నీతి కథలు - 10






























నీతి కథలు





విష్ణుచిత్తుని అతిథిసేవ



శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథ
అది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం (శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం). పాండ్యదేశంలో శ్రీవల్లిపుత్తూరు అనే భవ్యనగరం ఉండేది. ఆ నగరం మింటినంటే మేడలతో హంసల క్రీంకారాలు ధ్వనించే కొలనులతో బాతులకు ఆశ్రయమైన కాలువలతో ఉద్యానవనాలతో మామిడి పనస అరిటి మెదలైన తోటలతో అతి రమణీయంగా ఉండేది. నాలుగు వర్ణస్థులు సుఖ శాంతులతో ఉండేవారు. ఆ ఊరి స్త్రీలు మేనికి పసుపు పూసుకుని చెరువులో స్నానమాడి ఆ ఊరి దేవుడైన శ్రీ మన్నారు కృష్ణస్వామి అభిషేకానికై బిందెలలో నీళ్ళు తీసుకొని పూజకు కలువలు కోసుకొనిపోయేవారు. గ్రంథాలను ప్రబంధాలను చదువుకుంటూ కాలక్షేపం చేశేవారు.
ఆ ఊరి ప్రజలు అతిథి కనబడగానే సాష్టాంగనమస్కారం చేసేవారు. స్వాగతం చెప్పి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సేద తీర్చేవారు. టెంకాయఆకుల చాపపై కూర్చోబెట్టి విశాలమైన అరటి ఆకు పఱచి భోజనం పెట్టేవారు. రాజనపు వరి అన్నం పప్పు నెయ్యి ఎన్నోరకాల కూరలు పాలు పెరుగు ఇచ్చేవారు. అతిథి తృప్తిగా భుజించిన తరువాత తాంబూలమిచ్చి పాదసేవ చేసేవారు. అతిథి వెళ్ళి వస్తానుఅనగానే శక్తికొలది అతని సత్కరించి కొంత దూరం అతనితో నడచి అతనిని సాగనంపేవారు. సేవ చేయటానికి అంత కొంచం అవకాశం దొరికిందని విచారిస్తూ తిరిగి వచ్చేవారు. ఈ విధముగా అతి శ్రద్ధతో ప్రతిదినమూ అతిథి అభ్యాగతుల సేవ చేసేవారు ఆ ఊళ్ళోని గృహస్థులు.
అలాంటి ఉన్నత జీవనం సాగిస్తున్న శ్రీవల్లిపుత్తూరు ప్రజల మధ్యలో గరుత్మంతుడి అంశతో భట్టనాథుడనే భాగవతోత్తముడు జన్మించినాడు. అతడు సమవర్తి స్థితప్రజ్ఞుడు. కష్టసుఖాలను లెక్కించేవాడు కాడు. భట్టనాథుడు నిత్యం తులసిమాలలు చెంగల్వదండలు కట్టి మన్నారు కృష్ణస్వామికి సమర్పించేవాడు. దేవాలయంలో ఉన్న వటపత్రశాయిని సేవించడం అతని నిత్యకృత్యమ్. ఏమి విద్యలూ అభ్యసించకపోయినా జ్ఞానం వైరాగ్యం కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ విష్ణువునే ధ్యానిస్తూ ఉండేవాడు. అతని నిష్కల్మష భక్తికి మెచ్చి శ్రీహరి అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు. అందుకనే భట్టనాథునికి విష్ణుచిత్తుడనే సార్థకనామధేయం వచ్చింది.
మానవ సేవే మాధవ సేవ భవతరణానికి నావఅనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు విష్ణుచిత్తుడు. అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. వానాకాలంలో వరి అన్నం పప్పు నాలుగైదు కూరలు వరుగులు వడియాలు పెరుగు మొదలైన వాటితో అన్నం పెట్టేవాడు.
వేసవిలో ముందుగా అతిథికి శ్రీచందనం ఇచ్చేవాడు. తాపంతీరిన అతిథికి వేడి అన్నం తియ్యని చారు మజ్జిగ పులుసు చెఱుకురసం లేత టెంకాయనీళ్ళు భక్ష్యాలు ఫలాలు సుగంధభరితమైన చల్లని నీళ్ళు వడపిందెలు మజ్జిగ మొదలైన వాటితో విందు చేసేవాడు.
శీతాకాలంలో పునుగు వాసనగల రాజనపు అన్నం మిరియపుపొడి వేడి వేడి కూరలు ఆవపచ్చళ్ళు పాయసం ఊరగాయలు వేడిగావున్న నెయ్యి పాలు మెదలైనవాటినిచ్చి అతిథిని సంతృప్తి పఱచేవాడు.
ఈతడు ఎంతటి భక్తుడంటే ఏ విద్యలూ నేర్వకుండానే ఆ దేశపురాజైన వల్లభదేవునికి నారాయణుని పరతత్త్వం బోధించగలిగినాడు. సాక్షాత్కరించిన విష్ణువుకి తన దృష్టి తగులుతుందేమో నని పరమాత్మకే మంగళశాసనం చేశాడు! గోదాదేవిని శ్రీహరికి కన్యాదానం చేసి లోకనాథునికే మామ అయినాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1.     ఏ కాలానికి హితమైన ఆహారము ఆ కాలంలో అతిథికి ఇచ్చి అద్వితీయ అతిథిసేవ చేసి మనకు మార్గదర్శి అయినాడు పరమ భక్తుడైన విష్ణుచిత్తుడు.
2.     ప్రపంచం ఇంకా కన్నువిప్పనినాడే అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో ఉండదగిన శ్రీవల్లిపుత్తూరు వంటి నగరాలు ఎన్నెన్నో మన దేశంలో! ఆధ్యాత్మికతలోనే కాక నాగరిక జీవనంలో కూడా ప్రపంచానికి గురువై బోధించిన భారతదేశంలో పుట్టిన మనం అదృష్టవంతులమ్.



చాతకపక్షి దీక్ష



పెద్దలు చెప్పిన నీతికథ
అది గ్రీష్మం. సూర్యుడు నడినెత్తిన ఉండి ఠీవిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పిల్ల పక్షులతో ఒక తల్లి చాతకం గగనతలంలో ఎగురుతోంది. పసి చాతకాలు వేడిమికి తాళలేకపోతున్నాయి. తల్లి చాతకం నెలవు కోసం గాలిస్తోంది. నేల పై ఒక పెద్ద మఱ్ఱి వృక్షం కనబడింది. దాని వేరు బొఱియలలో ఎలుకల చీమల పుట్టలు. తొఱ్ఱలలో పాములు. కొమ్మలు రెమ్మలు ఆశ్రయించి వందలాది పక్షులు. నేలమీదనున్న ఒక వృక్షమే ఇన్ని వేల ప్రాణులకు ఆశ్రయం ఇస్తే ఇక సాధన దీక్ష లక్ష్యం ఉన్న ఓ సజ్జనుడు ఎన్ని జీవులను తరింపచేయగలడు!
సామాజిక విలువ తేలిసో లేక సహజీవనం అనివార్యం అని గ్రహించో ఏమో ఆ వృక్షాన్ని కాపురమున్న పక్షి జంట పిల్లలు తమ తల్లితో అయ్యో పాపం! వాటికి ఇల్లులేదేఅన్నాయి. ఇన్నాళ్ళకికదా మా జీవనం సార్థకమైనది. మేము పెంచిన పిల్లలు ఎదుటివారి కష్టాన్ని గుర్తించాయిఅన్న ఆనందంతో ఆ పక్షి జంట ఆ చాతక పక్షులను ఆహ్వానించాయి.
ఆశ్రయం కోసం వెతుకుతున్న చాతకాలకి ఆ ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు. ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకులతోనేనా పుట్టినది?” అని అడిగి కాదు అని తెలుసుకోని ముందుకుసాగిపోతున్న ఆ చాతకాల దీక్ష చూసి విభ్రాంతిచెంది ఔరా!అని ముక్కున వ్రేలిడికొని చూశారా పిల్లలూ దీక్షా రూపం అని కళ్ళతోనే సైగచేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
చాతక పక్షులు మనకి దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను చూపినాయి. చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహమేసినా ఇంకేవీ త్రాగవు. ఈ స్వాభావిక గుణాన్ని విడువక కథలోని చాతకం కూడా మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షం పైనే ఉండాలనుకున్నది.
హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః
కోకః కోకనదప్రియం ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా |
చేతొ వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం ||
జగద్గురువులైన ఆది శంకరాచార్యులు ఒక భక్తుడు శివసాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు. హంస తామర తూళ్ళనే తింటుంది. అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది. చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది. అందుకే ఘనమేఘాలకై ఎదురుచూస్తుంది. చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి. రాత్రిళ్ళు విరహవేదనను అనుభవిస్తాయి. అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి. చకోర పక్షులకి కేవలం వెన్నెల ఆహారం. అందుకని చకోరాలు చంద్రొదయానికై పరితపిస్తాయి. అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు. అన్యములేవీ అతనికి అక్కరలేదు!
పుత్రోత్సాహం తల్లితండ్రులకు తమ పిల్లలు నలుగురికీ ఉపయోగపడ్డప్పుడు కాని పుట్టినప్పుడు కలుగదు అన్న సూక్తిని గుర్తుచేశాయి పక్షులు. తమ పిల్లలు ఎదుటివారి కష్టాలని చూసి అయ్యో పాపం!అని జాలిచూపినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందించారు.



గోవర్ధన గిరి పూజ




శ్రీ మద్భాగవతం లోని కథ
నందవ్రజములో ప్రతి ఏట ఇంద్రయాగము చేసేవారు. ఏడేళ్ళ పసిబాలుడైన శ్రీ కృష్ణ పరమాత్మ సదస్యులందరి ముందర తండ్రియైన నందుని ఇలా ప్రశ్నించాడుఇంద్రయాగము చేయుటలోని ఆంతర్యమేమిటి”? నందుడు కృష్ణ! యజ్ఞ యాగములు కృతజ్ఞతును ప్రకటించే సాధనములు. మనకు హితము కలిగించే వేల్పులకు కృతజ్ఞత చూపడమే యజ్ఞం యొక్క ముఖ్యోద్దేశం. కృతజ్ఞుడే కాని కృతఘ్నుడు సహాయమునకు అర్హుడుకాడు కదా! ఈ కారణముగా లోకహితార్థం యజ్ఞం చేయుట ఆచారంఅని చెప్పాడు.
తండ్రియొక్క సత్యవాక్కులు విని శ్రీ కృష్ణుడిలా అన్నాడు తండ్రీ! ఫలము కేవలము దేవతలవల్లనే కలుగదు. ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ. ఒక మనిషి తానెన్ని సత్కార్యాలు చేశాడన్నది ముఖ్యం. అందుకే కర్మయే భగవంతుడని అనవచ్చు. స్వధర్మమాచరీంచిన వాడికి దైవము చేరువలో నుండును.
పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.
మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుముఅని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:
గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.
శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండిఅని చెప్పాడు.
ఓ శుభదివసమున వ్రజవాసులు గోవర్ధన గిరిపూజకు తండోపతండాలుగా తఱలి వచ్చారు. యాదవుల గురువైన గర్గ మహర్షి పురోహితులు వచ్చారు. నవనందులు వృషభానుడు బంగారు పల్లకీలో రాధాదేవి వచ్చిరి. దేవతలు అప్సరసలు రాజర్షులు మహర్షులు పార్వతీ పరమేశ్వరులు విచ్చేసినారు. భక్తి శ్రద్ధలతో పూజావిధిని అనుసరించి గోవర్ధన గిరి పూజ చేశారు వ్రజవాసులు. వ్రజవాసుల భక్తికి మెచ్చి గోవర్ధనుడు సహస్రబాహులతో మానవాకృతిలో వచ్చి అందరిని ఆశీర్వదించాడు. శ్రీ కృష్ణ పరమాత్మకీ జై గోవర్ధనగిరిరాజుకీ జై అను జయజయ ధ్వానాలు భూనభోంతరాళముల ప్రతిధ్వనించాయి. వ్రజ చరిత్రలో అది ఓ సువర్ణ ఘట్టమ్.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.     ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.
2.     దైవసేవ మాతాపితసేవ భూతదయ అన్ని మానవుడి కర్తవ్యాలని గుర్తుచేశాడు శ్రీ కృష్ణుడు. అందుకే పూజకు వచ్చేముందు వృద్ధులకు బాలులకు పశు పక్షాదులకు ఆహారం సమకూర్చి రమ్మన్నాడు.
3.     మన సంస్కృతి ప్రకారము పూజా విధానము ఎట్టిదో శ్రీ కృష్ణుడు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో విధినసురించి చేసిన పూజ ఫలించి గోవర్ధనుడు సాక్షాత్కరించాడు.




రఘుమహారాజు – కౌత్సుడు



శ్రీ మద్రామాయణం లోని కథ
పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకుఅని అన్నారు.
శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనాఅంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.
గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.
అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకోని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. రాజా! అది కష్టములే. నేను వెళతానుఅంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనాఅని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తాఅని చెప్పి పంపాడు రఘుమహారాజు.
పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తుఅని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమనిఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండిఅన్నాడు.
తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు రాజా! నాకు కావలసినవి ౧౪ రాశులే. మిగతా ధనం నాది కాదుఅని వెళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మరి ఈ ధనమెవరిదిఅని రఘుమహారాజు మిగిలనదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.     గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
2.     రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
3.     కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.



రతిజ్ఞా పాలన




స్వాతంత్ర్య సమరయోధులనాటి కథ
స్వరాజ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ప్రతి భారతీయుడు వందేమాతర నినాదాలు చేస్తూ బ్రిటిషర్లకు గుండెదిగులయ్యాడు. స్వదేశాభిమానంతో విదేశీవస్తు బహిష్కరణ చేశారు. అట్లా బాహ్యంగా ఆంతరంగికంగా విదేశీయతను తననుండీ దూరం చేశాడు ఓ ప్రముఖ న్యాయవాది. అతడు ప్రఖ్యాత న్యాయవాది అయినా తెల్లవాళ్ళ న్యాయస్థానాల్లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞబూనాడు.
డిసెంబర్ 1924 లో కాంగ్రెస్ మహాసభలు బెల్గాంలో జరిగాయి. ఎందఱో ప్రముఖులు ఆ సభలలో పాల్గొనటానికి వచ్చారు. ఈ ప్రసిద్ధ న్యాయవాది కూడా వచ్చాడు. అందఱూ చూస్తుండగా ఇందోర్ మహారాజు కంగారుగా వచ్చి సరాసరి ఆ ప్రముఖ న్యాయవాది దగ్గరకి వెళ్ళాడు. అందఱూ విభ్రమంతో చూడసాగారు.
అయ్యా! గొప్ప చిక్కొచ్చి పడింది. నా తరపున మీరే వాదించాలి. ఈ 25 లక్షల రూపాయలుంచండి. కేసు గెలిచిన తరువాత మరో 25 లక్షలు సమర్పిస్తానుఅని అర్థించాడు ఇందోర్ మహారాజు. ఆ రోజుల్లో 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇందోర్ రాజు మీద హత్య చేయించి నట్టు ఆరోపించబడింది. కేసు వైస్రాయి ముందు విచారింప బడుతుంది కాబట్టి వాదించే న్యాయవాది బాగా ప్రజ్ఞాశాలి అయివుండాలి. అందుకే ఇందోర్ మహారాజు ఈ న్యావవాదిని ఎన్నుకున్నాడు.
మరెవరైనా అయివుంటే మహాభాగ్యంఅని కేసు ఒప్పుకునేవారే. కానీ ఈ న్యాయవాది నిష్కర్షగా అన్నాడు అయ్యా! క్షమించండి. ఆంగ్లన్యాయస్థానాలలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చాకే నేను న్యాయస్థానాల్లోకి వసాను. ధన ప్రలోభంతో మీ కేసు ఒప్పుకుని ఆత్మవంచన చేసుకోలేనుఅని జవాబిచ్చాడు. ఆ న్యాయవాది సత్య వాక్ పరిపాలనను చూసి ముగ్ధుడైన రాజు మరో న్యాయవాదిని ఎన్నుకున్నాడు.
ఆ న్యాయవాది దేశ బంధుగా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్.



పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:

ఏమైనా రాని ఏమైనా కానీ అన్నమాట నిలబెట్టుకోవటం నిజమైన భారతీయుని లక్షణమ్. 50 లక్షల రూపాయలొస్తున్నా కొంచంకూడా ప్రలోభ పడకుండా చిత్తరంజన్ గారు ఆ రూపాయలను తృణప్రాయంగా ఎంచి తమ మాటకి కట్టుబడ్డారు. అందుకే వారు దేశ బంధువైనారు.




కుశిక మహారాజు కథ



శ్రీమహాభారతం లోని కథ
ఒకసారి మహాతోజోమయుడైన చ్యవన మహర్షి కుశిక మహారాజును పరీక్షించుటకు ఆయన కడకు వచ్చెను. వచ్చుచున్న చ్యవన మహర్షిని చూచి కుశికుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులిచ్చి మహాత్మా! మీ రాకతో మా నగరము పావనమైనది. ఏదో బలీయమైన కారణముంటేగాని మీ వంటి తపోధనులు రారు. మీ అభీష్టమేమో సెలవీయ్యండి. మీకు సేవచేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండిఅని అర్థించాడు. చ్యవనుడు రాజా! నీ వినయవిధేయతలు మెచ్చితిని. నీకడ కొన్నాళ్ళు ఉండవలెనని వచ్చితిని. నాకేలోటు రాకుండా నీవు నీ భార్య నాకు పరిచర్యలు చేయాలి. నా కోరిక తీర్చగలవా?” అని అన్నాడు. సాధు సజ్జన సేవే మహాభాగ్యమని కుశికుడు చ్యవనుడుండడానికి హృద్యమైన మందిరం చూపించాడు.
రాజదంపతులు చ్యవనుడు ఆ సాయంకాలం ఆహ్నికాలు దేవతార్చన చేసుకొన్నారు. తరువాత మునీశ్వరునకు మృష్టాన్నమిచ్చి సంతృప్తి పఱచినాడు కుశికుడు. భోజనానంతరము చ్యవునుడు రాజా! నేనిక నిద్రిస్తాను. నీవు నీ భార్య నిద్రాహారాలు మాని నా పాదసేవ చేయండి. నా అంతటనేను లేవనంతవరకు నన్ను లేపకండిఅని యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు చ్యవనుడు. మహర్షి పాదసేవే మహాభాగ్యం అని కుశికుడు అతని అర్థాంగి ఏకాగ్రచిత్తంతో పాదసేవ చేయసాగారు.
ఇలా 21 దివసములు గడిచాయి. మఱునాడు చ్యవనుడు మేల్కొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురం వదలి నడువసాగాడు. ముని వెంటపోయిన రాజదంపతులను తన మాయతో భయభ్రాంతుల్ని చేశాడు. మరల నిదుర పోయాడు. కుశిక దంపతులు యథావిధిగా పాదసేవ చేశారు. మళ్ళీ 21 దినములు కడచెను. ఆ తరువాత రాజా! నేను రథమెక్కి యాచకులకు సువర్ణము రత్నములు గోవులు అశ్వములు దానమిచ్చుచుందును. మీరిద్దరు నా రథమును గుఱ్ఱములకు బదులుగా లాగవలెనుఅన్నాడు. కుశికుడు ముందర రాణి వెనుక ఉండి రథములాగినారు. చ్యవనుడు మునికోలతో రక్తంవచ్చేటట్టు వారిని కొట్టుచు యాచకులకు వస్తువులిచ్చుచూ రథంమీద వెళ్ళాడు. రథం ఊరి చివరికి వెళ్ళాక ముని రథము దిగి ఏమాత్రమూ చలించని రాజదంపతులని చూశాడు. కుశికుడు అతని భార్య మనస్సులలో కొంచెంకూడా కోపంగానీ విసుకుగానీ మరి ఏ వికారము కానీ లేవు. వారి నిర్మల హృదయం ఆశ్చర్యంతో చూసి ముని వారి శరీములు తాకి ఇలా అన్నాడు రాజా మీరింక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఱేపు గంగాతీరం వద్దనున్న వనానికి రండి”.
వారి శరీరముల పైని గాయాలు అన్ని మాసిపోయాయి! కుశికుడు మహాత్మా! నీ చర్యలు అద్భుతాలు. మాకే శ్రమ లేదు. మీబోటి మహనీయుల మహిమ ఎఱుగుట ఎవరి తరము”? అని అన్నాడు. మఱునాడు చ్యవనుడు చెప్పిన ప్రదేశానికి కుశికుడు అతని భార్య వచ్చారు. అక్కడ స్వర్గమును బోలు దివ్య భవనమున్నది. రాజు రాణి ఆ దివ్య భవమును చూచి మిక్కిలి ఆనందమునొందిరి. చ్యవన మహర్షి వారిని దగ్గరికి పిలిచిరాజా! మీ శాంత స్వభావము లోకోత్తరం. మీ సాధుజన సేవాభావం అద్వితీయం. ఇంత ఇంద్రియ నిగ్రహము కలమీకు వరమిచ్చెద కోరుకొనుముఅని అన్నాడు.
కుశికుడు మౌనివరేణ్య! నీ సేవా భాగ్యము దొఱకుటే మాకు వరము. మీ దయే చాలు. మాకింకే కోరికా లేదుఅన్నాడు. రాజదంపతుల వైరాగ్యబుద్ధికి మెచ్చి చ్యవనుడిలా అన్నాడు ఓ రాజా! మీ వంశమునేకాక ఈ విశ్వాన్నే తరింపచేసే మనుమడు పుడతాడు. అతడు బ్రహ్మర్షి అయ్యి పరమాత్మ ఐన శ్రీ రామునకు గురుస్థానమున ఉండగలడు. అతడు విశ్వామిత్రుడు. నీ వలన కౌశికుడే నామధేయంతో ప్రసిద్ధికెక్కుతాడు”.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:

సాధుసేవ యొక్క ప్రాధాన్యత శాంత స్వభావము యొక్క ఔన్నత్యం మనకు కుశిక దంపతులు బోధించారు. వారు ౨౧ దినములు నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో మునీశ్వరునికి పాదసేవ చేశారు. మహర్షి మునికోలతో కొట్టి వారిచేత రథం లాగించినా వారికే మాత్రము కోపము రాలేదు. విరాగులైన కుశిక దంపతులు ధన్యులు.







Om Tat Sat
                                                        
(Continued...)  


 
(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )


0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels