నీతి కథలు - 18



























నీతి కథలు





వితరణశీలి విక్రమార్కుడు



విక్రమార్కుని సాహసగాధలలోని కథ
విక్రమార్కుని ధైర్యసాహసాలు దానపరోపకారగుణాలు త్యాగనిరతి పేరుప్రతిష్ఠలు దిగ్దిగంతాలకు వ్యాపించినాయి. ఒకరోజు అవంతీరాజు ఒకభట్రాజు పద్యాల ద్వారా విక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత నీతిమంతుడు సత్యనిష్ఠుడు గుణాగ్రగణ్యుడు లోకంలో ఉంటాడా? అని అశ్చర్యమేసింది ఆయనకు. విక్రమార్కుని మీద కించిత్ అసూయపడి నాకు విక్రమార్కుడంత కీర్తిప్రఖ్యాతులు ఎలావస్తాయి?” అని విచారించసాగినాడు. అదే ఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు.
ఒకరోజు అవంతీరాజు వద్దకు ఒక సన్యాసి వచ్చాడు. యథావిధిగా అతనిని పూజించి రాజు స్వామి! విక్రమార్కుని గుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను. ఆ విక్రముడంతటివాడు మీ భూమిమీదు లేడు. అట్టి యసస్సు నాకెలా వస్తుందో చెప్పండిఅని ప్రార్థించాడు. సన్యాసి రాజా! నీకొక సూక్ష్మోపాయం చెబుతాను. హిమవన్నగర సమీపములో ఒక కాళికాలయం ఉన్నది. సిద్ధప్రదేశమైన ఆ ఆలయం వద్ద కొందరు యోగపురుషులు హోమక్రియలు చేస్తుంటారు. నీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై ఆలయప్రాంతంలోకి ప్రవేశించు. గుండమొకటి త్రవ్వి కాళికాదేవికై హోమముచేసి చివరికి గుండములో దూకి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో. దయాసాగరులైన ఆ యోగపురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి మెచ్చి దేవి కరుణిస్తుందిఅని హితము చెప్పాడు.
సదాచారుడైన రాజు అటులనే చేశాడు. ప్రత్యక్షమైన కాళికాదేవితో ప్రతిదినమూ ఏడుకోట్ల ధనం నాకు రావాలిఅని అడిగాడు. నాయనా! ప్రతిరోజూ నీవు హోమంచేసి పూర్ణాహుతి నిచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే జరుగుతుందిఅని దేవి చెప్పి అంతర్ధానమయినది. అవంతీరాజు యోగపురుషులకు కృతజ్ఞతలు తెలిపి నగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి ప్రతిరోజూ ఏడుకోట్లు సంపాదించాడు. ఆ ధనముతో ఎన్నో అద్భుతమైన దానధర్మాలు చేసి దానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు.
విమలుడైన విక్రమాక్రుడు అవంతీరాజు యొక్క కీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్పర్వతములోని కాళికాలయానికి వెళ్ళి స్నానముచేసి శుచి అయ్యి ఆలయములో హోమముచేసి తన శరీరాన్ని పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వరంకోరుకోమన్నది. కైలాశశిఖరమంత ఉన్నత హృదయం కల విక్రమాదిత్యుడు ఇలా కోరినాడు గుణవంతుడైన అవంతీరాజు తన శరీరాన్ని పూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి వచ్చేటట్టు దానితో అతడు మరిన్ని దానధర్మాలు చేసుకునేటట్టు అనుగ్రహించు తల్లీ”. దేవి విక్రమార్కుని త్యాగనిరతి చూసి తథాస్తుఅని ఆశీర్వదించింది.
ఈ విషయం తెలుసుకున్న అవంతీరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి రాజా! నీ వితరణశీలత అపూర్వము అద్వితీయము. నీవంటి సౌశీల్యుడైన రాజు యీ భువిలో పుట్టబోడుఅని స్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని వెళ్ళిపోయాడు.
పిల్లలూ! మరి మనకింతటి విశాల హృదయం వితరణగుణం ఉన్నాయా?



శీలసంపద



మహాభారతము లోని కథ
ఖాండవవన దహనమప్పుడు లోకైకవీరుడైన అర్జునుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా మయాసురుడు మయసభను నిర్మించి ధర్మరాజుకివ్వాలని సంకల్పించుకున్నాడు. మయాసురుడు ఆ భవ్య మయసభను పవిత్ర హిమాలయాలలో నిర్మించి తన మాయశక్తితో ఇంద్రప్రస్థానికి తెచ్చాడు. మయసభలోని అద్భుతాలను పొగడటానికి మాటలుచాలవు. మయసభ అంతా కనక రత్న మణిమయము. మయసభలోని స్తంభాలు ద్వారాలు తోరణాలు వనాలు తటాకాలు అన్నీ మణిమయాలే. రాజసూయ యాగానికి వచ్చిన ఎందఱికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని పొగడబడినది ఆ మయసభ. మయసభ విభవం పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుని అసూయామాత్సర్యాలు మరింత చెలరేగాయి. పాండవుల కీర్తి సంపదలను తలచుకొని తీవ్రంగా దుఃఖిస్తూ తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మత్సరమనే ఘోరసర్పముచే కాటువేయబడ్డ తన కొడుకుకి ఇలా హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు
కుమారా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యమున్నదా? ఈ లోకంలో సంతృప్తి ఉన్నవాడే ధనవంతుడు. సంతృప్తి లేకుండా కుబేర సంపద ఉన్నా వాడు సంతోషముగా ఉండలేడు. నాయనా! శీలవంతుడైన ధర్మనందనుని శ్రీలక్ష్మి ఎన్నడూ విడువదు. శీలవంతుని ఆశ్రయించే సకల సంపదలు సుగుణములు ఉంటాయి. కాబట్టి నీవు కూడా ధర్మాత్ములైన పాండవులవలె శీలవంతుడవు కమ్ము. తానుతో సిరిసంపదలు వాటంతట అవే వస్తాయి”. కుమారునికి ఒక ఇతిహాసం చెప్పాడు
ప్రహ్లాదుడు సర్వగుణ సంపన్నుడు విద్యా పారంగతుడు పరమ విష్ణుభక్తుడు. ధర్మం తప్పకుండా తన ప్రజలను పాలించేవాడు. తన సౌశీల్య ప్రభావం చేత త్రిలోకాధిపత్యం ఇంద్రత్వం ప్రాప్తించింది ప్రహ్లాదునికి. చతుర్భువనాలను జనరంజకముగా పాలించసాగాడు ఆ ప్రహ్లాదుడు. ఇలా ప్రహ్లాదుని వలన పదవీ భ్రష్టుడైన శచీపతి గురువైన బృస్పతులవారిని తనకు మళ్ళీ ఇంద్రపదవి సిద్ధించే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి విష్ణు అవతారుడైన పరశురాముని ఆశ్రయించమని చెప్పాడు. గురు ఆజ్ఞపాటించి ఇంద్రుడు భార్గవరాముని శరణుజొచ్చి ఉపాయం బోధించమని ప్రార్థించాడు. అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతనినే అడుగు. ఆ శక్తిని అతనివద్దనుండే పుచ్చుకోఅని చెప్పాడు భార్గవుడు.
విద్యార్జన గురుసుశ్రూష వలనే సాధ్యం అని తెలిసిన దేవేంద్రుడు విప్రవేషం ధరించి ప్రహ్లాదునికి శిష్యుడై అతనిని భక్తితో సేవించటం మొదలుపెట్టాడు. అలా ఎంతో కాలం ప్రహ్లాదుని సేవించినాడు వజ్రి. ప్రసన్నుడైన ప్రహ్లాదుడునాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?” అని విప్రవేషంలో ఉన్న ఇంద్రుని అడిగాడు. శచీపతి తన అభీష్టం వ్యక్త పఱచినాడు. అప్పుడు ప్రహ్లాదుడు
కుమారా! నేనెప్పుడూ రాజునని గర్వించను. ఎవఱినీ నొప్పించను. వారికి హితమేచేస్తాను. ఈర్ష అసూయ ద్వేషం పగ మొదలైనవి నా దరి చేరనివ్వను. అడిగినవాడికి లేదనకుండా సంతోషపెడతాను. నా పురాకృత పుణ్యం వలన నాకీ సౌశీల్యం అబ్బినదిఅని చెప్పాడు. ఓ దయామయా! దానశీలా! నీ శీలం నాకు ప్రసాదించుఅని అడిగాడు ఇంద్రుడు. అయ్యో పాపం!అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దేవేంద్రునికి దానం ఇచ్చి పంపివేశాడు.
ఇంద్రుడు వెళ్ళాడో లేదో ప్రహ్లాదునిలోనుండి ఒక దివ్య తేజఃపుంజము పురుషాకృతిదాల్చి బయటికి వచ్చింది. నీవెవరు?” అని ఆశ్చర్యాముగా అడిగాడు ప్రహ్లాదుడు.
నేను నీ శీలాన్ని. ఆ విప్రునికి నన్ను దానం ఇచ్చావు కదా. వెళుతున్నానుఅని చెప్పి వెళిపోయింది శీలము. ఒకతేజస్సు తరువాత ఒకటి ప్రహ్లాదుని వీడిపోయినాయి. ఒక తేజస్సు అన్నది నేను సత్యమ్. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. శీలంతో పాటూ నేను నిన్ను విడుస్తున్నాను”. మరొక తేజస్సు అన్నది రాజా! నేను ఋజుప్రవర్తనమ్. సత్యము లేని చోట నేనుండలేను”. “నేను బలమ్. సత్ప్రవర్తన లేనివాడి వద్ద నేనుండనుఅని వెళ్ళిపోయింది బలమ్. చివరికి ఆదిలక్ష్మి బయటికి వచ్చి నేను శ్రీలక్ష్మిని. బలం ఉన్నచోటే నేనుంటాను. వెళుతున్నానుఅని అన్నది. అప్పుడు ప్రహ్లాదుడు అమ్మా! లోకమాతా! నీవూ నన్ను విడిచిపోతున్నావా? ఈ అభాగ్యునిపై దయ చూపవా? వెళ్ళద్దు తల్లీ! ఆ విప్రుడు ఎవఱు తల్లీ?” అని ప్రార్థించాడు. అతడు దేవేంద్రుడు. పోగొట్టుకున్న రాజ్యమును సంపాదించడనికి నీవద్దకు వచ్చాడు. అన్ని సంపదలకూ మూలమైన శీలమును నీవు అతనికి దానమిచ్చావు కావున శీలాన్ని అనుసరించి మేమందఱమూ వెళుతున్నాముఅని సర్వాణి చెప్పింది. నిజమైన శ్రీహరి భక్తులకు సాధ్యం కానిదేమున్నది? ప్రహ్లాదుడు మళ్ళీ తన సద్గుణాలను సంపదలను అచిరకాలంలోనే సంపాదించుకున్నాడు. కనుక నీవెల్లప్పుడూ సౌశీల్యుడవై వర్ధిల్లు నాయనా!అని కుమారునికి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.
పిల్లలూ! మనమీ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
సౌశీల్యం యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. శీలమున్న వాడి వద్దనే సకల సంపదలుంటాయి. కాబట్టి మొదట శీలవంతులము కావడం ముఖ్యము.

 





Om Tat Sat
                                                        
(Continued...) 

 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels