-3-12|
విఘాతం అభిషేకస్య రాఘవస్య వివాసనం |
రాజ్ఞః శోకం విలాపం పర లోకస్య ఆశ్రయం |1-3-13|
శ్రీరామగాథకు అనుగుణమగు తదితరములైన విచిత్ర కథలను, రామలక్ష్మణులు విశ్వామిత్రునివెంటవెళ్ళి, యాగసంరక్షణ చేయుటను, రాఘవుడు శివధనుర్భంగముగావించుటను, జానకీ-ఊర్మిళా మాండవీశ్రుతకీర్తులతో జరిగిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహములను, శ్రీరామపరశురాముల సంవాదమును, అట్లే శ్రీరాముని ఉదాత్తగుణములను కవి వర్ణించెను. రామునకు యువరాజపట్టాభిషేకప్రయత్నములను, కైకేయి పన్నాగమువలన పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడుటను, శ్రీరాముడు సీతాలక్ష్మణులతోగూడి వనవాసమునకు బయలుదేఱుటను, దశరథుడు పుత్రశోకవిహ్వలుడై స్వర్గస్థుడగుటను మహర్షి వివరించెను. [1-3-11, 12, 13]

ప్రకృతీనాం విషాదం ప్రకృతీనాం విసర్జనం |
నిషాద అధిప సంవాదం సూతోపావర్తనం తథా |1-3-14|
పురజనులు దుఃఖించుట, శ్రీరాముడు వారికన్నుగప్పి వెడలిపోవుట, నిషాదరాజైన గుహునితో సంభాషించుట, రథసారథిగానున్న సుమంత్రుడు అయోధ్యకు మఱలుట, మున్నగు విషయములను ముని వివరించెను. [1-3-14]

గఙ్గాయాః అపి సంతారం భరద్వాజస్య దర్శనం |
భరద్వాజ అభ్యనుజ్ఞాత్ చిత్రకూటస్య దర్శనం |1-3-15|
వాస్తు కర్మ నివేశం భరత అగమనం తథా |
ప్రసాదనం రామస్య పితుః సలిల క్రియాం |1-3-16|
సీతారామలక్ష్మణులు గంగానది దాటుట, వారు భరద్వాజమహామునిని దర్శించుట, ఆయన అనుజ్ఞతో చిత్రకూటమునకు చేరుట, వాస్తుశాస్త్రప్రకారము అచట పర్ణశాలను నిర్మించుట, అందువసించుట, భరతుడు వసిష్ఠాదులతోగూడి శ్రీరాముని దర్శించుట, ప్రసన్నునిజేసికొనుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, భరతుడు శ్రీరాముని పాదుకలను తీసికొని వచ్చి, వాటికి పట్టాభిషేకమొనర్చుట, పిమ్మట అతడు నందిగ్రామమున నివసించుట మొదలగు ఘట్టములను ముని వివరించెను. [1-3-15, 16]

పాదుకా అగ్ర్య అభిషేకం నంది గ్రామ నివాసనం |
దణ్డకారణ్య గమనం విరాధస్య వధం తథా |1-3-17|
దర్శనం శరభఙ్గస్య సుతీక్ష్ణేన సమాగమం |
అనసూయా సమాఖ్యా అఙ్గరాగ్స్య అర్పణం |1-3-18|
శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించుట, విరాధుని వధించుట, శరభంగుని దర్శించుట, సుతీక్ష్ణుని గలిసికొనుట, అత్ర్మహర్షి ఆశ్రమమునకు చేరుట, అచ్చట అనసూయాదేవి సీతాదేవికి దివ్యచందనాదులను సమర్పించుట, అగస్త్య మహామునిని దర్శించుట, ఆయననుండి ధనుర్భాణములను గైకొనుట, జటాయువుతో సమాగమము, పంచవటిలో నివాసము శూర్పణకరాక మున్నగు విషయములు తెలుపబడినవి. [1-3-17, 18]

దర్శనం అపి అగస్త్యస్య ధనుషో గ్రహణం తథా |
శూర్పణఖాః సంవాదం విరూపకరణం తథా |1-3-19|
వధం ఖరః త్రిశిరసః ఉత్థానం రావణస్య |
మారీచస్య వధం ఏవ వైదేహ్యా హరణం తథా |1-3-20|
శూర్పణకతో సంవాదము, ఆమెముక్కుచెవులను ఖండించుట, రాముడు ఖరదూషణత్రిశురులను సంహరించుట, రావణుడు మారీచునితోగూడి పంచవటికి చేరుట, శ్రీరామునిచే మారీచసంహారము, రావణునిచే సీతాపహరణము, శ్రీరాముడు సీతాదేవికై విలపించుట, జటాయుమరణము, మొదలగు అంశములు వివరింపబడినవి. [1-3-19, 20]

రాఘవస్య విలాపం గృధ్ర రాజ నిబర్హణం |
కబంధ దర్శనం ఏవ పంపాయాః అపి దర్శనం |1-3-21|
శబరీ దర్శనం ఏవ ఫల మూల అశనం తథా |
ప్రలాపం ఏవ పంపాయాం హనుమద్ దర్శనం |1-3-22|
ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం |
ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం |1-3-23|
వాలి ప్రమథనం ఏవ సుగీవ ప్రతిపాదనం |
తారా విలాపం సమయం వర్ష రాత్ర నివాసనం |1-3-24|
కబంధుని, శబరిని దర్శించిన పిమ్మట, శ్రీరాముడు దుఃఖముతో పంపాతీరమునకు చేరుట, హనుమంతుని గలిసికొనుట, ఋష్యమూకపర్వతమునకు చేరి, సుగ్రీవుని గలియుట, రామసుగ్రీవమైత్రి, పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసము కలిగించుట, వాలిసుగ్రీవులయుద్ధము, రామునిచే వాలివధ, సుగ్రీవుని కిష్కింధకు రాజును జేయుట, తారావిలాపము, రామలక్ష్మణులు వర్షాకాలములో ప్రస్రవణ గిరిపై గడుపుట, మొదలగు ఘట్టములు వివరింపబడెను. [1-3-21, 22, 23, 24]

కోపం రాఘవ సింహస్య బలానాం ఉపసంగ్రహం |
దిశః ప్రస్థాపనం ఏవ పృథివ్యాః నివేదనం |1-3-25|
అఙ్గులీయక దానం ఋక్ష్స్య బిల దర్శనం |
ప్రాయోపవేశనం అపి సంపాతేః అపి దర్శనం |1-3-26|
సుగ్రీవునిఉపేక్షకు శ్రీరాముడు కుపితుడగుట, సేనల సమీకరణము, సుగ్రీవుడు నలుదిక్కులకును వానరయోధులను పంపుచువారికి భౌగోళికాంశములను దెలుపుట, శ్రీరాముడు హనుమంతునకు అంగుళీయకమును ఇచ్చుట, జాంబవదాదులు స్వయంప్రభను దర్శించుట, ప్రాయోపవేశమునకు సిద్ధపడిన అంగదాదులు సంపాతిని దర్శించుట మున్నగు అంశములు వర్ణితములు. [1-3-25, 26]

పర్వత ఆరోహణం అపి సాగర్స్య అపి లఙ్ఘనం |
సముద్ర వచనాత్ ఏవ మైనాకస్య దర్శనం |1-3-27|
రాక్షసీ తర్జనం ఏవ ఛాయా గ్రాహస్య దర్శనం |
సింహికాయాః నిధనం లఙ్కా మలయ దర్శనం |1-3-28|
రాత్రౌ లంకా ప్రవేశం ఏకస్య అపి విచింతనం |
ఆపాన భూమి గమనం అవరోధస్య దర్శనం |1-3-29|
మహేంద్రగిరినుండి హనుమంతుని సముద్రలంఘనము, సముద్రునిప్రేరణతో మైనాకునిఆతిథ్యప్రయత్నము, సురసను జయించుట, సింహికను వధించుట, లంకామలయపర్వతముల దర్శనము, రాత్రియందు మారుతి లంకలో ప్రవేశించి, ఒంటరిగా ఆలోచించుట, పానభూమిని, అంతఃపురమును గాలించుట, రావణుని దర్శించుట, పుష్పకమును పరిశీలించుట మున్నగు ఘట్టములు వక్కాణింపబడినవి. [1-3-27, 28, 29]

దర్శనం రావణస్య అపి పుష్పకస్య దర్శనం |
అశోక వనికాయానం సీతాయాః అపి దర్శనం |1-3-30|
అభిజ్ఞాన ప్రదానం సీతాయాః అపి భాషణం |
రాక్షసీ తర్జనం ఏవ త్రిజటా స్వప్న దర్శనం |1-3-31|
మారుతి అశోకవనమునకు చేరుట, రావణుడు సీతను భయపెట్టుట, హనుమంతుడు సీతమ్మను దర్శించుట, ఆమెకు అంగుళీయకమును సమర్పించుట, ఆమెతో సంభాషించుట, రాక్షసస్త్రీలు సీతాదేవిని భయపెట్టుట, త్రిజటాస్వప్నవృత్తాంతము, సీతాదేవి చూడామణిని హనుమంతునకు ఇచ్చుట, మారుతి అశోకవనమును ధ్వంసమొనర్చుట - అను విషయములు వర్ణితములు. [1-3-30, 31]

మణి ప్రదానం సీతాయాః వృక్ష భంగం తథ ఏవ |
రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణం |1-3-32|
గ్రహణం వాయు సూనోశ్చ లంకా దాహ అభిగర్జనం |
ప్రతి ప్లవనం ఏవ అథ మధూనాం హరణం తథా |1-3-33|
హనుమంతునకు భయపడి రాక్షసస్త్రీలు పాఱిపోవుట, కింకరనామకరాక్షసులను, తదితరరాక్షసయోధులను మారుతి మట్టుపెట్టుట, బ్రహ్మాస్త్రముచే బంధితుడైన వాయుసుతుడు రావణసభకు చేరుట, లంకను గాల్చుట, సముద్రముపై తిరుగుప్రయాణము, వానరులచే మధుభక్షణము, ఆంజనేయుడు రాముని ఓదార్చుట చూడామణిని సమర్పించుట మొదలగు అంశములు తెలుపబడినవి. [1-3-32, 33]

రాఘవ ఆస్వాసనం చైవ మణి నిర్యాతనం తథా |
సంగమం సముద్రేణ నల సేతోః బంధనం |1-3-34|
ప్రతారం సముద్రస్య రాత్రౌ లంకా అవరోధనం |
విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం |1-3-35|
శ్రీరాముడు సైన్యములతో సముద్రతీరమునకు చేరుట, నలుడు సముద్రముపై సేతువును నిర్మించుట, సముద్రమును దాటి, రాత్రివేళ లంకను ముట్టడించుట, విభీషణశరణాగతి, రాక్షసయోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరామునకు తెల్పుట, కుంభకర్ణమేఘనాదులసంహారము మున్నగు విషయములు వర్ణితములు. [1-3-34, 35]

కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం |
రావణస్య వినాశం సీతావాప్తిం అరేః పురే |1-3-36|
విభీషణ అభిషేకం పుష్పకస్య దర్శనం |
అయోధ్యాయాః గమనం భరద్వాజ సమాగమం |1-3-37|
ప్రేషణం వాయు పుత్రస్య భరతేన సమాగమం |
రామ అభిషేక అభ్యుదయం సర్వ సైన్య విసర్జనం |
స్వ రాష్ట్ర రంజనం ఏవ వైదేహ్యాః విసర్జనం |1-3-38|
అనాగతం యత్ కించిద్ రామస్య వసుధా తలే |
తత్ చకార ఉత్తరే కావ్యే వాల్మీకిః భగవాన్ ఋషిః |1-3-39|
శ్రీరాముడు రావణుని పరిమార్చుట, సీతాదేవిని చేరదీయుట, విభీషణుని లంకాధిపతిని గావించి, పుష్పకమును అధిరోహించుట - విమానముపై అయోధ్యకు బయలుదేరుట, భరతునిగలియుట, శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడగుట, వానరసైన్యములను వారివారి ప్రదేశములకు పంపివేయుట, ప్రజానురంజకముగా శ్రీరాముని పరిపాలనము, మున్నగు ఘట్టములు వర్ణింపబడినవి. ఇంతవరకునుగల రామాయణ కావ్యవిశేషములన్నియును ఆఱుకాండాములుగా వాల్మీకి మునిచే రచింపబడినవి. "సీతా పరిత్యాగము"ను, తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరకాండమున వివరించెను. [1-3-36, 37, 38, 39]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే తృతీయస్సర్గః |1-3|
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు మూడవసర్గము సమాప్తము







Om Tat Sat


(Continued ....)


(My humble salutations to the lotus feet of  Swamy jis, Philosophic Scholars and greatful to Wikisource  for the collection)

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Blog Archive

Visitors

Labels

Blog Archive