Valmiki Ramayanam - Balakanda - Part 5







ఐదవసర్గము
అయోధ్యానగరవర్ణనము


సర్వా పూర్వం ఇయం యేషాం ఆసీత్ కృత్స్నా వసుంధరా |
ప్రజపతిం ఉపాదాయ నృపాణం జయ శాలినాం |1-5-1|
యేషాం సగరో నామ సాగరో యేన ఖానితః |
షష్టిః పుత్ర సహస్రాణి యం యాంతం పర్యవారయన్ |1-5-2|
ఇక్ష్వాకూణాం ఇదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం |
మహద్ ఉత్పన్నం ఆఖ్యనం రామాయణం ఇతి శ్రుతం |1-5-3|
తదిదం వర్తయిష్యావః సర్వం నిఖిలం ఆదితః |
ధర్మ కామ అర్థ సహితం శ్రోతవ్యం అనసూయతా |1-5-4|
సప్తద్వీపములతోగూడిన సమస్త భూమండలమున మనుప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈవంశమున సగరుడనువాడు సుప్రసిద్ధుడు. సగరునిఆఱువేలమంది కుమారులును యజ్ఞాశ్వనిమిత్తమై సముద్రమును త్రవ్విరి. కావునదానికి సాగరము అని పేరు వచ్చెను. ఇక్ష్వాకువంశమున మహానుభావులైన ఎందఱో రాజులు జన్మించి, వంశమునకు వన్నెదెచ్చిరి. అట్టి మహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహప్రభావమున రూపుదిద్దుకొనిన రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మాకామార్థములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోషదృష్టియు లేకుండ వినవలసినది, పఠించవలసినది. [1 - 4]

కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ |
నివిష్ట సరయూ తీరే ప్రభూత ధన ధాన్యవాన్ |1-5-5|
సరయూనదీతీరమున "కోసల" అను సుప్రసిద్ధదేశము గలదు. అది ధనధాన్యసంపదలతో తులతూగుచున్నది. కనుక అచటిజనులు మిక్కిలి సంతుష్టులైయుండిరి. [5]

అయోధ్యా నామ నగరీ తత్ర ఆసీత్ లోక విశ్రుతా |
మనునా మానవ ఇంద్రేణ యా పురీ నిర్మితా స్వయం |1-5-6|
ఆయతా దశ ద్వే యోజనాని మహాపురీ |
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సు విభక్తా మహాపథా |1-5-7|
రాజ మార్గేణ మహతా సువిభక్తేన శోభితా |
ముక్తా పుష్ప అవకీర్ణేన జల సిక్తేన నిత్యశః |1-5-8|
కోసలదేశమున "అయోధ్య" అను పేరుగల ఒక మహానగరము గలదు. పురమును మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింపజేసెను. కారణముగా అది లోకప్రసిద్ధి వహించెను. మహానగరము పండ్రెండు యోజనముల పొడవును, మూడుయోజనముల వెడల్పును గలిగి మిక్కిలి విశాలమై అపుర్వశోభలతొ విలసిల్లుచున్నది. అచటివీధులు ఇరువైపుల వృక్షములతో విరాజిల్లుచు విశాలములై యున్నవి. పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూలవృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన రాజమార్గము చెట్లనుండి రాలిన పుష్పములతో నిండి, చూడముచ్చటగానున్నది. [6 - 8]

తాం తు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః |
పురీం ఆవాసయామాస దివి దేవపతిః యథా |1-5-9|
కోసలదేశమును ధర్మమార్గమున పరిపాలించుచున్న దశరథమహారాజు దేవేంద్రుడు అమరావతినివలె అయోధ్యాపుర వైభవమును ఇనుమడింపజేసెను. [9]

కపాట తోరణవర్తీ సు విభక్త అంతరాపణాం |
సర్వ యంత్ర అయుధవతీం ఉషితాం సర్వ శిల్పిభిః |1-5-10|
సూత మాగధ సంబాధాం శ్రీమతీం అతుల ప్రభాం |
ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్నీ శత సంకులాం |1-5-11|
పురము ప్రశస్తమైన ద్వారములతోడను, ద్వారబంధములతోడను అలరారుచుండెను, నగర మధ్యభాగమున వరుసలు దీరియున్న అంగళ్ళతో అది మనోహరముగానుండెను. అచ్చట వివిధములగు యంత్రములు, ఆయుధములు అమర్చబడి యుండెను. అన్ని కళలయందును నిపుణులైన శిల్పులు నగరమున ఉండిరి. అందు వాసిగాంచిన స్తుతిపాఠకులు, వందిమాగధులు గలరు, అది ధనధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోటబురుజులతోను, ధ్వజములతోను, వందలకొలది శతఘ్నులతోను పురి రాజిల్లుచుండెను. [10 - 11]

వధూ నాటక సంఘైః సంయుక్తాం సర్వతః పురీం |
ఉద్యాన ఆమ్ర వణోపేతాం మహతీం సాల మేఖలాం |1-5-12|
దుర్గ గంభీర పరిఖాం దుర్గాం అన్యైః దురాసదం |
వాజీవారణ సంపూర్ణాం గోభిః ఉష్ట్రైః ఖరైః తథా |1-5-13|
పురి నృత్యకళాకుశలురైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టునుగల విశాలమైన ప్రాకారము పురికి ఒడ్డాణమువలె మనోజ్ఞముగానుండెను.దాని చుట్టును విశాలమైన లోతైన అగడ్తయు, శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలవు. అందు మేలుజాతికి చెందిన గుఱ్ఱములు, వేగముగాసాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు, అసంఖ్యాకముగా గలవు. [12 - 13]

సామంత రాజ సంఘైః బలి కర్మభిః ఆవృతం |
నానా దేశ నివాసైః వణిగ్భిః ఉపశోభితాం |1-5-14|
ప్రాసాదై రత్న వికృతైః పర్వతైః ఇవ శోభితాం |
కూటాగారైః సంపూర్ణాం ఇంద్రస్య ఇవ అమరావతీం |1-5-15|
కప్పములను చెల్లించుటకై వచ్చెడి సామంతరాజులసందడితో నగరము కలకలలాడుచుండెను. క్రయవిక్రయములకై ఏతెంచెడి వివిధదేశవాసులైన వ్యాపారులతో అది క్రిక్కిరిసి యుండెను. రత్నములు పొదిగిన రాజగృహములతోడను, క్రీడాపర్వతములతోడను, అంతస్తులతోగూడిన మేడలతోను ఒప్పుచు అది ఇంద్రుని అమరావతినగరమువలె విరాజిల్లుచుండెను. [14 - 15]

చిత్రం అష్టాపద ఆకారాం వర నారీ గణైర్ యుతాం |
సర్వ రత్న సమాకీర్ణాం విమాన గృహ శోభితాం |1-5-16|
గృహ గాఢాం అవిచ్ఛిద్రాం సమ భూమౌ నివేశితాం |
శాలి తణ్డుల సంపూర్ణాం ఇక్షు కాణ్డ రసః ఉదకాం |1-5-17|
జూదపు పలకవలె "అష్టాపదాకారములోనున్న చిత్రచిచిత్రములైన రాజగృహములతో అదియొప్పుచుండెను. అది అందమైన సుందరీమణులతో అలరారుచుండెను. నానావిధరత్నశోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శొభిల్లుచుండెను. అచటిగృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములును లేకుండ సమతలముపై నిర్మింపబడి క్రిక్కిరిసియుండెను. పురము మేలైన వరిబియ్యముతో, చెఱకురసమువంటి మధురజలములతో సమృద్ధమై యుండెను. [16 - 17]

దుందుభీభిః మృదంగైః వీణాభిః పణవైః తథా |
నాదితాం భృశం అత్యర్థం పృథివ్యాం తాం అనుత్తమాం |1-5-18|
విమానం ఇవ సిద్ధానాం తపస అధిగతం దివి |
సు నివేశిత వేశ్మాంతాం నరోత్తమ సమావృతాం |1-5-19|
దుందుభులమ్రోతలతో, మృదంగధ్వనులతో, వీణానాదములతో, మద్దెలరవములతో మహానగరము అంతయు మాఱుమ్రోగుచుండెను. సిద్ధపురుషులకు తపఃఫలముగా లభించిన దివ్య భవనములవలె నగరమునందలి గృహములు బారులుదీఱి, విద్వాంసులతో నిండియుండెను. [18 - 19]

యే బాణైః విధ్యంతి వివిక్తం అపరా పరం |
శబ్ద వేధ్యం వితతం లఘు హస్తా విశారదాః |1-5-20|
సింహ వ్యాఘ్ర వరాహాణాం మత్తానాం నదతాం వనే |
హంతారో నిశితైః శస్త్రైః బలాత్ బాహు బలైర్ అపి |1-5-21|
తాదృశానాం సహస్రైః తాం అభి పూర్ణాం మహారథైః |
పురీం ఆవసయమాస రాజా దశరథః తదా |1-5-22|
నగరమునందలి యోధులు, శస్త్రాస్త్రవిద్యలలో ఆరితేఱినవారు, సమర్థులు, శబ్దభేది విద్యానిపుణులు. కాని వారు సహాయపడువారులేక ఒంటరిగానున్నవారినిగాని, పాఱిపోవుచున్నవారినిగాని చంపెడువారు గారు. వనమునందు మత్తిల్లి గర్వముతో గర్జించెడి సింహములను, గాండ్రించు పెద్దపులులను, ఝర్ఘరించు అడవిపందులను యోధులు ధీరులై వాడియైన శస్త్రములతో, బాహుబలముతో సంహరించుచుండెడివారు. అట్టి వేలకొలది మహారథులతో నిండియున్న అయోధ్యానగరమును దశర్థమహారాజు పరిపాలించుచుండెను. [20 - 22]

తాం అగ్నిమద్భిః గుణవద్భిః ఆవృతాం
ద్విజోత్తమైః వేద షడఙ్గ పారగైః |
సహస్రదైః సత్య రతైః మహాత్మభిః
మహర్షి కల్పైః ఋషిభిః కేవలైః |1-5-23|
అచటి ద్విజోత్తములు అందఱును నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణసంపన్నులు, వేదవేదాంగములయందు పారంగతులు, సత్యమును పల్కుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతో సమానులు. అంతేగాదు వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్యానగరమును రాజధానిగా జేసికొని, దశరథమహారాజు కోసలదేశమును పరిపాలించుచుండెను. [23]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచమస్సర్గః |1-5|
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ఐదవసర్గము సమాప్తము






Om Tat Sat


(Continued ....)


(My humble salutations to the lotus feet of  Swamy jis, Philosophic Scholars and greatful to Wikisource  for the collection)

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Blog Archive

Visitors

Labels

Blog Archive