నీతి కథలు - 8



































నీతి కథలు










ద్రౌపదీదేవి ఆదర్శ భారతనారి




శ్రీమద్భాగవతం లోని కథ
మహాభారత యుద్ధములో సర్వనాశనమైన కౌరవపతి దుర్యోధనుని సంతృప్తి పఱచుటకై అశ్వత్థామ తన స్వభావానికి భిన్నముగా ప్రవర్తించి అతి కిరాతకముగా ఉపపాండవులను (పాండవుల పుత్రులు) నిద్రిస్తుండగా వధించినాడు. ఆ ఘోరకృత్యం తెలుసుకున్న పాండవులు ద్రౌపదీదేవి దుఃఖానికి అంతులేదు. పసిపాపలైన బాలకులను నెత్తుటి మడుగులో చూసిన వారి గుండెలు పగిలినాయి. తన పుత్రులందఱినీ పోగొట్టుకుని విలపిస్తున్న ద్రౌపదీదేవిని ఓదార్చాడు అర్జునుడు. ఇంత దారుణమైన పనిచేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కువస్తానుఅంటూ పాఱిపోతున్న ఆ ద్రౌణి నెలకాల బడ్డాడు అర్జునుడు. శ్రీకృష్ణార్జునుల రథము తనను త్వరిత గతిలో సమీపిస్తున్నదని తెలిసిన అశ్వత్థామ ప్రాణరక్షణకై బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప అన్యమేదీ తనను కాపాడజాలదు అనుకుని రథమాపి శుచి అయ్యి ఆచమించి మంత్ర ప్రయోగము చేశాడు. ప్రళయకాల రుద్రునిలా సమీపించే ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీ కృష్ణుడు ప్రతి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమని ఆజ్ఞాపించాడు.
అర్జునుడు కూడా శుచి అయ్యి ఆచమించి పరమాత్మకు ప్రదక్షిణము చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ ఱెండు అస్త్రాలు సూర్యాగ్నుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావము చతుర్దశ భువనాలను దహింపగలదని తెలిసిన శ్రీ కృష్ణుడు ఆ అస్త్రాలను ఉపసంహరించమనినాడు. అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుడు శాస్త్రకోవిదుడు. అందుకే గృహస్థుడైనా కూడా బ్రహ్మచర్యమును పాలించుటచే ఆ ఱెండు బ్రహ్మాస్త్రాలనూ ఉపసంహరించ గలిగినాడు. అలా లోకాలను తన బ్రహ్మచర్య శక్తితో కాపాడిన అర్జునుడు ఆ అశ్వత్థామను బంధించి ద్రౌపదీదేవి ముందుకు తెచ్చి పడేశాడు. చిన్న పిల్లల ప్రాణాలు తీసిన ఆ అశ్వత్థామ ద్రౌపదిముందు సిగ్గుతో తల ఎత్తలేకపోయాడు. పరాన్ముఖుడైన గురుపుత్రునికి నమస్కరించి సుగుణవతియైన ద్రౌపదీదేవి ఇలా ధర్మ్యభాషణం చేసింది
నాయనా! మీ తండ్రిగారైన ద్రోణాచార్యుల వారి వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్రరూపములో ఉన్న ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు ఇలా నీ శిష్యనందనులను దారుణముగా వధించడం ధర్మమా? తమకి హాని కలిగించినా ఎదుఱుకోలేని పసివాళ్ళను నీకెన్నడూ అపకారము చేయని అందాలు చిందే పాపలను నిదురించి ఉండగా చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి? ఓ గురుపుత్రా! ఇక్కడ నేను నా పుత్రులకై ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కృపి నీకోసం ఎంతగా విలపిస్తున్నదో. అర్జునుడు బంధించి తీసుకు పోయాడన్న వార్త వినగానే ఎంత పరితాపమును చెందినదో”. ఇలా అని శ్రీకృష్ణార్జునుల వైపు చూసి
ద్రోణాచార్యులవారు స్వర్గస్థులైనా ఇతని మీదే ఆశలుపెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి కృపి. నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురుపుత్రుడైన ఈ అశ్వత్థామను వదిలి వేయండి! గురుపుత్రుని వధించుట ధర్మము కాదుఅని అన్నది పరమ పతివ్రత అయిన ద్రౌపదీదేవి.
ఈ ప్రకారం ద్రౌపదీదేవి ధర్మసమ్మతంగా దాక్షిణ్యసహితంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రశంసనీయముగా పిలికినది. పాంచాలి మాటలు విని ధర్మనందనుడు ఎంతో సంతోషించాడు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు ఆమెను ఎంతగానో పొగిడినాడు. అక్కడ ఉన్న అందఱూ ఆమె మాటలను సమర్థించారు. కానీ భీమసేనుడుకన్న కొడుకులను క్రూరముగా చంపినవాడు కళ్ళముందున్నా కోపం తెచ్చుకోకుండా విడవ మంటుందేమిటి? స్వాభావికముగా దయ ఉన్నవాడే బ్రాహ్మణుడు కానీ ఇలా ఘోరకృత్యం చేశిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదుఅంటూ ఆ అశ్వత్థామ పైకి దూకాడు.
తొందరలో ఏమి చేస్తాడో అని ఆ గురుపుత్రునికి అడ్డంగా నిలబడినది ద్రౌపదీదేవి!! శ్రీ కృష్ణుడు చతుర్భుజుడై ఱెండు చేతులతో భీమసేనుడిని మిగిలిన ఱెంటితో ద్రౌపదిని వారించి ఇలా ధర్మబోధ చేశాడు శిశుఘాతకుడూ కిరాతకుడూ అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికీ చంపదగిన వాడే. కానీ గురుపుత్రుడు పైగా విప్రుడు అయినందువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరునికి తలగొఱగటం కన్నా అవమానకరమైనది ఏదీ లేదు. ఈతని శిరోజాలు ఖండిచి అవమానించి పంపుదాం”. అప్పుడు విశ్వమంతా కొనియాడ తగ్గవాడూ వీరాధివీరుడూ అయిన అర్జునుడు ఆ అశ్వత్థామ శిరోజాలు ఖండించి అతని శిరస్సుమీదనున్న దివ్య (జ్ఞాన) మణిని తీసుకుని అవమానించి బయటికి గెంటివేశాడు. అనంతరం చనిపోయిన బంధువులందఱికీ దహన సంస్కారాలు చేశి గంగాతీరములో పొంగిపొఱలే దుఃఖాన్ని దిగమ్రింగుకుని మరణించిన వారికి తిలోదకాలిచ్చారు పాండవులు. తరువాత శ్రీ కృష్ణుడు పాండవులని గాంధారీ ధృతరాష్ట్రులని ఓదార్చినాడు. ఇలా శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా దుష్టశిక్షణ చేశి భూభారాన్ని దించాడు

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
పుత్రహంతకుడు కళ్ళ ఎదుటికి రాగానే గురుపుత్ర! నమస్కారంఅని అనగలిగిన ద్రౌపదీదేవి మనస్సు యొక్క సౌందర్యం వర్ణణాతీతం. అంత దుఃఖములో ఉండికూడా ఏది ధర్మం ఏది అధర్మం అని ఆలోచించి మాట్లాడిన ఆమె ధర్మవర్తనం మనకు ఆదర్శప్రాయం.నా వలె ఆ కృపి పుత్రుని కోసం ఎంతగా ఏడుస్తుందోఅని దయ జాలి కరుణ క్షమ అనే పదాలకు సీమాంతం చూపి మహాపకారికైనా మహోపకారం చేయగల ద్రౌపదీదేవి వంటి ఆదర్శ నారీమణులు పుట్టిన మన భారతదేశం మహోన్నతమైనది.




దిలీప మహారాజు కథ




శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ
రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్థాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపఱచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ఠుల వారు ఇలా అన్నారు నాయనా! నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్యపూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!
అప్పుడు కామధేనువు రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదుఅని చెప్పినది. కానీ రథవేగము వలని వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.
ఇలా వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నదిరాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.
నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానేఅని అనుకుంటున్న రాజు నేను కుంభోదరుడను. శివ కింకరుడనుఅన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు ఓ దివ్య సింహమా! సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.
ఇది వినగానే కుంభోదరుడు నవ్వి ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదుఅని అన్నాడు దిలీపుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుఱుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న ప్రాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించుఅని అన్నాడు.
ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనును తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుఱు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావుఅని అన్నది నందినీధేనువు.
అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు తల్లీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలకై ఎదుఱు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆఱోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతిఅని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు.


పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1.     పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు సజ్జనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
2.     ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్రాణాలను సైంత ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు.
3.     దూడ త్రాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలుతీసుకుంటానుఅని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు.




చ్యవనమహర్షి – జాలరులు




మహాభారతము లోని కథ
భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్థాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచిమహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా 12 యేండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు.
ఓ జాలరులారా! భయపడకండి. మీరేతప్పూ చేయలేదు. మీ విధినిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండిఅని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి అశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపఱచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు.
జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి మహానుభావా! ఈ బెస్తలు తెలియక తప్పుచేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయ్యండిఅని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు రాజా! ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడుఅని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కానీ చ్యవనుడు అది తనకు సరైన వెలకాదన్నాడు. రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధరకాదన్నాడు చ్యవనుడు. నహుషుడుఅయితే అర్ధరాజ్యమిస్తానుఅని అన్నాడు. నీ మంత్రులతో సంప్రదించి చూడుఅన్నాడు చ్యవనుడు. ఆలోచించడానికేమున్నది? నా రాజ్యసర్వస్వమూ ఇస్తానుఅని అన్నాడు నహుషుడు! చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు.
ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహామునిగోవు త్రిలోక పూజ్యమైనది. సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు”. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు.
ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి పని చేశే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. ఇలా అనుకుని మహర్షి కడకేగి అయ్యా! బ్రహ్మ తుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండిఅని అన్నారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకీ మీకూ సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరంకోరుకో మన్నారు. వినయముతో నహుషుడు స్వామీ! మీరు తృప్తిపొందితే అదే చాలు. నాకింకేదీ అక్కరలేదుఅన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదివిని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1.     తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచముకూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు.
2.     జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలరులు.
3.     సత్కర్మలు చేశే అవకాశం అరుదుగా వస్తుందని. వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు.
4.     గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి.
5.     ధర్మపాలనకై తన సర్వస్వమునూ త్యాగం చేయటానికి సిద్ధపడ్డ నహుషుడు మనకు ఆదర్శము కావాలి.



రామయ్య ఎడ్లు




పెద్దలు చెప్పిన నీతికథ
రామయ్య ఒక సాధారణ రైతు. దైవికముగా తనకి ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవాడు. అతని వద్ద మంచి నాగౌరు గిట్టులుండేవి. వాటిని తన కన్నబిడ్డలవలె కంటికిఱెప్పలాగా చూసుకునేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ జీవనానికి సహాయపడే పశుసంపదను పూజించడం భారతీయుల కృతజ్ఞతా వైభవానికి తార్కాణం. ఆ భారతీయ తత్త్వానుసారముగా రామయ్య తన ఎడ్లను పూజించేవాడు. నాగౌరు గిట్టలు అవడంచేత రామయ్య ఎడ్లలో సత్తా బాగా ఉండేది. అవి ఉత్తమ జాతి అశ్వాలకన్నా వేగముగా పఱుగెత్తగలిగేవి! వాటి వేగము చూసి పుత్రోత్సాహ భావముతో రామయ్య ముఱిసిపోయేవాడు.
ఇలా ఉండగా ఒక రోజు రామయ్య వృషభాలను కొందఱు దొంగలు అపహరించారు. తన ఎద్దులు లేవని తెలుసుకొన్న రామయ్య దుఃఖానికి అంతులేదు. పాపం! సొంత కొడుకు దూరమైనట్లు బాధపడ్డాడు. రామా! నేనేమి పాపంచేశానయ్యా? ఎందుకింత పెద్ద శిక్ష? నా ఏడ్లు లేకుండా నేనెట్లా బ్రతికేది? ఆ దొంగలు నా ధనాం తీసుకుని నా ఎడ్లను వదిలిపెట్టుంటే బాగుండేది. పశుసంపద లేని ఇంట్లో లక్షీదేవి ఉంటుందా? (ఉండదు)
ఇలా పరిపరి విధాల వగచి రామయ్య రక్షకభటులకు ఫిరియాదు చేశాడు. తనుకూడా వారితో కలిసి దొంగలను వెదుక సాగాడు. చివరికి రామయ్య పాలిటి దేవతలైన వృషభాలను ఆ దొంగలు ఒక బండికి కట్టి పాఱిపోవడం రామయ్య రక్షకభటులు చూశారు. రామయ్య కళ్ళు సూర్యుని చూసిన పద్మాల్లాగా విచ్చుకున్నాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో ఆ రక్షకభటులు రామయ్య ఓ బండి ఎక్కి దొంగల వెనకాల పడ్డారు. దొంగల ఎడ్లబండీని త్వరగా అందుకుంటున్నారు రామయ్య రక్షకభటులు.
ఇంతలో రామయ్య వాయువేగంతో వెళ్ళే తన నాగౌరుగిట్టలను వాళ్ళు వెళ్ళే గుఱ్ఱబ్బండి అందుకోవడమేవిటి? అని అనుకున్నాడు. తన ఎడ్లు ఆ గుఱ్ఱాలతో ఓడిపోవటం ఇష్టంలేక పొయిన రామయ్య ఆ ముక్కుత్రాటిని ఱెండు సార్లు లాగండిరా”! అని ఆ దంగలకు ఎడ్లు పూర్తి వేగముతో వెళ్ళే కిటుకు చెప్పాడు. దొంగలు ఆ కిటుకు తెలుసుకుని తీవ్రవేగాన్ని అందుకున్నారు. కొద్ది సేపటిలోనే కను మఱుగైపోయారు. వచ్చిన ఒక్క అవకాశము పోయిందని విచారిస్తాడేమో అనుకున్న రక్షకభటులు రామయ్య ఆనందాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ఆనందానికి కారణమేమిటని అడిగిన రక్షకభటులతో ఇలా అన్నాడు మహౌదార్యముగల రామయ్య
అయ్యా! నా గిట్టలు ఎప్పుడూ పఱుగు పందెంలో ఓటమిని చవిచూడలేదు. వాటి పేరు ప్రతిష్ఠలే నాకు ముఖ్యం. నాకు దొఱికి అపజయం పొందడం కన్నా అవి విజేతలుగా నాకు దూరమైనా మేలు కదా! అవి నాకు దక్కాయనే స్వార్థబుద్ధి కన్నా అవి గెలిచాయనే విషయం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది”. తోటి మనుషులనే కాకుండా పశుపక్షాదులను వృక్షములను ప్రేమభావంతో చూసే భారతీయతను రామయ్యలో నిండుగా చూసిన రక్షకభటులు రామయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు.
పిల్లాలూ! ఈ కథలోని నీతి మరొక్కమాఱు చూద్దామ్:
పశుసంపదను ప్రేమించి పూజించే భారతీయ తత్త్వాన్ని మనకు గుర్తుచేసిన రామయ్య ధన్యజీవి. మనకు ఆచార్యతుల్యుడు.




ప్రవరాఖ్యుని కథ




శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర (శ్రీ మార్కండేయ పురాణము) లోని కథ
అరుణాస్పదం అనే పట్టణములో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడుండే వాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పుకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన మాతాపితసేవ అతిథి అభ్యాగతసేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికీ వెళ్ళటానికి కుదిరేది కాదు. భార్యాపిల్లలను చూసుకోవడం చెట్లను పశుపక్షాదులను పోషించడం ఆహ్నికాలు తీర్చుకోవడం ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్ళాలేకపోయేవాడు. తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు.
ఒక రోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్ధుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకోని ప్రవరడు స్వామీ! కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తిలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక. కాని ప్రతిదినమూ కర్తవ్య నిర్వహణతోనే గడచిపోతున్నది. నేను తీర్థయాత్రలు చేసే ఉపాయము బోధించండిఅని ప్రార్థించాడు. ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడిలా అన్నాడు
నాయనా ప్రవరా! మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాలకోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపేదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలనూ పాటించ వచ్చు. నా వద్ద ఒక పాద లేహ్యమున్నది (పసరు). దీనిని నీ పాదాలకు పూసుకొనిన నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు”. మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధుని వద్దనుండి స్వీకరీంచాడు ప్రవరుడు.
మఱునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకుని అందఱి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగతసేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాల లోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థప్రదేశాలు చూడాలని బయలుదేరాడు.
ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైనా తరమా! కోండల కోనలనుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పుళ్ళు పింఛాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు.
ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి ఱేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్న ప్రవరుడు ఊరుచేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేక పోయాడు! మంచునీటిలో పాదలేపనం కరిగి పోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షమైపోయాడు. ఓ భగవంతుడా! ఇది ఎక్కడి కర్మపాశం! ఎక్కడ అరుణాస్పదం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనా రహితముగా రావచ్చునా? ఎంత తెలివిమాలిన పని చేశాను”! నిమిషము కనిపించక పోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతీ సాధ్వి అయిన అర్థాంగినీ తలుచుకుని బాధపడ్డాడు. ఆడుతూపాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారో? అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో? అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవఱికీ రాకూడదుఅని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు.
ఇంతలో వరూధినీ అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్ఠానాలు చేయలేక పోతానేమో అన్న దుఃఖం ఒక వైపు వరూధినీ శృంగారచేష్టలు ఒకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చని జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి. ఇన్నాళ్ళూ నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా”? అని అనుకుని భ్రాంతిచెందాడు. ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పముతో అగ్నిదేవుని మనసులో తలచి నేనే కనక నిత్యానుష్ఠాన తత్పరుడనైతే కర్తవ్య పాలనా దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక”! అని అనుకున్న మఱుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్ల పాతిని ఆనందపఱచాడు ప్రవరుడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1.     నిత్యకర్మలను కర్తవ్యాలను మనసా వాచా కర్మణా ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్ఠకు అంతరాయం కలుగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనముంటుందా?
2.     గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు. దేవతార్చన మాతాపితసేవ మానవసేవ (అతిథిసేవ) పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము (శాస్త్ర పురాణ పఠనం) విడువకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపినాడు.
3.     ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూధినీ ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి.






Om Tat Sat
                                                        
(Continued...)  



 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels