నీతి కథలు - 9
























నీతి కథలు






 యుధిష్ఠిరుని ధర్మబుద్ధి




మహాభారతము లోని కథ
చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్ద పుణ్యకథలు వినిన తరువాత ధర్మాత్ములైన పాండవులు పరమసాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ధౌమ్యుల వారు ద్వైతవనానికి చేరారు. అక్కడ ఉండగా ఒక రోజు ఒకానొక భూసురోత్తముడు పఱుగులిడుతూ వచ్చి ఓ ధర్మనందనా! యజ్ఞార్థము నేను అరణి (నిప్పు పుట్టించెడు కొయ్య) అరణ్యమునుండి కొనివచ్చి వాటిని ఒక తరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచుండగా ఒక జింక ఎక్కడి నుంచో పఱుగు పఱుగున వచ్చి ఆ వృక్షము ప్రక్కగా వెళ్ళినంత దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకుని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్యకర్మకు అంతరాయం కలుగ కుండా నా అరిణి తెచ్చి కాపాడుఅని వేడుకున్నాడు.
ఆర్తరక్షణే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపున పఱుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పఱుగెట్టారు పాండవులు. తీవ్రమైన అలసట దప్పిక వారిని బాధించాయి అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనేవున్నారు. చివరికి వారు దట్టమైన కాఱడవి లోపలికి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమఱుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలంకాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మఱ్ఱిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడునిరంతరము సత్యమార్గమును అనుసరించుచూ ధర్మముతప్పకుండా చెరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో? ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేక పోతున్నామే. హతవిధి”! అది విని ప్రాజ్ఞుడైన యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చాడు
నాయనా! సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మ బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలము దుష్కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం. కర్మ వశముగా కాక ఏదీ జరుగదు”. భీమసేడు ఆ సత్యవాక్కులు విని అయితే పరసతి పరమపతివ్రత పైగా ఏకవస్త్ర (రజస్వల) గా ఉన్న పాంచాలీ దేవిని కురుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చిన అతిదురాత్ముడైన దుశ్శాశనుని అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకి ఈ దుర్గతి పట్టి ఉండ వచ్చుఅని అన్నాడు. అది విని శ్రీ కృష్ణ ప్రియ సఖుడైన అర్జునుడిలా అన్నాడు ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టంవచ్చినట్టు కురువృద్ధుల ముందర నోటికివచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరుమూయించక ఓర్చుకున్నందుకే మనకీ దుఃఖములు”. అప్పుడు సహదేవుడు దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జ్యూదం ఆడి మనలను మోసగించినపుడే దుష్టశిక్షణ చేయనందులకే మనకీ దుర్గతి పట్టినదిఅని అన్నాడు (జ్యూదంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనంవొడ్డి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని ఆంతర్యం).
ఇలా వేవిధాల మాటలాడు తున్న సోదరులను చూచి అజాతశత్రుడైన పాండవాగ్రజుడు నకులునితో ఇలా అన్నాడు నాయనా! నీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలుకడపట్టుకు ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు”. వెంటనే నలుకుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకు రాఅని నకులునితో అన్నాడు. నకులుడు వెళ్ళి తటాకములోని నీరు త్రాగబోతుండగా ఒక అశరీరవాణి ఇలా పలికింది ఓ మాద్రీనందన! ఈ జలములు నా ఆధీనములో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచు కుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు”. దాహముతో తపిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్ళు త్రాగినాడు. మఱుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు.
ఆ తరువాత సహదేవ అర్జున భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకములో నుండీ నీరు త్రాగి మృతుల వలె ఆ తీరమువద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుకుతూ చివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. యుధిష్ఠిరుడు తీరమువద్ద పడివున్న తన ప్రియ సోదరులను చూచి ఆశ్చర్యపోయాడు. వారికేమైనదో అని దుఃఖించాడు. అసమానశూరులు వీరాధివీరులైన ఆ నలుగురు ఏ కారణంబుగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీ దేవికి ఈ విషయము తెలిసిన ఎంత దుఃఖించునో అని తలచినాడు. భీష్మ విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి?” అని ఇట్లు పరిపరి విధముల వగచి దాహముతో ప్రాణాలుపోతున్న ఆ ధర్మజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించెను. మఱల ఆ అశరీరవాణి ఇట్లనియె నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించిరి. నీవీనీరు త్రాగవలెనన్న నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను”. “అయ్యా! నీవు శివుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో ఇంద్రుడవో? ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవరు కల్పించగలరు? నాయందు దయ ఉంచి మీ నిజరూపంబు చూపి నా భయము తొలగించండిఅని వేడుకొనిన అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు యుధిష్ఠిరుని ఎదుట నిల్చి నా ప్రశ్నలకు ఉత్తరములు ఈమని అడిగెను. సహజ వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి దేవా మీ చిత్తము. కానీ నాబోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తానుఅని అన్నాడు.
ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మజుడు అద్భుతరీతలో ఉత్తరములను ఇచ్చినాడు. సంతృప్తుడైన యక్షుడు మహాత్మా! నా ప్రశ్నలన్నిటికీ నీవు సదుత్తరములు ఇచ్చి నన్ను మెప్పించినావు. నీ తమ్ములలో ఒకని ప్రాణంబులిచ్చెద. కోరుకొనుముఅని వరమొసంగినాడు. శ్యామాంగుడైన నకులుని బ్రతికించ మని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు భీమార్జునులు అతిభీమబలులు. భీమసేనుడు అతని భుజబలముచే నిన్ను నీ సోదరులను అనేక మాఱ్లు మత్సరముచే చంపాలనుకొన్న దుర్యోధనుని కుయుక్తుల బాఱినుండి కాపాడినాడు. ఇక అర్జునునికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. ఆతడే మఱల నీ రాజ్యము నీకు అప్పించగలడు. వీరిలో ఒక్కరిని కోరక నకులుని ఎందులకు కోరినావు”? సమవర్తి అయిన యుధిష్ఠిరుడు ఇలా ధర్మ్యము మాట్లాడినాడు కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాత యగు మాద్రీదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బ్రతకాలి కదా! అందుకే నకులుని బ్రతికించమని కోరినాను. ఇట్లు కాక అన్యుల బ్రతికించమని కోరి అధర్మము చేయలేను”. ధర్మజుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు నీ తమ్ములందఱిని బ్రతికించెదనుఅని కరుణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహమూ తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూచి ఆశ్చర్యపోయి దేవా! నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో వరుణుడవో అగ్నివో వాయుదేవుడవో లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుముఅని ప్రార్థింప ధర్ముడు కరుణించి తన నిజ స్వరూపము చూపి వారికి ఆనందము కలిగించినాడు.
ఓ రాజా! నేను యమధర్మరాజును. సత్యము శౌచము దయ దానం తపం శమము దాంతి యశము జ్ఞానము యుక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మవర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావలయునో కోరుకొనుముఅని కాలుడు అడిగినాడు. అప్పుడు పాండవాగ్రజుడు ఆ ధర్ముని స్తుతించి అయ్యా! నా ఆశ్రమము వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరిణము ఎత్తుకుపోయింది. ఆ మహనీయుని నిత్యకర్మకు లోపము రాకుండా అతనికి ఆ అరణి ఇప్పించు స్వామి”! అని కోరినాడు. అంతట ఆ ధర్ముడు తానే మృగ రూపమున వచ్చెనని ధర్మరాజుకు ఎఱింగించి అతనికి విప్రుని అరణి ఇచ్చెను. నాయనా! రానున్న అజ్ఞాతవాసములో మీకు కావలిసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలుగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తిచేయగలుగుతారు. నాయనా ధర్మరాజా! నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరమిస్తాను కోరుకోఅని కాలుడన్నాడు. అప్పుడు ధర్మనందనుడుస్వామీ! నీ అనుగ్రహము కన్న నాకు కావలసిన దేమున్నది. నా మనసులో అప్పుడూ క్రోధమోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మమార్గాన ఉండేటట్లు ఆశీర్వదించండిఅని కోరినాడు. అటులనే దీవించించి యముడు అదృశ్యమయ్యాక పాండవులు ఆశ్రమము చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందముగ ఉండసాగిరి.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:

సజ్జనులు ఎన్నడూ ధర్మమార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మవర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకో మనినప్పుడు ధర్మజుడు తనకై ఏదీ కోరకుండా విప్రుని అరణి ఇప్పించమని కోరినాడు




సత్యసంధః




శ్రీమద్రామాయణం లోని కథ
మునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు.
ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందఱికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని స్తుతించి సమస్త ముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ ప్రదేశములలో చాలా చోట్ల పుఱ్ఱెలు ఎముకల గుట్టలు కానవచ్చెను. పవిత్రమైన ఈ తపోభూములలో ఈ అస్థికలు ఎలా వచ్చాయి”? అని ప్రశ్నించాడు స్వామి. వారుసర్వేశ్వరా! సమాధిస్థితిలో ఉన్న మునీశ్వరులను దుష్టులైన రాక్షసులు తనివేయగా మిగిలిన ఎముకలివిఅని తమ దైన్యతు వ్యక్తపఱచినారు. కళ్ళుచెమ్మగిల్లిన స్వామి ఈ దండకారణ్యమును రాక్షసులనుండి విముక్తము చేసెదనుఅని ప్రతిజ్ఞ చేసెను. పరమానందముతో మునులు ధర్మస్థాపకుడైన శ్రీ రామునికి జయ జయ ధ్వానాలు చేసినారు.
సీతారామలక్ష్మణులు అగస్త్యమునిని సేవించి సుతీక్షుని వద్ద సెలవు తీసుకుని పంచవటికి వస్తుండగా పరమ సాధ్వీమణి లోకమాత జానకీ ఈ విధముగా భర్తతో మధుర సంభాషణము చేసినది ప్రాణనాథా! ధర్మవర్తనము అతి సూక్షమైన పద్ధతిని అవలంభించవలెను. ఎవడైతే ప్రలోభాలకు వ్యసనాలకూ దూరముగా ఉంటాడో వాడే సర్వదా ధర్మపరుడై ఉండగలడు. మనము ప్రస్తుతము మునివేషములలో ఉన్నాము. తపము ఆచరించుట మన కర్తవ్యం. తపస్సునకు శాంతి పునాది. అయిననూ మనము ధనుర్బాణములు ఏల ధరించి రాక్షసులను సంహరించుచున్నాము?”. రాక్షసులతో ప్రత్యక్షముగా వైరము లేకుండానే మునులను రక్షించుట అనే వ్యసనంతోరాక్షసులను సంహరించుట తనకు ఇష్టములేదన్నట్టు సూచిస్తూ ఆ పతివ్రతాశిరోమణి శ్రీ రామునకు ఈ నీతికథ చెప్పినది
పూర్వం ఒక మునివల్లభుడు ప్రశాంతమైన ఓ ఆశ్రమములో తపమాచరిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది. ఆయన సత్యప్రభావముచే జంతువులు కూడా సహజ వైషమ్యాలను మఱచి హాయిగా సహజీవనం చేసేవి. అలా ఉండగా దేవేంద్రుడు అతని పరీక్షించుటకై భటుని వేషంలో వచ్చి స్వామీ! ఈ కత్తిని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్ళీ వచ్చి నేను తీసుకుంటానుఅని అన్నాడు. ఎంతో కాలము ఆ ఆయుధం సమీపంలో ఉన్న కారణముగా ఆ మునిలో క్రూర లక్షణాలు బైటపడ్డాయి! ఆయుధం దగ్గర ఉండుటచే ఆ ముని తన కర్తవ్యాన్ని విస్మరించి హింసమీద అభిరుచి కలిగినవాడై క్రూర కృత్యాలుచేసి చివరికి ఘోర నరకమును పొందినాడు. తపస్సు చేసే మనమెక్కడ? దుష్టసంహారం చేసే క్షత్రియ ధర్మమెక్కడ? స్వామీ! చపల బుద్ధితో నాకు తెలిసినది చెప్పాను. నీవు సత్యసంధుడవు. ఏది సత్యమో ఏది అసత్యమో నీవే నిర్ణయించుఅని అనిన జానకితో శ్రీ రాముడిలా ఉన్నాడు
దండకారణ్యము లోని మునులు నిరాడంబరముగా తపస్సు చేయుచుండగా మాంసభక్షకులైన రాక్షసులు వారిని భక్షిస్తున్నారు. ఈ మునీశ్వరులు ఆ మదాంధులకు శాపం ఇచ్చుటకు సమర్థులై కూడా శాపం ఇవ్వలేదు. వారిని చంపినా కూడా కోపము తెచ్చుకోకుండా పరమశాంత చిత్తంతో తపమాచరిస్తున్నారు. దీనులై నన్ను ఆశ్రయించినప్పుడు రాక్షస సంహారము చేసెదనని ప్రతిజ్ఞ చేసినాను. అసలు ఆ యోగులు అడిగేవరకూ నేను ఆగనక్కరలేదు. ఎందుకంటే నా తండ్రిగారు భరతునకు నగర రాజ్యము నాకు వనరాజ్యము ప్రసాదిస్తున్నానని స్పష్టముగా చెప్పిరి. కావున తపముచేసినా దుష్టులను శిక్షించటం ఆర్తులను రక్షించటం వనరాజుగా నా కర్తవ్యం.
సీతా! నేను నా ప్రాణాలనైనా వదులుతా. నా ప్రియభ్రాత అయిన లక్షణునైనా విడనాడుతాను. చివరకు నా హృదయేశ్వరివైన నిన్నైనా వదులుతాను కానీ సత్యమును మాత్రమూ ఎన్నడునూ వీడజాలను! అందునా ఇట్టి తాపసులకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఎప్పటికీ విడువలేను”. ఇలా అద్భుతంగా సంభాషణము చేసి సుందరములైన వనభూముల వైపు నడువసాగారు. ఇట్టి సత్యసంధుడైన శ్రీ రాముని పాద స్పర్శ పొందిన ఈ భారతభూమి ధన్యం. భారతీయులు ధన్యులు.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1.     వ్యాస భగవానుడు చెప్పినట్టు సత్యం ఈ 13 విధాలైనది: నిష్పక్షపాతం ఆత్మనిగ్రహం అణకువ సిగ్గు ఓరిమి తాలిమి సంయమం దయ అహింస అనసూయత త్యాగం చింతన శీలసంపద. ఇన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి వీటిని అనుసంధానము చేసుకుని ఎల్లవేళలా సత్యమే ఆచరించినాడు శ్రీ రాముడు. ధర్మసమ్మతమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను కాపాడటానికి ఏమైనా వదులుతాను కానీ సత్యాన్ని మాత్రము విడువనని అన్నాడు.
2.     మంచైనా చెడైనా చాలాకాలం సహవాసం చేస్తే ఆ గుణాలకు దెగ్గరవుతాయనే నీతికథను మనకు సీతమ్మ చెప్పినది. అందుకే మనపెద్దలు సత్సంగత్యమే చేయమని అంటారు




హీరాకానీ



శివాజీ వీరగాధలలోని కథ
దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాపించలేదు. నిదురిస్తున్న కేసరముల వంటి భారతీయులలో గుండెలలో మఱిచిపోయిన ధర్మాన్ని మాతృదేశభక్తిని ప్రతిష్ఠించినాడు. ఆదర్శ పురుషుడైన శివాజీ రాజభోగాలను తృణప్రాయంగా ఎంచేవాడు. అప్పటి కాలంలోని ఇతర నవాబులవలె కాకుండా వ్యసనాలకు దూరముగా ఉండేవాడు శివాజీ.
భారతీయతత్త్వాన్ని బాగా జీర్ణించుకున్న శివాజీ తన రాజ్యాన్ని సర్వసంగ పరిత్యాగి ఐన సన్యాసికి దానంచేసి అతని ప్రతినిధిగా ప్రజాక్షేమం కోసం రాజ్యం చేశాడు. ఎప్పుడూ ప్రజలపై అధిక పన్నులు వేయలేదు. తన పట్టాభిషేకానికి కూడా తన ధనమే వినియోగించినాడు కానీ ప్రజల సొమ్ము ముట్టుకోలేదు.
శివాజీ రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది. ప్రొద్దున ఆఱింటికి తెఱిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ. రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడదు.
హీరాకానీ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అందఱికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది. పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.
కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలిఅని ప్రాధేయపడింది. హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు తల్లీ రాజాజ్ఞ మేము మీఱలేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలుపడతాడులే. ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం ఆఱవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాముఅని ఊఱడించినారు.
మఱునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు. ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.
ఇంతలో హీరాకానీ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!అని ప్రార్థించింది హీరాకానీ.
శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానీకి అందఱూ చూస్తుండగా సాష్టాంగవందనం చేశాడు! అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతానుఅని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకానీబురుజు అనే పిలవబడుతోంది



పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
1.     ఒక స్త్రీకి మాతృమూర్తికి భారతీయులు ఇచ్చే గౌరవం ఈ కథలో మనకు స్పష్టముగా తెలుస్తున్నది. ఛత్రపతి అయివుండికూడా శివాజీ అందఱిముందూ సామాన్యురాలైన హీరాకానీ పాదాలపై పడి నమస్కరించెను.
2.     తనకు ఎన్ని పనులున్నా ప్రసవవేద పడుతున్న సైనికుని భార్యకు సహాయపడి తన పరోపకార బుద్ధిని మనకు నేర్పింది హీరాకానీ.
3.     ఎంత హీరాకానీ మీద జాలి ఉన్నా రాజాజ్ఞను గౌరవించి వారి కర్తవ్యాన్ని పాలించి సేవాధర్మాన్ని కాపాడిన కావలి వాళ్ళు ధన్యులు.




మయూరధ్వజుని కథ




మహాభారతం లోని కథ
ధర్మరాజు చేసే అశ్వమేధయాగం లోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు అమితపరాక్రమవంతుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి వచ్చారు శ్రీ కృష్ణార్జునులు. శ్రీ కృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్దనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణారుజునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. ఈతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదాఅని అడిగిన అర్జునునితో శ్రీ కృష్ణుడు ఫల్గుణా! నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. ఈతని ధర్మబుద్ధి నీకెఱిగించెదఅని అన్నాడు.
మఱునాడు శ్రీ కృష్ణార్జునులు విప్రవేషం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్ళారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మాఱువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తరువాతే మేము ఇతరములు ఆలోచిస్తాము”. “అయ్యా! మీ కష్టమేమిటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తానుఅని మయూరధ్వజుడు వేడినాడు. రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికిందిమయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు”. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నానుఅని శౌరి బదులిచ్చాడు.
ఆహా! ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. దీని కన్నా నేను కోర తగ్గది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండిఅని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని వుంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకోని మయారధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీ కృష్ణార్జునులకు ఓ వింత కనబడింది.
మయూరద్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్ళు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషముగా మనస్ఫూర్తిగా చాస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైచ్యమ్”.
అయ్యా! నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం నివియోగపడుతోంది. ఎడమ భాగ శరీరం నాకా అదృష్టం లేదేఅని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధఅని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీ కృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషముగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు.




భరతుని కథ



 శ్రీ  మద్భాగవతం లోని కథ
శ్రీ హరి అంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపినాడు. వనమే అతని క్రీడారంగం మృగాలే అతని స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడే వాడు! ఆ పసివాడి బలపరాక్రమాలు చూచి ఆశ్చర్యచకిత అయ్యేది తల్లి శకుంతల. స్వయంగా కణ్వమహర్షే భరతునికి జాతక కర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పినాడు. కుమారుడైన భరతుని తీసుకుని కణ్వ మహర్షి అనుజ్ఞపై ఆ సాధ్వి దుష్యంతుని వద్దకు వెళ్ళింది.
రాజు యొక్క జీవతం కత్తిమీద సాము వంటిది. అతడు ఏది చేసినా ప్రజల హితం కోరి వారి ఆమొదంపైనే చేయాలి. శకుంతల భరతుని తీసుకొని వచ్చి ఈతడే నీ వారసుడు అని చూపినది. ఆ విషయం నిజం అని తనకి శకుంతలకి కణ్వమహర్షికే తెలుసు. అది ప్రజులకు విశ్వసనీయమైన రీతిలో తెలియ చేయాలని తలచి ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి ఏమనక ఊరకున్నాడు దుష్యంతుడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుని కరుణించి ఆకాశవాణి అందఱికీ తెలిసే లాగా స్పష్టంగా ఈ భరతుడే దుష్యంతుని పుత్రుడు కాబోవు చక్రవర్తి అని చెప్పినది. ఆ వాక్కు విని దుష్యంతుడు శకుంతల సంతసించి పుత్రినికి పట్టాభిషేకం చేసి ఐహిక విషయాల మీద మనసు పెట్టక తపోవనాలకు వెళ్ళిపోయారు.
భరతుడు సమర్థమైన తన భుజస్కంధాలపైన ఈ భూభారాన్నంతా నిలిపి ధర్మపాలన చేశాడు. ధర్మస్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాతన ధర్మానికి విరుద్ధమైన శక కబర బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశాల రాజులను అణచాడు. పాతాళంలో దేవతాస్త్రీలను చెఱబెట్టిన రాక్షసులను శిక్షించి ఆ స్త్రీలను వారి భర్తలకు అప్పగించినాడు. త్రిపురరాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవులయందు నిలబెట్టినాడు. సత్యం శౌచం దయ తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగా జనాలు కోరినవన్నీ ఇచ్చేది.
ఈ భూమండలం అంతా భరతుని పాలనలో ఉన్నా కర్మ భూమి అయిన ఈ భరతఖండంలోనే అన్ని యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేశాడు. దీర్ఘతపుడను మర్షిని పురోహితునిగా చేసుకుని యమునా తీరమునందు 78 అశ్వమేధయాగాలు చేశాడు. గంగాతీరం పొడుగునా 55 అశ్వమేధాలు చేసి దేవేంద్రుని అతిశయించిన వైభవంతో శోభించినాడు.
13084 పాడి ఆవుల మందను ద్వంద్వం అంటారు. అట్టి 1000 ద్వంద్వాలను దూడలతోపాటు బంగారముతో గిట్టలు కొమ్ములు అలంకరించి బాగా పండితులైన 1000 మంది విప్రోత్తములకి దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవీ తెల్లని దంతాలు కలవీ అయిన 1400000 నల్లని ఏనుగులను మష్కారతీర్థం ఒడ్డున దాన మిచ్చినాడు!
కుబేరునితో సమానమైన సంపద సాటిలేని శౌర్యం దేవేంద్రునితో సమానమైన విభవం మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండికూడా భరతుడు ఎన్నడూ గర్వించక అర్థశరీరాలు తృణప్రాయంగా భావించి శాంతికాముకుడై భగవత్భక్తితో జీవించాడు. ఈ విధముగా 27000 యేండ్లు రాజ్యపాలన చేసినాడు. ఈ భరతుని సంతతి వారము కనుక మనం భారతీయులం అయ్యాము.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
ఒక మనిషి నిజంగా మనస్సుపెట్టి ధర్మబుద్ధితో పరిశ్రమ చేస్తే దేవతలనే మించిన మహామనీషి అవుతాడని భరతుడు మనకు నిరూపించాడు. అతడు తన బలపరాక్రమాలను ఉపయోగించి యుద్ధములలో విజయుడై భూమండలం అంతటా ధర్మస్థాపన చేశాడు. ప్రజల హితార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. నభూతో నభవిష్యతి అనే రీతిలో ఎన్నో దాన ధర్మాలు చేసి యశశ్వి అయ్యాడు.
భారతీయుల ఆధ్యాత్మ చింతన ఈ కథలో మనకు తెలిసింది. దుష్యంతుడు శకుంతల అన్ని ఐశ్వర్యాలను రాజభోగాలను పుత్రపౌత్రాది ఆకర్షణను త్యజించి తపోవనాలకి వెళ్ళి తపస్సు చేసుకొన్నారు. అలాగని కర్తవ్యాన్ని విస్మరించకుండా ఎంతో కాలం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి కర్తవ్యం పూర్తి చేసుకొని ఆ తరువాతే వానప్రస్థం స్వీకరించారు



 






Om Tat Sat
                                                        
(Continued...)  




 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels