నీతి కథలు
దురాశ దుఃఖములకు చేటు
కైకయ రాజైన ప్రతాపభానుడు సద్గుణసంపన్నుడు మరియు గొప్పయోధుడు. అతని ప్రియసోదరుడు అరిమర్దనుడు. అరిమర్దనుడు మహాబలశాలి వీరుడు. ప్రతాపభానుని మంత్రి ధర్మరుచి. అతడు నీతజ్ఞుడు బుద్ధిమంతుడు రాజనీతిలో శుక్రుని తోటివాడు శ్రీహరిభక్తుడు రాజుకు హితైషి. దిగ్విజయయాత్రలో ఆ రాజు సప్తద్వీపాలనూ జయించి సమస్త భూమండలమునకు ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావమువలన ఆ రాజు గురువులను దేవతలను సాధుసజ్జనులను పితరులను భూసురులను భక్తివిశ్వాసాలతో సేవించుచుండెడివాడు. రాజధర్మములను వేదోక్తముగా పాటిస్తూ నిత్యమూ అనేక దానధర్మాలు చేసేవాడు. పురాణేతిహాసములను భక్తిశ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులు చెఱువులు ఉద్యానవనాలు దేవతామందిరాలు కట్టించి ప్రజారంజకముగా రాజ్యపాలన చేసేవాడు.
వనాలలో ఆశ్రమములను నిర్మించుకొన్న మహర్షులు తమ తపశ్శక్తిలో ఆఱవభాగము రాజులకు ధారపోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుందురు. కావున లోకహితైషులైన మహర్షులను క్రూరమృగములనుండి కాపాడంటం రాజుల విధి. ఒకసారి ప్రతాపభానుడు వింధ్యాటవికి శాస్త్రప్రకారము చంపదగిన మృగములను వేటాడుటకై వెళ్ళెను. ఆ సుందరారణ్యములో ఒక పెద్ద అడవిపందిని చూసి దానివెంటబడ్డాడు రాజు. ఆ వనవరాహము ఎంత ప్రయత్నించినా తనకి చిక్కలేదు. ఎంతో దూరం పరుగెత్తి ప్రవేశించుటకే దుర్గమమైన ఘనారణ్యములోకి వెళ్ళిపోయింది ఆ వరాహము. ధీరుడైన ప్రతాపభానుడు తనప్రయత్నం మానక ఆ దట్టమైన అడివిలోకి ఏకాకిగా ప్రవేశించాడు. చివరికి ఆ వరాహం ఒక గుహలోకి దూరింది. గుహలోకి వెళ్ళుటకు వీలులేక నిరాశతో ప్రతాపభానుడు వెనుకకు మఱలాడు. కాని ఆ ఘోరారణ్యములో దారితప్పిపోయాడు.
ఆ వనములో తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని నిర్మానుష్యమైన అడవిలో ఒక ఆశ్రమాన్ని కనుగొన్నాడు. ఆ ఆశ్రమము ఒక కపటసన్యాసిది. ఆ కపటవేషధారి పూర్వం ప్రతాపభానునిచే యుద్ధములో ఓడిపోయి పాఱిపోయిన శత్రురాజు. హృదయములో ప్రతాపభానునిపై ద్వేషమును నింపుకొని ఆ అడవిలో ఉంటున్నాడు. ప్రతాపభానుని చూడగానే అతనిని గుర్తుపట్టాడు. కానీ అలసిపోయి ఉన్న ప్రతాపభానుడు వాడిని గుర్తించలేదు! దాహముతో బాధపడుతున్న రాజుకు ఒక సరోవరం చూపించాడు. ప్రతాపభానుడు సరోవరములో స్నానముచేసి శుచి అయ్యి నీరు త్రాగినాడు. ప్రతాపభానుని ఆశ్రమములోపలికి ఆహ్వానించాడు ఆ కుహనాసన్యాసి. “నాయనా! నీవెవఱు? ప్రాణాలకు తెగించి ఈ ఘోరాటవిలోకి ఎందులకు వచ్చావు”? అని అడిగినాడు కపటసన్యాసి. రాజనీతి తెలిసిన ప్రతాపభానుడిలా సమాధానమిచ్చినాడు “ఓ మహాత్మా! మీ సహాయమునకు కృతజ్ఞుడను. నేను ప్రతాపభానుడనే రాజు యొక్క మంత్రిని. వేటకై వచ్చి తప్పిపోయాను. నీ దర్శభాగ్యము కలుగుట నా అదృష్టము”. “ఓ సజ్జనుడా! బాగా చీకటి పడినది. నీ రాజ్యము ఇక్కడికి డెబ్బది యోజనములున్నది. కావున నీవు ఈ రాత్రికి నా ఆశ్రమములో విశ్రాంతి తీసుకుని ఱేపు వెళ్ళు” అని చెప్పాడు ఆ కపటుడు. సన్యాసి దయాగుణాలను ఎన్నో విధాల పొగిడి ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు రాజు.
మాయమాటలతో రాజును తనను నమ్మేలాచేసి ఈర్షాగ్నితో కాలిపోతున్న ఆ కపటసన్యాసి నిర్మలుడైన ప్రతాపభానుడు అర్థించుటచే తన వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు “సోదరా! వినుము. నేనిచట చాలా కాలముగా ఉంటున్నాను. ఇంతవఱకూ నా వద్దకు ఎవరూ రాలేదు. నా గురించి నేనెవరికీ చెప్పుకోలేదు. లోపప్రతిష్ఠ తపస్సును దగ్ధముచేసే అగ్నివంటిదికాదా! అందుకనే ప్రపంచానికి దూరముగా ఉంటున్నాను. శ్రీహరితో తప్ప నాకింకెవరితోను పనిలేదు”. వైరాగ్యబుద్ధి కలిగి శ్రీహరిభక్తుడై ఉన్నాడని తెలియగానే ప్రతాపభానునికి ఆ బకధ్యానిమీద గౌరవం పెరిగిపోయింది. ప్రతాపభానుడు పూర్తిగా తన వశుడైనాడని తెలుసుకొని “పుత్రా! నా పేరు ఏకతనుడు. సృష్టిప్రారంభములో నేను జన్మించాను. తరువాత మఱియొకదేహము దాల్చలేదు అందుకే నన్ను ఏకతనుడంటారు”. ఆశ్చర్యముగా వింటున్న ప్రతాపభానునికి అప్పుడు కపటసన్యాసి ఎన్నో ప్రాచీనగాథలు పురాణేతిహాసములు సృష్టిస్థితిలయములను గూర్చిన వింత వింత కథలెన్నో చెప్పాడు. జ్ఞానవైరాగ్యాల మీద వ్యాఖ్యానాలిచ్చాడు. ఇవన్నీ విని పరవశుడై రాజు “స్వామీ! నేను ప్రతాపభానుడను” అని చెప్పాడు. “రాజా! గురుకృపవల్ల నాకు అంతా తెలుసు. మీ తండ్రి పేరు సత్యకేతువు. నీ రాజనీతి మెచ్చుకుంటున్నాను. తెలియని వానితో పేరు చెప్పిన రాజ్యమునకే అపాయము అని తెలిసి నీవు ఇందాక నీ పేరు చెప్పలేదు. నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకొక వరమిస్తాను కోరుకో” అని అన్నాడు ఆ కపటసన్యాసి.
సద్గుణ సంపన్నుడైనా ప్రతాపభానునకు ఒక తీరనికోరిక ఉండేది. దురాశ అనే హాలాహలముచే బాధింపబడుతున్న ఆ రాజు ఇలా కోరాడు “ఓ దయాసాగరా! నా శరీరము జరామరణదుఃఖ రహితమగుగాక. యుద్ధములో నన్నెవరూ జయింపకుండు కాక. భూమిపై నూఱుకల్పములు నా ఏకచ్ఛత్రాధిపత్యము నిలిచియుండుగాక”. ధర్మరుచి ప్రభావము వలన తాను చేసే కర్మ అంతా శ్రీహరికి అర్పించి “సర్వం కృష్ణార్పణమ్” అని అంటున్నా ప్రతాపభానుడు ఆ సూక్తిలోని ఆంతర్యమును అర్థంచేసుకోలేదు. పూర్వం హరణ్యకసిపుడు కోరిన వరము వెలెనున్న ఈ దురాశాభూయిష్టమైన వరమును కోరినాడు. నిజమైన సన్యాసి అయితే ఈ కోరిక విని “నాయనా! ఈ శరీరము శాశ్వతము కాదు. ఎందులకు దీనిమీద ఇంత మక్కువ? భగవద్భక్తి ఒక్కటే శాశ్వతము శ్రీహరిని శరణు వేడు” అని హితవు చెప్పేవాడు. కానీ కపటుడగుటచే ఆ సన్యాసి “తథాస్తు. నిన్ను సర్వప్రాణులనుండి కాపాడతాను. నా ప్రభావం వల్ల యముడు కూడా నీ దగ్గరకు రాలేడు. కానీ ఒక్క విప్రశాపం నుండి నేను నిన్ను రక్షించలేను” అని అన్నాడు. “గురూత్తమా! విప్రులను ప్రసన్నము చేసుకునే ఉపాయము దయతో నాకు సెలవీయ్యండి” అని ప్రార్థించాడు రాజు. “సరే. కానీ నీవీ విషయము చాలా రహస్యముగా ఉంచాలి. నన్ను కలుసుకున్నట్టు ఎవరితో నైనా చెపితే నీకు బహుదుఃఖములు కలుగుతాయి. నీ మంచి కోరే చెపుతున్నాను. మూడోకంటికి ఈ విషయము తెలిసిందా నీవు నశిస్తావు” అని అన్నాడు సన్యాసి.
“గురువర్య! త్రిమూర్తులు కోపగించినా గురు రక్షిస్తాడు కానీ గురువే కోపిస్తే రక్షించేవాడుండడు. మీ ఆజ్ఞ అతిక్రమించను. ఆజ్ఞ ఇవ్వండి. శిరసావహిస్తాను” అని అన్నాడు ప్రతాపభానుడు. ఆహా! ఆశ ఎంత దారుణమైనది! ఇన్ని ఏండ్లుగా విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారాన్ని ప్రసాదించిన తన నిజగురువును ఒక్క నిమిషములో వదిలేసి కపటసన్యాసి గురించి ఏమీ తెలియకుండానే వాడిని నమ్మి “గురూత్తమా!” అని సంబోధించేలా చేసింది. అప్పుడు ఆ బకధ్యాని “విప్రులను స్వాధీనపఱచుటకు అనేక మార్గములు కలవు. నీకు అన్నిటికన్నా సులభమార్గము చెప్పెదను. ఒక సంవత్సరముపాటూ ప్రతిరోజు లక్షమంది ఉత్తములైన విప్రులను కుటుంబసహితముగా అహ్వానించు. నేను నా తపశ్శక్తిచే మీ పురోహితుని వేషముదాల్చి వారికి వండిపెట్టెదను. ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకో. నా తపశ్శక్తిచే నిన్ను నీ అంతఃపురములో చేరుస్తాను. సరిగ్గా మూడు రోజుల తరువాత నీ పురోహితుని రూపములో నీకు దర్శనమిస్తాను. అన్ని ఏర్పాట్లు చేసివుంచు” అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించి బాగా అలసిపోయినందు వలన గాఢనిద్రపోయాడు.
ఇంతలో కపటసన్యాసి స్నేహితుడైన కాలకేతు రాక్షసుడు వచ్చాడు. వాడే వరాహవేషము దాల్చి ప్రతాపభానుని దారిమఱల్చినాడు. స్త్రీలను సజ్జనులను దేవతలను హింసిస్తున్న కాలకేతు నూర్గురుకుమారులను పదిమంది సోదరులను యుద్ధములో చంపి దుష్టసంహారం చేశాడు ప్రతాపభానుడు. దీనిని గుర్తుపెట్టుకుని అతనిపై ద్వేషం పెంచుకున్నాడు కాలకేతువు. కపటసన్యాసి కాలకేతువు కలిసి నాటకమాడి ప్రతాపభానుని నాశనం చేయదలచారు! కాలకేయుడు తన మాయతో ప్రతాపభానుని అంతఃపురంలో చేర్చి పురోహితుని ఒక గుహలో బంధించి తానే పురోహితునిగా కామరూపం ధరించాడు. తరువాతరోజు ప్రతాపభానుడు నిద్రమేల్కొని తాను అంతఃపురములో ఉన్న విషయము గ్రహించి ఆ కపటసన్యాసి శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. మూడురోజులు క్షణమొక యుగముగా గడిపినాడు. శ్రీహరి ధ్యానం వదిలి ప్రతిక్షణం ఆ కుహనాసన్యాసి పాదాలనే ధ్యానించసాగినాడు.
అనుకున్న ప్రకారం లక్షమంది ఉత్తమ విప్రులను ఆహ్వానించాడు ప్రతాపభానుడు. ఆ కుహనాపురోహితుడు తన మాయచేత లెక్కలేనన్ని వ్యంజనములు నాలుగురకాలైన వంటలను పాకశాస్త్రమును అనుసరించి షడ్రసోపేతముగా సిద్ధంచేసినాడు. కానీ వానిలో అనేకజంతువుల మాంసములేకాక బ్రాహ్మణులమాంసము కూడా కలిపి వడ్డించినాడు. భోజనార్థము విప్రులు సిద్ధమగుతుండగా కాలకేతుడు ఆకాశవాణిని సృష్టించి “ఓ విప్రోత్తములారా! ఈ భోజనము హానికరము. దీనిలో జంతువిప్ర మాంసమున్నది. దీనిని భుజింపవద్దు” అని పలికించెను. ఆకాశవాణి వినగానే ఆ లక్షమంది విప్రులు “ఓ క్షత్రియాధమా! మమ్ము సపరివారముగా భ్రష్టులను చేయ తలచితివి. నీవుకుటుంబ సహితముగా రాక్షసుడవై జన్మించు. ఒక్క సంవత్సరములో నీవు నీవంశంతో సహా నశిస్తావు. మీకు తిలోదకాలిచ్చెడివారు కూడా ఉండరు” అని ఘోరశాపాన్నిచ్చారు. తమయుక్తి సఫలమైనదని కాలకేతుడు కపటసన్యాసి సంతోషించారు. కపటసన్యాసి శత్రురాజులందఱిని కూడబెట్టుకోని ప్రతాపభానునిపై దండెత్తినాడు. వీరుడైన రాజు అరిమర్దనుడు ఎంతో కాలం వారితో యుద్ధం చేశారు. చివరికి ఒక సంవత్సరం తరువాత తన వంశముతో సహా ప్రతాపభానుడు నశించినాడు. కొలది కాలము తరువాత వారందఱూ రాక్షసులై జన్మించినారు. ప్రతాపభానుడు రావణునిగా అరిమర్దనుడు కుంభకర్ణునిగా ధర్మరుచి విభీషణునిగా జన్మించిరి. ఒకానొక కల్పములో శ్రీరామావతారమునకు ఇదియే నాంది.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1. మానవునకు ఆశ ఉండవచ్చు. కాని “అతి సర్వత్ర వర్జతే”. సమస్త
భూమండలానికి ఏకచ్ఛత్రాధిపతి అయికూడా ప్రతాపభానుడు కపట సన్యాసిని అడగరాని వరంకోరి చివరికి
నాశనమైనాడు.
2. మన శాస్త్రాలలో గురువుని ఎలా వెతకాలో వివరించారు. ఎంతో అన్వేషించి ఉత్తముడైన
వానిని గురువుగా స్వీకరించాలి. ప్రతాపభానుడు తన దురాశ వలన ఒక్క రాత్రి
పరిచయంతోనే కపటుని గురువుగా స్వీకరించాడు.
3. బహిశ్శత్రువులైనా అంతశ్శత్రువులైనా (కామ క్రోధాదులు) హాని చేయకమానవు. కావున
ఎల్లప్పుడూ అప్రమత్తులమై ఉండాలి. ప్రతాపభానుడు శత్రువులైన కాలకేతు కపటసన్యాసులను
గమనించక వారిచేత మోసగించబడినాడు.
శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్
బలరామకృష్ణులకు గోవులనుగాచే వయస్సు వచ్చినది. నీలాంబరధారి అయిన బలరాముడు పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుడు గోవులను చక్కగా అలంకరించి గోపాలురతో కలిసి పచ్చిక బయళ్ళలో విహరించుచుండేవారు. కాళిందీనదీ తీరము వారికి ప్రియమైన విహారస్థలమయ్యెను. తన మధుర వేణుగానముతో పరమాత్మ జీవులకు సామవేద సారాన్ని బోధించేవాడు. బ్రహ్మానందముతో గోవులు గోపబాలురు పశుపక్షాదులు ఆ వేదవేద్యుని వేణుగానం వినుచుండెడివి. శ్రీకృష్ణుడు గోపాలురు ఎన్నో ఆటాలాడేవారు. వారు పక్షులనీడలలో పఱుగులెట్టేవారు. నెమళ్ళ లేళ్ళ గుంపుల వెంటబడేవారు. కోతికొమ్మంచులు బిళ్ళంగోళ్ళు ఆడేవారు. యమునా నదిలో జలకాలాడేవారు.
ఒకసారి వారు వివిధ జంతువులను అనుకరిస్తూ ఆడుచుండగా కంసప్రేరితుడైన వత్సాసురుడు వచ్చి శ్రీకృష్ణుని ఆలమందలో కలిసి పోయాడు.
సర్వజ్ఞుడైన స్వామి అదిగమనించాడు. మెల్లమెల్లగా
వచ్చి ఆ వత్సాసురుడు పరమాత్మను తన్నాడు. నందకిశోరుడు వాడి
కాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి వెలగచెట్టుకేసి కొట్టాటు.
మృతినొందిన ఆ వత్సాసురుడి నుంచి తేజము బయటికి వచ్చి
పరమాత్మలో కలిసిపోయింది.
మురాసురుడనే రాక్షసుని కుమారుడు ప్రమీలుడు. వాడు దురాశకులోనై కపటవిప్రవేషం ధరించి సర్వాభీష్టఫలదాయిని అయిన నందినీధేనువును తనకు దానమిమ్మని వసిష్ఠుని కోరినాడు. నందినీధేనువు వాడి కుటిలత్వం గ్రహించి అసురస్వభావము గల లేగదూడవు కమ్మని శపించింది. పశ్చాత్తాపముతో శరణువేడిన ప్రమీలుని కరుణించి ఆ నందిని “చేసిన పాపమునకు ఫలమనుభవించక తప్పదు. పాపము తీరిన తరువాత నా అనుగ్రహము వలన నీవు పరమాత్మ చేతిలో మరణిస్తావు. అలా ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించింది.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
కుటిలత్వము ఉండరాదని మనకీ కథ ద్వారా తెలిసినది. కపటవేషము వేసి మోసగించబోయిన ప్రమీలుని శపించినది నందినీధేనువు. కావున ఇతరుల నెన్నడూ మోసం చేయరాదు.
శీలసంపద
ఖాండవవన దహనమప్పుడు లోకైకవీరుడైన అర్జునుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా మయాసురుడు మయసభను నిర్మించి ధర్మరాజుకివ్వాలని సంకల్పించుకున్నాడు. మయాసురుడు ఆ భవ్య మయసభను పవిత్ర హిమాలయాలలో నిర్మించి తన మాయశక్తితో ఇంద్రప్రస్థానికి తెచ్చాడు. మయసభలోని అద్భుతాలను పొగడటానికి మాటలుచాలవు. మయసభ అంతా కనక రత్న మణిమయము. మయసభలోని స్తంభాలు ద్వారాలు తోరణాలు వనాలు తటాకాలు అన్నీ మణిమయాలే. రాజసూయ యాగానికి వచ్చిన ఎందఱికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని పొగడబడినది ఆ మయసభ. మయసభ విభవం పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుని అసూయామాత్సర్యాలు మరింత చెలరేగాయి. పాండవుల కీర్తి సంపదలను తలచుకొని తీవ్రంగా దుఃఖిస్తూ తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మత్సరమనే ఘోరసర్పముచే కాటువేయబడ్డ తన కొడుకుకి ఇలా హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు
“కుమారా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యమున్నదా? ఈ లోకంలో సంతృప్తి ఉన్నవాడే ధనవంతుడు. సంతృప్తి లేకుండా కుబేర సంపద ఉన్నా వాడు సంతోషముగా ఉండలేడు. నాయనా! శీలవంతుడైన ధర్మనందనుని శ్రీలక్ష్మి ఎన్నడూ విడువదు. శీలవంతుని ఆశ్రయించే సకల సంపదలు సుగుణములు ఉంటాయి. కాబట్టి నీవు కూడా ధర్మాత్ములైన పాండవులవలె శీలవంతుడవు కమ్ము. తానుతో సిరిసంపదలు వాటంతట అవే వస్తాయి”. కుమారునికి ఒక ఇతిహాసం చెప్పాడు
“ప్రహ్లాదుడు సర్వగుణ సంపన్నుడు విద్యా పారంగతుడు పరమ విష్ణుభక్తుడు. ధర్మం తప్పకుండా తన ప్రజలను పాలించేవాడు. తన సౌశీల్య ప్రభావం చేత త్రిలోకాధిపత్యం ఇంద్రత్వం ప్రాప్తించింది ప్రహ్లాదునికి. చతుర్భువనాలను జనరంజకముగా పాలించసాగాడు ఆ ప్రహ్లాదుడు. ఇలా ప్రహ్లాదుని వలన పదవీ భ్రష్టుడైన శచీపతి గురువైన బృస్పతులవారిని తనకు మళ్ళీ ఇంద్రపదవి సిద్ధించే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి విష్ణు అవతారుడైన పరశురాముని ఆశ్రయించమని చెప్పాడు. గురు ఆజ్ఞపాటించి ఇంద్రుడు భార్గవరాముని శరణుజొచ్చి ఉపాయం బోధించమని ప్రార్థించాడు. “అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతనినే అడుగు. ఆ శక్తిని అతనివద్దనుండే పుచ్చుకో” అని చెప్పాడు భార్గవుడు.
విద్యార్జన గురుసుశ్రూష వలనే సాధ్యం అని తెలిసిన దేవేంద్రుడు విప్రవేషం ధరించి ప్రహ్లాదునికి శిష్యుడై అతనిని భక్తితో సేవించటం మొదలుపెట్టాడు. అలా ఎంతో కాలం ప్రహ్లాదుని సేవించినాడు వజ్రి. ప్రసన్నుడైన ప్రహ్లాదుడు “నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?” అని విప్రవేషంలో ఉన్న ఇంద్రుని అడిగాడు. శచీపతి తన అభీష్టం వ్యక్త పఱచినాడు. అప్పుడు ప్రహ్లాదుడు
“కుమారా! నేనెప్పుడూ రాజునని గర్వించను. ఎవఱినీ నొప్పించను. వారికి హితమేచేస్తాను. ఈర్ష అసూయ ద్వేషం పగ మొదలైనవి నా దరి చేరనివ్వను. అడిగినవాడికి లేదనకుండా సంతోషపెడతాను. నా పురాకృత పుణ్యం వలన నాకీ సౌశీల్యం అబ్బినది” అని చెప్పాడు. “ఓ దయామయా! దానశీలా! నీ శీలం నాకు ప్రసాదించు” అని అడిగాడు ఇంద్రుడు. “అయ్యో పాపం!” అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దేవేంద్రునికి దానం ఇచ్చి పంపివేశాడు.
ఇంద్రుడు వెళ్ళాడో లేదో ప్రహ్లాదునిలోనుండి ఒక దివ్య తేజఃపుంజము పురుషాకృతిదాల్చి బయటికి వచ్చింది. “నీవెవరు?” అని ఆశ్చర్యాముగా అడిగాడు ప్రహ్లాదుడు.
“నేను నీ శీలాన్ని. ఆ విప్రునికి నన్ను దానం ఇచ్చావు కదా. వెళుతున్నాను” అని చెప్పి వెళిపోయింది శీలము. ఒకతేజస్సు తరువాత ఒకటి ప్రహ్లాదుని వీడిపోయినాయి. ఒక తేజస్సు అన్నది “నేను సత్యమ్. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. శీలంతో పాటూ నేను నిన్ను విడుస్తున్నాను”. మరొక తేజస్సు అన్నది “రాజా! నేను ఋజుప్రవర్తనమ్. సత్యము లేని చోట నేనుండలేను”. “నేను బలమ్. సత్ప్రవర్తన లేనివాడి వద్ద నేనుండను” అని వెళ్ళిపోయింది బలమ్. చివరికి ఆదిలక్ష్మి బయటికి వచ్చి “నేను శ్రీలక్ష్మిని. బలం ఉన్నచోటే నేనుంటాను. వెళుతున్నాను” అని అన్నది. అప్పుడు ప్రహ్లాదుడు “అమ్మా! లోకమాతా! నీవూ నన్ను విడిచిపోతున్నావా? ఈ అభాగ్యునిపై దయ చూపవా? వెళ్ళద్దు తల్లీ! ఆ విప్రుడు ఎవఱు తల్లీ?” అని ప్రార్థించాడు. “అతడు దేవేంద్రుడు. పోగొట్టుకున్న రాజ్యమును సంపాదించడనికి నీవద్దకు వచ్చాడు. అన్ని సంపదలకూ మూలమైన శీలమును నీవు అతనికి దానమిచ్చావు కావున శీలాన్ని అనుసరించి మేమందఱమూ వెళుతున్నాము” అని సర్వాణి చెప్పింది. నిజమైన శ్రీహరి భక్తులకు సాధ్యం కానిదేమున్నది? ప్రహ్లాదుడు మళ్ళీ తన సద్గుణాలను సంపదలను అచిరకాలంలోనే సంపాదించుకున్నాడు. కనుక నీవెల్లప్పుడూ సౌశీల్యుడవై వర్ధిల్లు నాయనా!” అని కుమారునికి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.
పిల్లలూ! మనమీ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
సౌశీల్యం యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. శీలమున్న వాడి వద్దనే సకల సంపదలుంటాయి. కాబట్టి మొదట శీలవంతులము కావడం ముఖ్యము
భర్తృహరి కథ
మహానుభావుడైన కేశవశర్మకు నలుగురు ఉత్తములైన పుత్రులు దైవానుగ్రహము వలన కలిగినారు. సంస్కృత వ్యాకరణకర్త దివ్య శివమహిన్మా: స్తుతికర్త అయిన కాత్యాయన వరరుచి, అతిలోక సాహవంతుడు ధర్మాత్ముడు మహాకాళీభక్తుడు అయోధ్యాలయ పునరుద్ధారకుడు శకకర్త అయిన విక్రమార్కుడు, పండితుడు మహావివేకవంతుడు కాళీ అనుగ్రహపాత్రుడు అయిన భట్టి మరియు సంస్కృత మహాకవి సుభాషిత రత్నావళికర్త వాక్యప్రదీప, రాహత, కారిక గ్రంథకర్త అయిన భర్తృహరి ఆయన నలుగురు కుమారులు. కేశవశర్మ యోగ్యుడైన భర్తృహరికి రాజ్యభారమప్పగించి వానప్రస్థమును స్వీకరించాడు. చిన్నప్పటినుంచి భర్తృహరి సాధుసజ్జనుల సేవలుచేస్తూ ఉండేవాడు.
భర్తృహరి రాజ్యములో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధనానికి పేదకాని గుణానికి కాదు. సౌశీల్యుడు మంత్రతంత్రశాస్త్ర కోవిదుడు అయిన ఆ విప్రోత్తముడు భువనేశ్వరీదేవి ఉపాసకుడు. మాత ఆ పరమభక్తుని అనుగ్రహించదలచి ఆయన ముందు ప్రత్యక్షమై “కుమారా! నీ గుణసంపదను భక్తిని మెచ్చినాను. ఈ దివ్యఫలం తీసుకో. ఈ ఫలం తిన్నవాడికి జరామరణాలు ఉండవు!” అని ఆజ్ఞాపించింది జగజ్జనని.
గుణాగ్రగణ్యుడైన ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచించాడు “నేను ఒక పేదబ్రాహ్మణుడను. అమృతత్వము సంపాదించిననూ నేను ఎవరిని కాపాడగలను? ఈ పండు కనక మన మహారాజుగారు తింటే ఎందఱో నిర్భాగ్యులను రక్షించగలడు. అప్పుడే నేనీ ఫలమును సద్వినియోగము చేసినవాడను అవుతాను”. ఇలా తలచి ఆ బ్రాహ్మణుడు మహారాజైన భర్తృహరి వద్దకు వెళ్ళి అతనిని ఆశీర్వదించి ఆ దివ్యఫలాన్ని అతనికిచ్చి వచ్చేశాడు!
ఫలము యొక్క మహిమను అర్థంచేసుకోలేక భర్తృహరి ఆ ఫలమును తన ప్రియురాలైన అనంగసేనకు ఇచ్చివేసాడు. కుటిలాత్మురాలైన ఆ అనంగసేన తన సఖుడైన అశ్వపోషకునికి ఆ దివ్యఫలం ఇచ్చింది. మూర్ఖుడైన ఆ అశ్వపోషకుడు తన దాసికి ఆ ఫలాన్ని ఇచ్చాడు. ఆమె తనకు ప్రియుడైన ఒక గోపాలకునికి ఫాలాన్ని ఇవ్వగా వాడు దానిని తన ప్రియురాలికిచ్చాడు. ఆ చిన్నది పశువులపెంట ఉన్న బుట్టలో పండును పెట్టి రాజమార్గముగుండా ఆ బుట్టను తలపైపెట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. భర్తృహరి ఆ పండును చూశాడు. బ్రాహ్మణుడు మహాత్యాగం చేసి లోకహితార్థం తనకిచ్చిన దివ్యఫలం చివరికి పెంటబుట్టలో చేరిందని బాధపడ్డాడు. ఆ పండు ఎంతమంది చేతులు మారిందో తెలుసుకున్నాడు.
ఒక్కసారిగా భర్తృహరికి వైరాగ్యం వచ్చింది. సంసారం మీద విరక్తి పుట్టింది. తను ఎవరినైతే ప్రియులు అనుకుంటున్నాడో వాళ్ళు నిజమైన ప్రియులు కాదని పరమేశ్వరుడొక్కడే ప్రాణబంధుడని తెలుసుకున్నాడు. మిథ్యాజగత్తులోని విషయభోగాలను త్యజించి రెమేశునిపై అనురక్తుడై వైరాగ్యముతో తపోవనాలకు వెళ్ళడనికి సిద్ధపడ్డాడు. దేవీప్రసాదమైన ఆ దివ్యఫలాన్ని తన రాజ్యసర్వస్వాన్ని యోగ్యుడైన విక్రమార్కుని చేతిలో పెట్టి తపస్సుకై వెళ్ళిపోయాడు.
మహౌదార్యుడైన విక్రమాదిత్యుడు తన వద్దకు వచ్చిన దీనుడైన ఒక బ్రాహ్మాణునిపై జాలిపడి ఆ దివ్యఫలాన్ని అతనికి ఇచ్చివేశాడు!!
రత్నైర్మాహార్హైస్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిమ్|
సుధాం వినా న పరయుర్విరామం న నిశ్చితార్థాద్విరమన్తి ధీరాః||
- భర్తృహరి నీతిశతకమ్
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1. విప్రోత్తముని
సద్భావము మనకు కనువిప్పుకావాలి. లోకంలో జనాలు వృద్ధాప్యం
రాకూడదు మృత్యువు రాకూడదు అని తపిస్తుంటే ఆ బ్రాహ్మణుడు జరామరణ రహితముగా
చేసే దివ్యఫలాన్ని లోకహితార్థం మహారాజుకు ఇచ్చివేశాడు. స్వధర్మపాలలనో
పరాకాష్టను చూపిన ఆ భూసురుడు ధన్యుడు.
2. “అంతా
మిథ్య తలంచిచూచిన” అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు భర్తృహరి. లౌకిక
విషయాలను విడిచి మోక్షమార్గోన్ముఖుడైనాడు. ఆయన మనకు అందించిన సుభాషితాలను
చదివి అర్థంచేసుకుని మన నిత్యజీవితములో అనుసంధానం చేసుకోవడం మన కర్తవ్యము.
3. విక్రమార్కుని ఔదార్యము గొప్పది. దీనుడైన విప్రునికి దివ్యఫలాన్ని దానం చేసి
తన త్యాగబుద్ధిని మనకు చూపినాడు.
గౌతమ మహర్షి కథ
ఒకసారి సృష్టికర్త అయిన చతుర్ముఖుడు సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. “న హల్యతి ఇతి అహల్య”. అంటే ఎందులోనూ అఱకొఱలు లేనిది సాటిలేనిది అని అర్థము. బ్రహ్మదేవుడు ఆ అపూర్వ గుణవతి సౌందర్యవతికి వరుడెవ్వడని యోచించి తీవ్ర బ్రహ్మచర్య నిష్ఠ నిగ్రహం ఉన్న సంయమీంద్రుడే ఆమె భర్తకాగలడని నిశ్చయించినాడు. గౌతమ మహర్షి అట్టి ధీరుడని కనుగొని ఆతనిని పరీక్షించుటకై “నాయనా! ఈ అతిలోక సుందిరి నా పుత్రిక అహల్య. ఈమెను నీ ఆశ్రమములో వదిలి వెళుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళతాను” అని ఆజ్ఞాపించాడు. ఆ పరమేష్టికి ప్రీతిచేయుట కంటే అధికమేమున్నది తలచి గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఎంతో కాలము గడచిపోయింది. అయినా ఎన్నడూ సంయమీంద్రుడైన ఆ గౌతముడు అహల్యను చూసి చలించలేదు. పరమశివభక్తుడైన ఆ గౌతముడు పంకజాసనుని పరీక్షలో నెగ్గాడు. గౌతముని నిగ్రహాన్ని మెచ్చుకొని అహల్యను అతనకి అర్థాంగిగా అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు.
మహర్షులు తపస్సుకై అనేక ప్రాంతాలు సంచరిస్తూ కొన్ని చోట్ల నివసించి తమ తపశ్శక్తి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం పునీతం చేసి మరొకప్రాంతానికి వెళుతుంటారు. అలా ఒకసారి గౌతమ ఆహల్య దంపతులు త్ర్యంబకేశ్వరుని సన్నిధివద్దనున్న బ్రహ్మగిరిపై ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండసాగినారు.
గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో నిపుణుడు. భారతీయుల వేదవిజ్ఞానం భౌతికమైన విజ్ఞానమే కాక దానికి ఆధారమైన ఆధ్యాత్మిక దైవిక విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందఱినో ఆదుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన ఉన్న ప్రాంతములో క్షామము వచ్చింది. యోగీశ్వరులు తప్ప మిగిలినవారంతా ప్రాణాలు కాపాడుకోవటానికి తాలా ఒక వైపుకి వెళ్ళిపోయారు. దయాళువైన గౌతముడు ప్రజల పశుపక్షాదుల బాధలు చూడలేకపోయాడు. అనివార్యమైన ప్రారబ్ధాన్ని కూడా మార్చగలిగే శక్తి తపస్సుకున్నదని తెలిసిన గౌతముడు ఆఱు నెలలు వరుణదేవునికై తీవ్రతపస్సు చేసినాడు. గౌతముడి పరోపకారబుద్ధికి మెచ్చి వచ్చిన వరుణుడిని గౌతముడు వర్షాన్ని ప్రసాదించమని కోరినాడు. అప్పుడు ఆ వరుణుడు “ఓ మునీంద్ర! కాలధర్మమును అతిక్రమించి వర్షించలేను కదా! మహాకాలుడైన ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుబద్ధులము మేము. జీవుల పాపపుణ్యాలను అనుసంధానము చేసి ఆ మహేశ్వరుడు మా ద్వారా ప్రకృతిని శాసిస్తాడు. ఇప్పుడు కొంతకాలము క్షామము తప్పదు” అని అన్నాడు. ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.
అహల్యా గౌతమ దంపతులు నిరంతర అతిథిసేవా పరాయణులు. గౌతముడు తన వ్యవయాస శాస్త్రవిజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి కాయగూరలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి పతివ్రత అయిన అహల్య ఆ పంటలనుండి వచ్చిన వాటిని వండి అతిథులకు ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య.
ఇలా ఉండగా గౌతమ అహల్యల అద్వితీయ అతిథిసేవ వారి ధర్మనిరతి చూసి ఈర్ష చెందారు కొందరు మునులు! ఆహా! ఈర్ష అతి దారుణామైనది. అది మహామేధావులైన మునులను సైంతం విడువదు. “ఈ జలం తాము తెచ్చిందేననే అహంకారంతో విర్రవీగుతున్నారీ అహల్యాగౌతములు” అంటూ కువ్యాఖ్యానాలు చేసేవారు. ఈర్ష మత్సరముగా మారి చివరికి వాళ్ళు గౌతముని అక్కడనుండి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. అన్నం పెట్టిన గౌతమునికి కృతజ్ఞత చూపక పోవటమేకాక అతనికి కీడు చేయాలని అనుకున్నారు. మత్సరముతో బాధపడుతున్నవాడు ఎంత పాపకార్యము చేయటానికైనా వెనుకాడడు కదా!
గౌతముడు తప్పస్సును లోకహితార్థము ఉపయోగించితే ఈ మునులు మత్సరముతో అతనికి హానిచేయటానికి ఉపయోగించారు. పవిత్రమైన మంత్రములను లౌకిక స్వార్థ ప్రయోజనాలకై వాడకూడదని తెలిసికూడా ఆ మునులు గౌతమునికి కీడు చేయాలనే ఉద్దేశ్యముతో మహాగణపతిని మంత్రబద్ధముగా ఉపాసనచేశారు. ప్రత్యక్షమైన విఘ్నేశ్వరునితో తమ కోరిక చెప్పారు. ఆ వినాయకుడు ఆశ్చర్యపడి “ఔరా! ఏమి చిత్రము! ప్రాణదాతకి ప్రత్యుపకారం చేయకపోగా అతనికి అపకారం చేస్తున్నారే! ఇట్టి కృతఘ్నుల పాపానికి నిష్కృతి ఉండదు” అని తలచి “నాయనలారా! అపకారికి ఉపకారము చేయమని మన శాస్త్రాలు ఘోషిస్తుంటే మీరు కనీసము కృతజ్ఞతా ధర్మాన్ని కూడా పాటించుట లేదెందులకు? ఈ ప్రయత్నం మానండి. కృఘ్నతకు మించిన పాపం లేదు” అని హితవు చెప్పాడు. “స్వామి! నీవు నిజంగా మంత్రబద్ధుడవే అయితే మా కోరిక తీర్చు” అని సమాధానం చెప్పారు ఆ మునులు. “ఎవరి కర్మకు వారే బాధ్యులు. అటులనే అగుగాక” అని అంతర్ధానమయ్యాడు మహాగణపతి.
గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించినాడు. అది గౌతముడి పొలాన్ని పాడుచేయసాగినది. పవిత్రమైన గోమాతను ఎన్నడు అదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుని గోవుపై వేశాడు. దానికే అది మృతిచెందినది. గౌతముడు దుఃఖిస్తూ “పరమేశ్వరా! నేనేమి అపరాధము చేసినాను? గడ్డిపరకలు తగిలి గోవు మృతిచెందుటేమి? నన్ను ఈ ఘోరమైన గోహత్యాపాతకము నుండి రక్షించు స్వామి!” అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు “గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమములో ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోండి” అని తూలనాడి రాళ్ళు విసిరి వెళ్ళగొట్టారు.
మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మసూక్ష్మాలు తెలిసిన ఆ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసికూడా పండితమండలిచే ఆమోదముద్ర వేయించుకోవాలనే ఉద్దేశ్యముతో క్రోశదూరం వెళ్ళినా తిరిగివచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి “అయ్యా! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి” అని ప్రార్థించాడు! “గౌతమా! చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వికి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి. లేదా ఈ బ్రహ్మగిరికి నూటొక్కమార్లు ప్రదక్షిణములు చేసి కోటి పార్థివలింగారాధన చేసి గంగాస్నానము చేయాలి” అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి
“నాయనా! గౌతమా! నీవు ధన్యుడవు. ఆజన్మ శుద్ధుడవైన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతఘ్నులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేదమార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశములోని వారంతా పతితులవుతారు. వత్సా! ఏదైనా వరం కోరుకో. ప్రసాదిస్తాను.” అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు “స్వామి! ఈ మునివరులు నాకు ఉపకారమే చేసినారు. వీరివల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది!” అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. “స్వామి! లోకకళ్యాణార్థము గంగను ప్రసాదించు” అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగాభవానిని స్తుతించి గౌతముడు “భాగీరథివై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరివై దక్షిణ భారతాన్ని ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లీ!” అని ప్రార్థించాడు. గంగాదేవి కోరికపై స్వామి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరీనది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేఱున ఆ నది గౌతమీనదిగా ప్రసిద్ధికెక్కినది.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1. ఈ ప్రపంచానికి ఆధారమైన నాలుగు పుణ్యస్తంభాలు: భూతదయ నిరహంకారం పరోపకారం
ఇంద్రియ నిగ్రహమ్. ఈ గుణాలు నిండుగా ఉన్న గౌతముడు మనకు ఆదర్శపురుషుడు.
బ్రహ్మదేవుని పరీక్షలో నెగ్గి గౌతముడు తన అఖండ మనోనిగ్రహాన్ని
మనకు చూపినాడు. క్షామము నుండి ప్రాణులను కాపాడి తన దయ పరోపకార
బుద్ధి చూపినాడు. సకల ధర్మరహస్యాలు తెలిసినా పండితుల వద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్త
విధానము తెలుసుకొని తన వినయవైభవాన్ని చాటినాడు.
2. ప్రకృతిని క్షోభించకుండా మానవకళ్యాణము సాధించే విజ్ఞానము భారతీయులది. గౌతముడు
భౌతిక విజ్ఞానానికి దైవికశక్తిని జోడించి ప్రజాశ్రేయస్సును కల్పించాడు.
3. అహల్యాగౌతములు అసామాన్యమైన అతిథిసేవ చేసి మనకు మార్గదర్శకులైనారు. వారు రోజూ
వరి కూరలు మొదలైనవి పండించి వండి ఆర్తులకు వడ్డించేవారు.
4. కృతఘ్నతకు మించిన పాపములేదని పరమశివుడు చెప్పాడు. అట్టి వారి పాపానికి నిష్కృతిలేదని
మనకు చెప్పాడు పరమేశ్వరుడు. కావున మనము ఎల్లప్పుడు కృతజ్ఞులమై
ఉండాలి.
5. ఈర్ష అసూయ మత్సరము మానవునిచే ఎట్టి దారుణపాపకృత్యాన్నైనా చేయిస్తాయి. కాబట్టి
మనను ఈర్షకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలి
Om Tat Sat
(Continued...)
(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )
0 comments:
Post a Comment