నీతి కథలు
ధర్మవ్యాధుని కథ (మాతాపితసేవ)
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మఱచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మఱచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1. “తన కోపమే తన
శత్రువు. తన శాంతమే తనకు రక్ష”
అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది.
కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
2. పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ
పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
3. స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా
స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
4. మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు.
జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని
కుశిక మహారాజు కథ
ఒకసారి మహాతోజోమయుడైన చ్యవన మహర్షి కుశిక మహారాజును పరీక్షించుటకు ఆయన కడకు వచ్చెను. వచ్చుచున్న చ్యవన మహర్షిని చూచి కుశికుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులిచ్చి “మహాత్మా! మీ రాకతో మా నగరము పావనమైనది. ఏదో బలీయమైన కారణముంటేగాని మీ వంటి తపోధనులు రారు. మీ అభీష్టమేమో సెలవీయ్యండి. మీకు సేవచేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి” అని అర్థించాడు. చ్యవనుడు “రాజా! నీ వినయవిధేయతలు మెచ్చితిని. నీకడ కొన్నాళ్ళు ఉండవలెనని వచ్చితిని. నాకేలోటు రాకుండా నీవు నీ భార్య నాకు పరిచర్యలు చేయాలి. నా కోరిక తీర్చగలవా?” అని అన్నాడు. సాధు సజ్జన సేవే మహాభాగ్యమని కుశికుడు చ్యవనుడుండడానికి హృద్యమైన మందిరం చూపించాడు.
రాజదంపతులు చ్యవనుడు ఆ సాయంకాలం ఆహ్నికాలు దేవతార్చన చేసుకొన్నారు. తరువాత మునీశ్వరునకు మృష్టాన్నమిచ్చి సంతృప్తి పఱచినాడు కుశికుడు. భోజనానంతరము చ్యవునుడు “రాజా! నేనిక నిద్రిస్తాను. నీవు నీ భార్య నిద్రాహారాలు మాని నా పాదసేవ చేయండి. నా అంతటనేను లేవనంతవరకు నన్ను లేపకండి” అని యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు చ్యవనుడు. మహర్షి పాదసేవే మహాభాగ్యం అని కుశికుడు అతని అర్థాంగి ఏకాగ్రచిత్తంతో పాదసేవ చేయసాగారు.
ఇలా 21 దివసములు గడిచాయి. మఱునాడు చ్యవనుడు మేల్కొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురం వదలి నడువసాగాడు. ముని వెంటపోయిన రాజదంపతులను తన మాయతో భయభ్రాంతుల్ని చేశాడు. మరల నిదుర పోయాడు. కుశిక దంపతులు యథావిధిగా పాదసేవ చేశారు. మళ్ళీ 21 దినములు కడచెను. ఆ తరువాత “రాజా! నేను రథమెక్కి యాచకులకు సువర్ణము రత్నములు గోవులు అశ్వములు దానమిచ్చుచుందును. మీరిద్దరు నా రథమును గుఱ్ఱములకు బదులుగా లాగవలెను” అన్నాడు. కుశికుడు ముందర రాణి వెనుక ఉండి రథములాగినారు. చ్యవనుడు మునికోలతో రక్తంవచ్చేటట్టు వారిని కొట్టుచు యాచకులకు వస్తువులిచ్చుచూ రథంమీద వెళ్ళాడు. రథం ఊరి చివరికి వెళ్ళాక ముని రథము దిగి ఏమాత్రమూ చలించని రాజదంపతులని చూశాడు. కుశికుడు అతని భార్య మనస్సులలో కొంచెంకూడా కోపంగానీ విసుకుగానీ మరి ఏ వికారము కానీ లేవు. వారి నిర్మల హృదయం ఆశ్చర్యంతో చూసి ముని వారి శరీములు తాకి ఇలా అన్నాడు “రాజా మీరింక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఱేపు గంగాతీరం వద్దనున్న వనానికి రండి”.
వారి శరీరముల పైని గాయాలు అన్ని మాసిపోయాయి! కుశికుడు “మహాత్మా! నీ చర్యలు అద్భుతాలు. మాకే శ్రమ లేదు. మీబోటి మహనీయుల మహిమ ఎఱుగుట ఎవరి తరము”? అని అన్నాడు. మఱునాడు చ్యవనుడు చెప్పిన ప్రదేశానికి కుశికుడు అతని భార్య వచ్చారు. అక్కడ స్వర్గమును బోలు దివ్య భవనమున్నది. రాజు రాణి ఆ దివ్య భవమును చూచి మిక్కిలి ఆనందమునొందిరి. చ్యవన మహర్షి వారిని దగ్గరికి పిలిచి “రాజా! మీ శాంత స్వభావము లోకోత్తరం. మీ సాధుజన సేవాభావం అద్వితీయం. ఇంత ఇంద్రియ నిగ్రహము కలమీకు వరమిచ్చెద కోరుకొనుము” అని అన్నాడు.
కుశికుడు “మౌనివరేణ్య! నీ సేవా భాగ్యము దొఱకుటే మాకు వరము. మీ దయే చాలు. మాకింకే కోరికా లేదు” అన్నాడు. రాజదంపతుల వైరాగ్యబుద్ధికి మెచ్చి చ్యవనుడిలా అన్నాడు “ఓ రాజా! మీ వంశమునేకాక ఈ విశ్వాన్నే తరింపచేసే మనుమడు పుడతాడు. అతడు బ్రహ్మర్షి అయ్యి పరమాత్మ ఐన శ్రీ రామునకు గురుస్థానమున ఉండగలడు. అతడు విశ్వామిత్రుడు. నీ వలన కౌశికుడే నామధేయంతో ప్రసిద్ధికెక్కుతాడు”.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:
సాధుసేవ యొక్క ప్రాధాన్యత శాంత స్వభావము యొక్క ఔన్నత్యం మనకు కుశిక దంపతులు బోధించారు. వారు ౨౧ దినములు నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో మునీశ్వరునికి పాదసేవ చేశారు. మహర్షి మునికోలతో కొట్టి వారిచేత రథం లాగించినా వారికే మాత్రము కోపము రాలేదు. విరాగులైన కుశిక దంపతులు ధన్యులు
అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు
పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు “ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కయేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిద్దామని నిశ్చయించుకున్నారు.
ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్రుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించిన నారదుడు వారికి విధించిన నియమముభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షణకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులు వీరులు అయిన ఆ దొంగలను శిక్షించి విప్రుని హోమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.
తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకువెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు “సోదరా! క్రూరకర్ములై ఆ విప్రుని హోమధేనువును అపహరించిన ఆ దొంగలను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశావు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?
అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు “అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.
సత్యసంధః
మునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు.
ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందఱికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని స్తుతించి సమస్త ముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ ప్రదేశములలో చాలా చోట్ల పుఱ్ఱెలు ఎముకల గుట్టలు కానవచ్చెను. “పవిత్రమైన ఈ తపోభూములలో ఈ అస్థికలు ఎలా వచ్చాయి”? అని ప్రశ్నించాడు స్వామి. వారు “సర్వేశ్వరా! సమాధిస్థితిలో ఉన్న మునీశ్వరులను దుష్టులైన రాక్షసులు తనివేయగా మిగిలిన ఎముకలివి” అని తమ దైన్యతు వ్యక్తపఱచినారు. కళ్ళుచెమ్మగిల్లిన స్వామి “ఈ దండకారణ్యమును రాక్షసులనుండి విముక్తము చేసెదను” అని ప్రతిజ్ఞ చేసెను. పరమానందముతో మునులు ధర్మస్థాపకుడైన శ్రీ రామునికి జయ జయ ధ్వానాలు చేసినారు.
సీతారామలక్ష్మణులు అగస్త్యమునిని సేవించి సుతీక్షుని వద్ద సెలవు తీసుకుని పంచవటికి వస్తుండగా పరమ సాధ్వీమణి లోకమాత జానకీ ఈ విధముగా భర్తతో మధుర సంభాషణము చేసినది “ప్రాణనాథా! ధర్మవర్తనము అతి సూక్షమైన పద్ధతిని అవలంభించవలెను. ఎవడైతే ప్రలోభాలకు వ్యసనాలకూ దూరముగా ఉంటాడో వాడే సర్వదా ధర్మపరుడై ఉండగలడు. మనము ప్రస్తుతము మునివేషములలో ఉన్నాము. తపము ఆచరించుట మన కర్తవ్యం. తపస్సునకు శాంతి పునాది. అయిననూ మనము ధనుర్బాణములు ఏల ధరించి రాక్షసులను సంహరించుచున్నాము?”. రాక్షసులతో ప్రత్యక్షముగా వైరము లేకుండానే మునులను రక్షించుట అనే “వ్యసనంతో” రాక్షసులను సంహరించుట తనకు ఇష్టములేదన్నట్టు సూచిస్తూ ఆ పతివ్రతాశిరోమణి శ్రీ రామునకు ఈ నీతికథ చెప్పినది
“పూర్వం ఒక మునివల్లభుడు ప్రశాంతమైన ఓ ఆశ్రమములో తపమాచరిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది. ఆయన సత్యప్రభావముచే జంతువులు కూడా సహజ వైషమ్యాలను మఱచి హాయిగా సహజీవనం చేసేవి. అలా ఉండగా దేవేంద్రుడు అతని పరీక్షించుటకై భటుని వేషంలో వచ్చి “స్వామీ! ఈ కత్తిని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్ళీ వచ్చి నేను తీసుకుంటాను” అని అన్నాడు. ఎంతో కాలము ఆ ఆయుధం సమీపంలో ఉన్న కారణముగా ఆ మునిలో క్రూర లక్షణాలు బైటపడ్డాయి! ఆయుధం దగ్గర ఉండుటచే ఆ ముని తన కర్తవ్యాన్ని విస్మరించి హింసమీద అభిరుచి కలిగినవాడై క్రూర కృత్యాలుచేసి చివరికి ఘోర నరకమును పొందినాడు. తపస్సు చేసే మనమెక్కడ? దుష్టసంహారం చేసే క్షత్రియ ధర్మమెక్కడ? స్వామీ! చపల బుద్ధితో నాకు తెలిసినది చెప్పాను. నీవు సత్యసంధుడవు. ఏది సత్యమో ఏది అసత్యమో నీవే నిర్ణయించు” అని అనిన జానకితో శ్రీ రాముడిలా ఉన్నాడు
“దండకారణ్యము లోని మునులు నిరాడంబరముగా తపస్సు చేయుచుండగా మాంసభక్షకులైన రాక్షసులు వారిని భక్షిస్తున్నారు. ఈ మునీశ్వరులు ఆ మదాంధులకు శాపం ఇచ్చుటకు సమర్థులై కూడా శాపం ఇవ్వలేదు. వారిని చంపినా కూడా కోపము తెచ్చుకోకుండా పరమశాంత చిత్తంతో తపమాచరిస్తున్నారు. దీనులై నన్ను ఆశ్రయించినప్పుడు రాక్షస సంహారము చేసెదనని ప్రతిజ్ఞ చేసినాను. అసలు ఆ యోగులు అడిగేవరకూ నేను ఆగనక్కరలేదు. ఎందుకంటే నా తండ్రిగారు భరతునకు నగర రాజ్యము నాకు వనరాజ్యము ప్రసాదిస్తున్నానని స్పష్టముగా చెప్పిరి. కావున తపముచేసినా దుష్టులను శిక్షించటం ఆర్తులను రక్షించటం వనరాజుగా నా కర్తవ్యం.
సీతా! నేను నా ప్రాణాలనైనా వదులుతా. నా ప్రియభ్రాత అయిన లక్షణునైనా విడనాడుతాను. చివరకు నా హృదయేశ్వరివైన నిన్నైనా వదులుతాను కానీ సత్యమును మాత్రమూ ఎన్నడునూ వీడజాలను! అందునా ఇట్టి తాపసులకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఎప్పటికీ విడువలేను”. ఇలా అద్భుతంగా సంభాషణము చేసి సుందరములైన వనభూముల వైపు నడువసాగారు. ఇట్టి సత్యసంధుడైన శ్రీ రాముని పాద స్పర్శ పొందిన ఈ భారతభూమి ధన్యం. భారతీయులు ధన్యులు.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1. వ్యాస భగవానుడు చెప్పినట్టు సత్యం ఈ 13 విధాలైనది: నిష్పక్షపాతం ఆత్మనిగ్రహం అణకువ
సిగ్గు ఓరిమి తాలిమి సంయమం దయ అహింస అనసూయత త్యాగం చింతన శీలసంపద. ఇన్ని
విషయాలను సమగ్రంగా ఆలోచించి వీటిని అనుసంధానము చేసుకుని ఎల్లవేళలా సత్యమే
ఆచరించినాడు శ్రీ రాముడు. ధర్మసమ్మతమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను
కాపాడటానికి ఏమైనా వదులుతాను కానీ సత్యాన్ని మాత్రము విడువనని అన్నాడు.
2. మంచైనా చెడైనా చాలాకాలం సహవాసం చేస్తే ఆ గుణాలకు దెగ్గరవుతాయనే నీతికథను
మనకు సీతమ్మ చెప్పినది. అందుకే మనపెద్దలు సత్సంగత్యమే చేయమని అంటారు.
ప్రతిజ్ఞా పాలన
స్వరాజ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ప్రతి భారతీయుడు వందేమాతర నినాదాలు చేస్తూ బ్రిటిషర్లకు గుండెదిగులయ్యాడు. స్వదేశాభిమానంతో విదేశీవస్తు బహిష్కరణ చేశారు. అట్లా బాహ్యంగా ఆంతరంగికంగా విదేశీయతను తననుండీ దూరం చేశాడు ఓ ప్రముఖ న్యాయవాది. అతడు ప్రఖ్యాత న్యాయవాది అయినా తెల్లవాళ్ళ న్యాయస్థానాల్లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞబూనాడు.
డిసెంబర్ 1924 లో కాంగ్రెస్ మహాసభలు బెల్గాంలో జరిగాయి. ఎందఱో ప్రముఖులు ఆ సభలలో పాల్గొనటానికి వచ్చారు. ఈ ప్రసిద్ధ న్యాయవాది కూడా వచ్చాడు. అందఱూ చూస్తుండగా ఇందోర్ మహారాజు కంగారుగా వచ్చి సరాసరి ఆ ప్రముఖ న్యాయవాది దగ్గరకి వెళ్ళాడు. అందఱూ విభ్రమంతో చూడసాగారు.
“అయ్యా! గొప్ప చిక్కొచ్చి పడింది. నా తరపున మీరే వాదించాలి. ఈ 25 లక్షల రూపాయలుంచండి. కేసు గెలిచిన తరువాత మరో 25 లక్షలు సమర్పిస్తాను” అని అర్థించాడు ఇందోర్ మహారాజు. ఆ రోజుల్లో 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇందోర్ రాజు మీద హత్య చేయించి నట్టు ఆరోపించబడింది. కేసు వైస్రాయి ముందు విచారింప బడుతుంది కాబట్టి వాదించే న్యాయవాది బాగా ప్రజ్ఞాశాలి అయివుండాలి. అందుకే ఇందోర్ మహారాజు ఈ న్యావవాదిని ఎన్నుకున్నాడు.
మరెవరైనా అయివుంటే “మహాభాగ్యం” అని కేసు ఒప్పుకునేవారే. కానీ ఈ న్యాయవాది నిష్కర్షగా అన్నాడు “అయ్యా! క్షమించండి. ఆంగ్లన్యాయస్థానాలలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చాకే నేను న్యాయస్థానాల్లోకి వసాను. ధన ప్రలోభంతో మీ కేసు ఒప్పుకుని ఆత్మవంచన చేసుకోలేను” అని జవాబిచ్చాడు. ఆ న్యాయవాది సత్య వాక్ పరిపాలనను చూసి ముగ్ధుడైన రాజు మరో న్యాయవాదిని ఎన్నుకున్నాడు.
ఆ న్యాయవాది “దేశ బంధు” గా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్.
పిల్లలూ! ఈ కథలోని
నీతిని మరొక్కమాఱు చూద్దాం:
ఏమైనా రాని ఏమైనా కానీ అన్నమాట నిలబెట్టుకోవటం నిజమైన భారతీయుని లక్షణమ్. 50 లక్షల రూపాయలొస్తున్నా కొంచంకూడా ప్రలోభ పడకుండా చిత్తరంజన్ గారు ఆ రూపాయలను తృణప్రాయంగా ఎంచి తమ మాటకి కట్టుబడ్డారు. అందుకే వారు దేశ బంధువైనారు.
ఏమైనా రాని ఏమైనా కానీ అన్నమాట నిలబెట్టుకోవటం నిజమైన భారతీయుని లక్షణమ్. 50 లక్షల రూపాయలొస్తున్నా కొంచంకూడా ప్రలోభ పడకుండా చిత్తరంజన్ గారు ఆ రూపాయలను తృణప్రాయంగా ఎంచి తమ మాటకి కట్టుబడ్డారు. అందుకే వారు దేశ బంధువైనారు.
Om Tat Sat
(Continued...)
(My humble greatfulness to Neethi Kathalu dot com and Hindu dot com for the collection)
(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )
0 comments:
Post a Comment