నీతి కథలు
అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు
శ్రీ మహాభారతము లోని కథ
పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు “ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కయేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిద్దామని నిశ్చయించుకున్నారు.ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్రుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించిన నారదుడు వారికి విధించిన నియమముభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షణకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులు వీరులు అయిన ఆ దొంగలను శిక్షించి విప్రుని హోమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.
తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకువెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు “సోదరా! క్రూరకర్ములై ఆ విప్రుని హోమధేనువును అపహరించిన ఆ దొంగలను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశావు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?
అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు “అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.
బ్రహ్మరాక్షసుని విముక్తి
అది దండకారణ్యమ్. మహా దట్టమైన అడవీప్రాంతమ్. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి. ఆ భీకరారణ్యంలో ఓ మఱ్ఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగావచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “ఓ వ్యాఘ్రేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?
“పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రెయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది” అని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాం” అని పులి అన్నది.
సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు “ఒక 100 వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. ఆ రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. “రాజకుమారిని పెళ్ళాడాలి” అన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా “ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చాను” అన్నాడు బాటసారి.
“ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో “అవును. నీకెలా తెలుసు” అని అన్నాడు బాటసారి. “అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది 50 రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. “వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకో” అన్నాడు బాటసారి.
ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై “మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రా” అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1. దుష్కర్మలెన్నడునూ చేయరాదు. నేర్చిన విద్య యొక్క సారమును ఎవ్వరికీ పంచకుండా
బ్రహ్మరాక్షసుడు సద్గురు దూషణ వలన శిష్యుని కి దుఃఖములు తప్పలేదు.
2. పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది. కేవలం పరోపకారం ఒక్కటే తమని కాపాడగలదని
తెలిసి బ్రహ్మరాక్షసుడు పులి ధృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలచినారు.
3. దేశద్రోహం చాలా పాపకార్యం. అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి
ఉపకారం చేశాడు.
చాతకపక్షి దీక్ష
అది గ్రీష్మం. సూర్యుడు నడినెత్తిన ఉండి ఠీవిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పిల్ల పక్షులతో ఒక తల్లి చాతకం గగనతలంలో ఎగురుతోంది. పసి చాతకాలు వేడిమికి తాళలేకపోతున్నాయి. తల్లి చాతకం నెలవు కోసం గాలిస్తోంది. నేల పై ఒక పెద్ద మఱ్ఱి వృక్షం కనబడింది. దాని వేరు బొఱియలలో ఎలుకల చీమల పుట్టలు. తొఱ్ఱలలో పాములు. కొమ్మలు రెమ్మలు ఆశ్రయించి వందలాది పక్షులు. నేలమీదనున్న ఒక వృక్షమే ఇన్ని వేల ప్రాణులకు ఆశ్రయం ఇస్తే ఇక సాధన దీక్ష లక్ష్యం ఉన్న ఓ సజ్జనుడు ఎన్ని జీవులను తరింపచేయగలడు!
సామాజిక విలువ తేలిసో లేక సహజీవనం అనివార్యం అని గ్రహించో ఏమో ఆ వృక్షాన్ని కాపురమున్న పక్షి జంట పిల్లలు తమ తల్లితో “అయ్యో పాపం! వాటికి ఇల్లులేదే” అన్నాయి. “ఇన్నాళ్ళకికదా మా జీవనం సార్థకమైనది. మేము పెంచిన పిల్లలు ఎదుటివారి కష్టాన్ని గుర్తించాయి” అన్న ఆనందంతో ఆ పక్షి జంట ఆ చాతక పక్షులను ఆహ్వానించాయి.
ఆశ్రయం కోసం వెతుకుతున్న చాతకాలకి ఆ ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు. “ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకులతోనేనా పుట్టినది?” అని అడిగి కాదు అని తెలుసుకోని ముందుకుసాగిపోతున్న ఆ చాతకాల దీక్ష చూసి విభ్రాంతిచెంది “ఔరా!” అని ముక్కున వ్రేలిడికొని చూశారా పిల్లలూ దీక్షా రూపం అని కళ్ళతోనే సైగచేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
చాతక పక్షులు మనకి దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను చూపినాయి. చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహమేసినా ఇంకేవీ త్రాగవు. ఈ స్వాభావిక గుణాన్ని విడువక కథలోని చాతకం కూడా మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షం పైనే ఉండాలనుకున్నది.
హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః
కోకః కోకనదప్రియం ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా |
చేతొ వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం ||
జగద్గురువులైన ఆది శంకరాచార్యులు ఒక భక్తుడు శివసాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు. హంస తామర తూళ్ళనే తింటుంది. అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది. చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది. అందుకే ఘనమేఘాలకై ఎదురుచూస్తుంది. చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి. రాత్రిళ్ళు విరహవేదనను అనుభవిస్తాయి. అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి. చకోర పక్షులకి కేవలం వెన్నెల ఆహారం. అందుకని చకోరాలు చంద్రొదయానికై పరితపిస్తాయి. అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు. అన్యములేవీ అతనికి అక్కరలేదు!
పుత్రోత్సాహం తల్లితండ్రులకు తమ పిల్లలు నలుగురికీ ఉపయోగపడ్డప్పుడు కాని పుట్టినప్పుడు కలుగదు అన్న సూక్తిని గుర్తుచేశాయి పక్షులు. తమ పిల్లలు ఎదుటివారి కష్టాలని చూసి “అయ్యో పాపం!” అని జాలిచూపినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందించారు.
శివస్వామి పుణ్యగాధ
పూర్వం చిత్రకేతుడనే ధర్మాత్ముడైన మహారాజు ఉండేవాడు. అతడొకనాడు ధర్మజిజ్ఞాసతో మహానుభావుడైన శౌనకమహర్షిని ఇలా ప్రార్థించాడు “స్వామి! నాయందు దయ ఉంచి సర్వలోక హితావహమైన ధర్మము యొక్క మాహాత్మ్యమును తేటపఱచి వివరింపుడు”. చక్రవర్తి యొక్క కుతూహలమునకు సంతోషించి ఆ మహర్షి శివస్వామి పుణ్యగాధను వినిపించినాడు:
“అవంతీదేశములో శివస్వామి అనే ధర్మస్వాంతుడైన విప్రోత్తముడు ఉండేవాడు. అతడు కౌండిన్యగోత్రోద్భవుడు ధర్మస్వామి కుమారుడు. శివస్వామి మిక్కిలి పితృభక్తి పరాయణుడు. మాతాపితరుల సేవే మాధవసేవ అన్న ఉక్తిని నమ్మినవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ధర్మస్వామి కాలధర్మం చెందినాడు. యథావిధిగా శ్రద్ధతో పితృదేవునికి శ్రాద్ధకర్మలు చేసి సంవత్సరీకముల తరువాత శివస్వామి తీర్థయాత్రలకు బయలుదేరినాడు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంతకాలమే కాక చనిపోయిన తరువాత కూడా వారిని మరిచిపోకుండా పూజించుట భారతీయుల సంప్రదాయము కదా!
హిమాద్రి మందరాచలము లోని సర్వతీర్థములను గంగాది నదులను సేవించుకొని గంగాద్వారములోని నరనారాయణుల ఆశ్రమానికి చేరి అక్కడ తపోనిష్ఠలో ఉన్న ఋషులను సందర్శించుకొన్నాడు. ఇలా ఉత్తరభారతములోని పుణ్యతీర్థాలు సేవించి దక్షిణాది పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఉత్సుకుడై అతి ఘోరమైన వింధ్యాటవిలోనికి ప్రవేశించినాడు. భయంకరమైన సింహాలతో పెద్దపులులతో భూతభేతాళ రూక్షరాక్షసులతో ముండ్లచెట్లతో కరాళ జ్వాలలతో భీకరముగా ఉంది ఆ కాంతారము. ధీరుడైన శివస్వామి తీర్థయాత్రలు చేయాలనే దృఢసంకల్పముతో ముందుకుసాగినాడు. ఒకచోట మానవుల ఎముకలప్రోవులు చూచి కలవరపడి వెనుతిరుగుట ఇష్టంలేక ముందుకు నడువసాగినాడు. ఇంతలో భయాకారులైన అయిదు ప్రేతలు శివస్వామి ముందు నిలిచినాయి. శివస్వామి నిశ్చేష్టుడైనాడు.
కొంతసేపటికి తేరుకొని ధీరత్వం తెచ్చుకొని కమండలములోని జలముతో ఆచమించి శుచి అయ్యి మనోవీధిలో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించినాడు. ప్రేతలను “మీరెవరు? ఈ నిర్జనవనంలో ఏమిచేస్తున్నారు”? అని ప్రశ్నించినాడు. “మేమెవరమైతే నేమి? నిన్ను భక్షించుటకు వచ్చినాము” అన్న సమాధానము విని “జరామరణదుఃఖాలను తొలగించే మహేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆ భూతపతి తప్ప నాకు వేరు దిక్కులేదు. ఎవని పాదపద్మములను ఆశ్రయించి మార్కండేయాది మహర్షులు మృత్యువును జయించినారో అట్టి మృత్యుంజయుని ధ్యానిస్తున్నాను” అని అన్నాడు శివస్వామి. ఎవరైతే నిజమైన భక్తిశ్రద్ధలతో శూలపాణిని స్మరిస్తారో అట్టివారిని ఆ కాలకాలుడు కాలునిపాశమునుంచి కూడా రక్షిస్తాడు కదా!
శివశర్మ ఉమానాథ ధ్యానం చేశాడో లేదో అగ్ని వలె తేజోమయుడై వెలిగిపోయాడు. ఆ అగ్నితో తమ ముఖములు కాలుతున్నాయా? అనిపించి గడగడ వణుకుతూ ప్రేతలు ఏకకంఠముతో “విప్రోత్తమా! మా అవజ్ఞతను మన్నింపుము. నీవు నిజమైన విప్రుడవు. కావున అగ్నివలె వెలుగుతున్నావు. నీకు హానికలిగించు శక్తి మాకులేదు. పుణ్యమూర్తివైన నీవు ఎవరు?” అని ప్ర్రార్థించినారు. శివస్వామి తన గురించి చెప్పి “మీరెవరు? పాపచిత్తముతో నన్ను భక్షించడానికి ఏల వచ్చినారు? మీ వికృతాకారాలకు కారణములేమి?” అని అడిగినాడు.
మొదటివాడు: ఆర్యా! నేను స్థూలదేహుడను. నేను పూర్వజన్మలో విప్రధనమును అపహరించినాను. ఆడువారు పసివారు వృద్ధులు అన్న విషయం ఆలోచించక వారి ధనాన్ని దొంగిలించినాను. ఆ ఘోర పాపఫలితముగా నాకీ వికృతాకారము వచ్చినది. ఈ స్థూలదేహముతో నరకయాతనలు అనుభవించుచున్నాను. కాని ఏమి చేయగలను? చేసిన కర్మ చెడని పదార్థము కదా!
రెండవవాడు: స్వామి! నేను పరస్త్రీలనెందఱినో కామించినాను. నా ఘోరపాపకర్మ కారణముగా పీనమేఢ్రుడను అయినాను. నా శరీరమంతా ఎల్లప్పుడూ కాలిపోతున్నట్టుగా మండుతూ ఉంటుంది. చేసిన పాపమునకు ఫలితము అనుభవించ వలసినదే కదా!
మూడవవాడు: ద్విజోత్తమా! నేను గతజన్మలో అసత్యవాదిని. ఎప్పుడూ పరులను నిందించువాడిని. ఆ పాపప్రభావముచే ఇప్పుడు పూతివక్త్రుడిని అయినాను. నానోరు చీమునెత్తురులతో దుర్గంధభూయిష్ఠమై ఉంటుంది. నాలుక పురుగులు పట్టి ఉంటుంది. అహోరాత్రాలు నా ముఖము అగ్నిగుండము వలె మండిపోతూ ఉంటుంది. కర్మానుభవము తప్పదు కదా!
నాల్గవవాడు: భూసురేంద్రా! పోయిన జన్మలో నేను పిశినారిని. ఎంతో ధనము ఉండి కూడా కనీసము నా కుటుంబ పోషనార్థమైనా ధనవ్యయము చేయలేదు. ఎన్నడూ స్వాహాస్వధాలు దేవపితృకార్యాలు చేయలేదు. ఎవరికీ ఇంత పెట్టలేదు నేను తినలేదు. దేవపితృకార్యాలు చేయక కుటుంబాన్ని కృశింపచేశాను కావున ఇప్పుడు కృశశరీరుడనైనాను. అనుభవం అనే అగ్నిచే కానీ పాపరాసులు దహించబడవు కదా!
ఐదవవాడు: ఓ పుణ్యనిధి! ఏమి చెప్పను? నేను గడచిన జన్మలో నాస్తికుణ్ణి. మర్యాద కృతజ్ఞత లేకుండా వ్యవహరించేవాడిని. నిత్యమూ వేదనింద దేవనింద పూజ్య సాధుసజ్జన నింద చేసెడివాడిని. నా వాదాలు ఇలా ఉండేవి “ధర్మం సత్యం మోక్షం అనేవి కల్పితాలు. బ్రతికినంతకాలం సుఖంగా ఉండాలి. చచ్చిన తరువాత ఏమవుతుందో ఎవడు చూశాడు? ఆత్మ అంటే దేహమే. ఇంద్రియ భోగమే ఆనందము. చచ్చినవాడికి శ్రాద్ధం పెట్టడం అవివేకము. తిలోదకాలు పరలోక గతిని కలిగిస్తాయన్న మాటలు మూఢనమ్మకాలు. ఏలయన శ్రాద్ధములు ఎక్కడో పరలోకంలో ఉన్నవాడికి తృప్తి కలిగిస్తాయని అనడమే నిజమైతే గ్రామాంతరములో ఉన్నవానికి కూడా తృప్తి కలగాలి. కాని అట్లు జరుగుటలేదు కదా!”. ఈ విధముగా హేతువాదముచేసి శాస్త్రాలలో అంతకంటే గొప్పవిషయాలు ఉన్నాయని తెలుసుకోక మిడిమిడి జ్ఞానముతో నేనెంతో తెలివైనవాడినని తలచి నన్ను నేనేకాక నాతోటివారిని కూడా నమ్మించి పాడుచేసినాను. చేసిన దుష్టవాదానికి ఫలితముగా దీర్ఘజిహ్వుడిని అయినాను. ఎవరూ అనుభవించని దుర్భరక్లేశాలను అనుభవిస్తున్నాను. నాది స్వయంకృతాపరాధము. చేసి తప్పుకు నేనే కదా ఫలము అనుభవించాలి!
ప్రేతలు చెప్పిన దారుణ వృత్తాంతాలు విని స్వాభావిక దయార్ద్రుడైన శివస్వామి “అయ్యో! పాపమ్! దుష్టకర్ములు పాపాలకి ఫలితము ఈ లోకంలోనే కాక తరువాత కూడా అనుభవిస్తారు. పుణ్యపాప వలయములో చిక్కుకున్న వీరిని ఆ భగవంతుడే కాపాడాలి” అని అనుకొని “మీ అనుజ్ఞ అయితే వెళతాను. కాదు నన్ను భక్షించాలని ఉంటే నేను అందుకు సిద్ధముగా ఉన్నాను. నావల్ల మీ ఆకలి తీరుతుందంటే అంతకన్నా కావలిసినదేమి?” అని అన్నాడు. అప్పుడు ప్రేతలు “మహానుభావా! అగ్నిహోత్రమును భక్షించుట ఎవరి తరము? నీవంటి తేజస్విని మేమేమీచేయము. సుఖముగా వెళ్ళు. నీకు శివమగుగాక!
ఎంతో పుణ్యంచేసుకుంటే కానీ సత్సాంగత్యము కలుగదంటారు. మళ్ళీ మీవంటి పుణ్యాత్ముల సాంగత్య భాగ్యము కలుగునంత పుణ్యము మాకడ ఉన్నదోలేదో. కావున ఆపన్నులమైన మమ్ము ఉద్ధరింపుమని ప్రార్థన. అపకారికి సైతం ఉపకారము చేయుట సాధులక్షణము. కాబట్టి మేము చేసిన కీడు తలచక మమ్ము ఈ ఘోరయాతనల నుండి రక్షించు. మా కర్మప్రభావము వలన మాకు తర్పణలు ఇచ్చేవారు లేరు. కావున అతిపవిత్రమైన విరజ తీర్థములో మాకు తర్పణలు ఇవ్వు. నీవంటి మహనీయుడు మాకు తర్పణలు ఇస్తే మాకు తప్పక దురితనివారణం జరుగుతుంది” అని శివస్వామిని కోరినాయి. వెంటనే ప్రయాణమయ్యి సరిగ్గా శివరాత్రి రోజు విరజక్షేత్రం చేరినాడు. సంకల్ప సహితముగా తీర్థస్నానము చేసి యథావిధిగా శివరాత్రి వ్రతము చేసి శివభజనతో జాగరణము చేసి సూర్యోదయంలోని ఆహ్నికాలు తీర్చుకొని విధివిధానముగా తీర్థక్రమం నిర్వహించి శ్రద్ధతో పితరులకు తర్పణలిచ్చి పిండప్రదానము చేసినాడు. తరువాత పంచప్రేతలకు కూడా శ్రాద్ధాది క్రియలు చేసి ఆ పాపాత్ములను ఉద్ధరించినాడు.
కాబట్టి మానవుడు ఎల్లప్పుడు ధర్మమార్గములోనే నడవాలి. ధర్మవంతుడైన సజ్జనుడు తను తరించుటే కాక శివస్వామి వలె అందఱినీ తరింపచేయగలడు” అని చిత్రకేతునికి ధర్మబోధ చేసినాడు శౌనకమహర్షి.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
1. చౌర్యము పరకాంతావ్యామోహము అసత్యము పరనింద కృపణత్వము నాస్తికత్వము వేద దైవ
నింద కృతఘ్నత మహాపాపాలని మనకు ప్రేతల వాక్కుల ద్వారా తెలిసినది. కావున మనమెన్నడూ
ఇట్టి పాపకార్యములను చేయరాదు.
2. కృతజ్ఞతాపూర్వకముగా శ్రద్ధతో చేసే శ్రాద్ధాదికార్యముల ఔన్నత్యము మహాత్మ్యము
మనకీ కథలో తెలిసినది. ఆర్తులు దుఃఖితులు పాపాత్ములైనాసరే వారికి తర్పణలు
ఇచ్చి ఉద్ధరించిన వానికి అశ్వమేధయాగములు చేసిన పుణ్యము కంటే అధికము లభించునని
శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక మనిషి యొక్క జీవనము కేవలము తనవలనే కాదు అందుకు
పరోక్షముగా సహకరించేవారు దైవము తల్లిదండ్రులు సాటి మనుష్యులు
పశుపక్షాదులు జ్ఞానబోధకులైన మహర్షులు అని భారతీయుల సిద్ధాంతము. బ్రతికి
ఉన్నవారినే కాక చనిపోయిన వారిని కూడా విధివిధాన పూర్వకముగా తలుచుకొని వారికి
కృతజ్ఞతలను తెలుపుకునే భారతీయుల కృతజ్ఞతావైభవము ఊహాతీతము.
Om Tat Sat
(Continued...)
(My humble greatfulness to Neethi Kathalu dot com and Hindu dot com for the collection)
(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )
0 comments:
Post a Comment