నీతి కథలు
కృష్ణం వన్దే జగద్గురుమ్
కృష్ణం వన్దే జగద్గురుమ్ – 1
శ్రీమద్భాగవతము లోని కథ
భారతీయుల పాలి పెన్నిధి అయిన గీతామృతాన్ని అందించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఇప్పుడే “అమ్మా” అనటం నేర్చుకుంటున్నాడు. వామనునిగా భూమ్యాకాశాలను రెండడుగులతో కొలిచిన నల్లనయ్య ఇప్పుడే తప్పటడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. దిన దినాభివృద్ధిగా తల్లితండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరుగుతున్నాడు.
బాలకృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో అల్లరి ఆటలాడేవాడు. లీలామానుష విగ్రహుడైన ఆ కన్నయ్య అల్లరి నిజమని నమ్మారు గోపికలు. చిన్ని కృష్ణుడు చేసే వినోదాలు తమయెడల అనుగ్రహించిన మహాప్రసాదాలని మహోపదేశాలని పాపం వారు తెలుసుకోలేక పోయారు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుని తత్త్వం తెలుసుకొనుట ఎవఱి తఱము ?
కన్నయ్య అల్లరి పనులకు ఓర్పు నశించిన గోపిక ఇలా యశోదతో మొఱబెట్టుకున్నది “అమ్మా! యశోదా! నీ పాపని అల్లరిని ఏమని చెప్పేది? మా యింటిలోని బాలింతలకు పాపం పసి పాపలకు ఇవ్వడనికి పాలులేవు. ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న పాపలకి గోక్షీరమైనా పడదామని అనుకున్నారు. ఇంతలో మీ పాపడు వచ్చి బాలింతల మొఱలు వినకుండా లేగదూడల త్రాళ్ళు విప్పి ఆవుల వద్ద వదిలేశాడు. అవి ఆవుల పాలు త్రాగివేశాయి. పిల్లలకు పాలు ఇవ్వలేక పోయిన ఆ బాలింతల దుఃఖం వర్ణనాతీతం. ఇది ఏమైనా న్యాయమా? ఓ అంభోజాక్షీ! చెప్పవమ్మ!”.
బాలురకుఁ బాలు లే వని
బాలెంతలు మొఱలు వెట్టఁ బకపక నగి యీ
బాలుం డాలము సేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
పిల్లలకు పాలు లేకపోతే మనం ఎంత బాధపడతామో లేగదూడలకు పాలుపట్టినీయకుండా పాలుపిండుకుంటే ఆవులు కూడా అంతే బాధను అనుభవిస్తాయి. సర్వాంతర్యామి అయిన బాలకృష్ణుడు పశుపక్షాదుల బాధలను అర్థం చేసుకొని వాటిని బాధించకుండా వాటితో సహజీవనము చేయాలని మనకు ఈ కథ ద్వారా బోధించినాడు. ఆవులు దూడలకు పాలు ఇచ్చిన తరువాతే మనం మిగిలిన పాలు తీసుకోవాలన్నదే జగద్గురువైన కృష్ణుని ఆంతర్యం (ఈ ధర్మాన్ని పాటించిన దిలీపుని కథ కూడా చదవండి). పశుపక్షాదులను సైతం ప్రేమించి అహింసాయుత జీవనాన్ని లోకానికి బోధించిన భరతభూమి ధన్యభూమి.
కృష్ణం వన్దే జగద్గురుమ్ – 2
శ్రీమద్భాగవతములోని కథ
ఒకనాడు బాలకృష్ణుడు గోపబాలురతో కూడి ఆటలాడుచుండెను. “మీరందఱూ వేషధారులు నేను సూత్రధారిని” అంటూ వారితో వింత ఆటలాడేవాడు చిన్నికృష్ణుడు. ఆటలమధ్యలో ఉండగా వారికి కమ్మని కాగిన పాల వాసనలు వచ్చినవి. వారు ఆ వాసనలు వచ్చుచున్న ఇంటిలోకి వెళ్ళారు. అక్కడ వారికి ఎన్నో కడవలనిండా మంచిగా కాగిన కమ్మని పాలు కనిపించాయి. అఖిలలోక వసుప్రదాత అయిన కృష్ణస్వామి కడవలలోని పాలను తన తోడిపిల్లలకు పంచివేశాడు. అంతటితో ఆగకుండా ఖాళీ అయిన కడవలను కూడా పగులగొట్టి వేశాడు.
కన్నయ్య చేతలోని ఆంతర్యం గ్రహించలేక పాపం ఆ ఇంటి పడుచు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుపని వివరించి “ఓ పడతీ! నీ బిడ్డడు మా ఇంట ఇటువంటి అల్లరి చేశాడు. అసలు మీ వాడికి భయభక్తులు ఉన్నాయా?” అని వాబోయింది. ఆ లీలామానుషవిగ్రహుని అర్థం చేసుకొనుట ఎవరి తఱం ?
పడఁతీ! నీ బిడ్డఁడు మా
కడవలలో నున్న మంచి కాఁగిన పా లా
పడుచులకుఁ బోసి చిక్కిన
కడవలఁ బో నడిచె నాజ్ఞ గలదో లేదో?
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
“పాలు” అనే శబ్దము పంచుకోదగిన పదార్థమునకు సంకేతము. అందుకనే మన తేనెల తెలుగు భాషలో “పాలుపంచుకొనుట” అనే ప్రయోగం ఉన్నది. నలుగురికీ ఉపయోగపడే పదార్థమును పంచుకోకుండా తమకోసమే నిలువ చేసుకోరాదని శ్రీ కృష్ణ జగద్గురువు మనకీ కథ ద్వారా బోధించాడు. అందుకనే మిగిలిన కడవలను కూడా పగులగొట్టి పంచుకో తగినవి నిలవచేసుకోనీయకుండా చేశాడు. మీ-మా అనుభేదాలు మఱచి తోటి జనులతో సహజీవనము చేయమన్నదే ఆ సర్వేశ్వరుని సందేశం.
కృష్ణం వన్దే జగద్గురుమ్ – ౩
శ్రీమద్భాగవతములోని కథ
మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగ బాలు ద్రావ నగపడ కున్నం
గోపించి పిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ!
“ఓ తల్లీ! యశోదా! మీ పిల్లవాడు మా గృహములోకి వచ్చి తనకు తృప్తిదీరా త్రాగుటకు సరిపోవు పాలు లేవని కోపించినాడు. పసిబిడ్డలని కూడా చూడకుండా కోపముతో వారిని పడదోసుకుంటూ బయటికి వచ్చేశాడు. వాళ్ళు పాపం గుక్కపట్టి ఏడ్చారు. అమ్మా! నీవూ ఒక తల్లివే కదా? మా బాధను అర్థంచేసుకోలేవా?”.
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
గృహస్థధర్మాలలో అతి ముఖ్యమైన అంశం గురించి శ్రీకృష్ణ గురువర్యుడు మనకీ కథలో బోధించినాడు. గృహస్థులు తమ పిల్లలను సంసారమును పోషించుకొనుటే కాక ఇంటికి వచ్చిన వారిని ముఖ్యముగా పిల్లలను వృద్ధులను అతిథులను అర్థులను సంతృప్తి పఱచవలెను. అట్లుచేయకుండిన వంశక్షయము కలుగునని శ్రీకృష్ణ గురుదేవుని సందేశము. చిన్న పిల్లవాడైన తనకు కావలిసినవి పాలు. ఆ ఇంటి యజమాని తన పిల్లలకు పాలు ఉన్నాయో లేవో చూచుకున్నాడు కానీ తన ఇంటికి ఆడుకొనుటకు వచ్చే భగవత్స్వరూపులైన బాలకులకు పాలు ఉన్నాయోలేవో చూసుకొనలేదు. అందుకనే కన్నయ్య వారినారీతిలో శిక్షించి కాపాడినాడు.
ఈ కారణముగనే మన పెద్దలు ముఖ్య అవసర వస్తువులైన ధాన్యం పసుపు-కుంకుమ పాలు-పెరుగులు ఎప్పుడూ ఇంట్లో లేకుండా ఉండకూడదని అంటారు. ఒకవేళ అవి లేకపోతే “నిండుకున్నాయి” అని అంటారే తప్ప “లేవు” అని అనరు. అట్టి వస్తువులను త్వరగా సంపాదించి తమ అవసరాలకోసమే కాక ఇంటికి వచ్చిన అర్థులకోసం కూడా ఉంచుకోవాలన్నదే వారి తాత్పర్యం. పూర్వం ఏ మాదాకబళం వాడు వస్తాడో ఏమో అని కొంచం అన్నం మిగిల్చేవారు. ఎప్పుడూ తినే పదార్థాలను పూర్తిగా వినియోగించుకునేవారు కాదు. అట్లా చేయుట వలన అనుకోకుండా వచ్చే అర్థులను కూడా తృప్తి పఱచవచ్చని వారి ఆలోచన. కాబట్టి మనమెన్నడూ అత్యవసర పదార్థాలను అర్థులకోసం దాచి ఉంచుకోవాలని జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం.
కృష్ణం వన్దే జగద్గురుమ్ – 4
రీమద్భాగవతములోని కథ
ఒకరోజు కన్నయ్య ఆటకని బయలుదేరాడు. ఒకానొక గోపిక ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇంటి కోడలు నిద్రపోతూ ఉన్నది. బాలకృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగంతా త్రాగివేశాడు. వెళ్ళేవాడు వెళ్ళకుండా నిద్రిస్తున్న ఆ కోడలి మూతికి కొంచెం పెరుగు వ్రాసి వెళ్ళిపోయాడు. పెరుగంతా తానే తినివేసిందని భ్రమసి అత్తగారు కోడలిని కొట్టింది. ఆ అల్లరిపని లోని ఆంతర్యం గ్రహించలేక యశోదతో శ్రీకృష్ణుని గురించి ఇలా చెప్పుకుంది ఓ గొపిక
ఆడం జని వీరల పెరుఁ
గోడక నీ సుతుఁడు ద్రావి యొకయించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
ఈ సన్నివేశము జరిగిన సమయం రాత్రి కాదు. పైగా అది శ్రీకృష్ణుడు ఆటకై బయలుదేరిన సమయం కాబట్టి మనుషులు బాగా మేల్కొని ఉండి శ్రమించి తమ కర్తవ్యాలు నిర్వహించ వలసిన సమయం. అట్టి ఉపయోగకరమైన వేళలో ఆ ఇంటి కోడలు నిద్రించుట కృష్ణపరమాత్మకు నచ్చలేదు. అందుకనే ఆ విధంగా కోడలిని శిక్షించినాడు. ప్రకృతి నియమానుసరముగా లభ్యమైన సమయమును వృధా చేయకుండా నిరంతరం సత్కర్మలను చేయాలన్నదే జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం.
కృష్ణం వన్దే జగద్గురుమ్ – 5
శ్రీమద్భాగవతములోని కథ
ఒకనాడు శ్రీకృష్ణుడు ఆటలమధ్యలో ఒక గోపిక ఇంటిలోకి జొరపడి కడవలలోని నేతినంతా త్రాగివేశాడు! అంతేకాక ఖాళీ కడవలను తీసుకువచ్చి ప్రక్క ఇంటిలో పడవేసి వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంటివారికీ ఈ ఇంటివారికీ పెద్దపోట్లాట జరిగింది. ఈ అల్లరి వివరిస్తూ గోపిక యశోదతో ఇలా అన్నది:
“వా రిల్లు సొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యి ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డవా దయ్యె సతీ! “
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
నెయ్యి జ్ఞానానికి సంకేతము. జ్ఞానాన్ని వస్తు రూపములో భద్రపఱచిన (కడవలలో నెయ్యి ఉంచిన) గోపిక నిజానికి జ్ఞానమును ఆర్జించుకోలేదు. దీనికి నిదర్శనం నిజానిజాలు తెలుసుకోకుండా ప్రక్క ఇంటివారితో పోట్లాడడమే. కృష్ణస్వామి నేతిని త్రాగివేసి జ్ఞానమునెన్నడు స్వార్థముతో దాచుకోరాదు (దాచుకోలేరు) అని చూపించినాడు. అంతే కాక ఆర్జించిన జ్ఞానమును ఇతరులకు పంచాలని చూపించడానికి కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు. ఐతే జ్ఞానము స్వానుభవైకవేద్యమైనది కావున జ్ఞానమును పదార్థ రూపములో (నేతి రూపములో) పంచలేము. జ్ఞానబోధకు ఏకైకమార్గం జ్ఞానార్జన పై జిజ్ఞాస కలిగించడం. అందుకనే శుద్ధజ్ఞాన పరాత్పరుడైన శ్రీకృష్ణుడు కమ్మని నేతివాసనలు వచ్చే ఖాళీ కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు.
కాబట్టి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా మనకు జ్ఞానమెన్నడూ స్వార్థబుద్ధితో దాచుకోరాదని, దానిపై జిజ్ఞాస కలిగే రీతిలో అందఱికీ అందించాలని బోధించినాడు. అంతేకాక జ్ఞానమును సంపూర్ణముగా ఆస్వాదించి గురుత్వమును పొందిన తరువాతనే ఇతరులకు బోధించాలి అని శ్రీ కృష్ణ పరమాత్మ ఈ కథ ద్వారా చూపినాడు. అందుకనే నెయ్యి మొత్తం త్రాగివేసి (గురుత్వమును సంపాదించిన) తరువాతనే ప్రక్క ఇంటిలో కడవలను పడవేసి జ్ఞానబోధ చేసినాడు.
దిలీప మహారాజు కథ
(శ్రీకాళిదాసకృత
రఘువంశం లోని కథ)
అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది. కానీ రథవేగము వలని వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.
ఇలా వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.
“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. “భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.
ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదు” అని అన్నాడు దిలీపుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు “క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుఱుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న ప్రాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు” అని అన్నాడు.
ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనును తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుఱు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.
అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు “తల్లీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలకై ఎదుఱు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆఱోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి” అని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు.
1. పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా
వెళ్ళిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు
సజ్జనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
2. ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్రాణాలను సైంత ఇద్దామనుకున్న దిలీపుడు
ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు.
3. “దూడ త్రాగిన తరువాత
మహర్షులు తీసుకున్న తరువాత పాలుతీసుకుంటాను” అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత
వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6
మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క
ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు.
Om Tat Sat
(Continued...)
(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )
0 comments:
Post a Comment