నీతి కథలు
సంతృప్తిని మించిన సంపద లేదు
సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బాల్యస్నేహితుడు సహాధ్యాయి. ఈతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటినీమించి శ్రీ కృష్ణునికి ఆప్తుడు. కాని సుదాముడు చాలా బీదవాడు. చినిగిన బట్టలు కట్టుటచే ఈతనికి కుచేలుడన్న పేరువచ్చెను.
ఐననూ కుచేలుడెన్నడూ తనకు ధనములేదని విచారించలేదు. దీనునివలె యాచనచేయలేదు. దైవప్రేరణచే తనకు కలిగినదానితో సుఖముగా జీవించుచుండెను. సదా బ్రహ్మనిష్ఠ యందుండెడివాడు. సంతృప్తి లేని యెంత ధనవంతుడైననూ దరిద్రుడని సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైననూ ధనవంతుడే అనిన సత్యమెఱిగినవాడు.
సుదాముని సతి వామాక్షి. ఈమె పతివ్రతాశిరోమణి. అర్థాంగి అన్న పేరు సార్థకం చేసుకొన్నది. ఒకనాడు సుదామునితో ఇట్లాఅన్నది “నాథా! అవంతీపురమున పరమాత్మ మీరు సాందీప మహర్షి వద్ద సహాధ్యాయులు. శ్రీ కృష్ణస్వామి మీకు ఆప్తులు కూడా. పరమాత్ముని దర్శించిన వారికి సకల క్లేశములు తొలగును కాదా. ఒకపర్యాయము ఆయన కడకు వెళ్ళిరాకూడదా?” అని ఆవేదనను వ్యక్తపఱచినది. తన అర్థాంగి చెప్పిన హితవాక్యాలు విని సుదాముడు “వామాక్షీ! ఆ పరంధాముని దర్శనము నాకు లభించునా? ఐననూ ఫలాపేక్షరహిత చిత్తముతో ఆ భగవానుని దర్శనమునకు పోయెదను. మన హితము ఆ సర్వజ్ఞుడే చూసుకొంటాడు. నేనునూ నా స్నేహితున్ని చూడాలని చాలా రోజులగా అనుకొంటున్నాను. దైవసన్నిధికి ఏగునపుడు రిక్తహస్తాలతో పోరాదు. నాలుగుగుప్పెళ్లు అటుకులు దొరకునేమో చూచి రమ్ము”. వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది.
పరమాత్మ దర్శనానికి ఉవ్విళులూరుతూ సుదాముడు త్వర త్వరగా నడచి ద్వారకను చేరెను. శ్రీ కృష్ణుడే మందిరములోనున్నాడని ద్వారపాలకులను ప్రశ్నించెను. వారు అన్ని మందిరములలో నుండునని చెప్పిరి. ౧౬౧౦౮ మంది భార్యలున్నాకూడా ప్రతి ఇల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీ రామావతారంలోని ఏకపత్నీవ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన శ్రీ కృష్ణస్వామి లీలకు వందనం చేసి సుదాముడు ఒక అంతఃపురం వద్దకొచ్చాడు. అది రుక్మిణీ దేవి మందిరం. సుదాముడు వచ్చాడని తెలియగానే శ్రీ కృష్ణుడు పరుగెత్తి సింహద్వారము కడకేగి ఆనందపారవశ్యంతో సుదాముని కౌగిలించుకొనెను. ఇరువురి కన్నులనిండా ఆనందభాష్పాలు జాలువారాయి. శ్రీ కృష్ణుడు సుదాముని హస్తం పుచ్చుకుని స్వయంగా అంతఃపురం లోనికి తీసుకు వెళ్ళాడు.
రుక్మిణీ దేవి స్వర్ణకలశముతో పవిత్రోదకం తెచ్చింది. శ్రీ కృష్ణుడు తన హస్తములతో సుదాముని పాదములు కడిగి ఆ నీళ్ళు తన శిరమున చల్లుకొన్నాడు. అది చూచినవారంతా ఆ జలమును తమ శిరములపై చల్లుకొన్నారు.
సుదాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడుగకుండా వెళిపోవటం చూసి శ్రీ కృష్ణుడు సుదాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుదామునికి అనంత సంపదనిచ్చెను. సుదాముడు దారి అంతా శ్రీ కృష్ణుని తలచుకుంటూ తన ఇల్లు చేరెను. శ్రీ కృష్ణుని దయవల్ల తనకు సకల సంపదలు వచ్చెనని తెలుసుకొనెను. సుదాముడు వామాక్షి ఆ సంపద తమదికాదని తలచి బీదసాదలకు దానములు చేసిరి. ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంతనిధి కరఁగలేదు. అలా అనంత పుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యమును పొందిరి.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1. సంతృప్తి లేనివాని జీవనం దుఃఖమయం. సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైనా ధవవంతుడే.
అడిగే అవకాశమున్నా తనకున్నదానితో తృప్తిగా ఉన్న సుదాముని మెచ్చి శ్రీ
కృష్ణపరమాత్మ సుదామదంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు.
2. స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకు బాగా తెలిసింది. ఒక సత్పురుషుని స్నేహం
కన్నా ఎక్కువైన ధనం ఏదీలేదు. సుదాముడు శ్రీ కృష్ణుల స్నేహం అద్వితీయం.
3. ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వానిని ఎలా సేవించాలో శ్రీ కృష్ణుడు
ఈ కథలో మనకు చూపినాడు. సకల జీవరాశికి మోక్షప్రదాత ఐన శ్రీ కృష్ణుడు
సుదాముని కాళ్ళుకడిగి ఆ నీళ్ళు తన నెత్తిన చల్లుకొన్నాడు.
4. నిష్కల్మష భక్తి ఎలావుండాలో సుదాముడు మనకు చూపినాడు. నాకే కోరికాలేదు. నాకేది
మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం ఉండాలని సుదాముడు చెప్పినాడు.
వినయం వివేక లక్షణమ్
పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.
- ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను
- ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను
- మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను
- శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను
శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.
రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.
శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.
1. శ్రీ రాముడు ఎంత బలశాలి ఐననూ సముద్రునిపై బలప్రదర్శనము చేయక వినయముతో
ప్రార్థించెను. వినయం సజ్జనుని భూషణమ్.
2. మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన
పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణమ్. అందుకనే శ్రీ రాముడు విభీషణుని
సలహా అడిగెను.
3. దయాగుణం ఉత్తమగుణమ్. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు
అతనిని కాచెను.
4. సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే
అవుతుంది. శ్రీ రాముడు సముద్రునిపై కినుకబూని అస్త్రం సంధించినా అది
చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.
కాకభుశుండి పూర్వజన్మవృత్తాంతము
నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను “సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించెనని విన్నాను. శ్రీరామ నామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధవిముక్తులు అగుదురనీ విన్నాను. కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశముచే బంధింపబడుట ఏమి”? ఇలా మాయామోహితుడై వ్యాకులచిత్తుడైన గరుడుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపఱచి కాపాడమని ప్రార్థించెను. నారదుడు గరుడుని సందేహనివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు “ఓ విహగేశ్వరా! పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎఱుగును. కావున నీవు ఆ శంకరునే శరణువేడుము”. కుబేరుని కడకు వెళుతున్న మహాదేవుని కలిసి గరుడుడు తన సందేహమును చెప్పెను. “ఓ పక్షీంద్రా! ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగానీ జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథాప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుశుండి ఆశ్రమమునకు పంపెదను” అని పార్వతీనాథుడు ఆనతిచ్చెను.
వేయి మందిలో ఒక్కడే ధర్మపథమును సర్వకాల సర్వావస్థలయందూ అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశకులోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞాని అగును. అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడగును. అట్టి వేయిమంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందినవారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణముగా మాయావిముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకభుశుండి కడకు గరుడుడు వచ్చెను. వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్త్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకభుశుండి
“పూర్వము ఒకానొక కల్పములో కలియుగము ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందఱూ పాపకర్మనిరతులై వేదవిరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగియూ కల్పాంతములు దాటే గర్వము దంభము అహంకారమును కలిగియుందురు. పాషండులు తమవిపరీత బుద్ధులతో క్రొత్తక్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒక వైపు బ్రహ్మజ్ఞానముగూర్చి మాట్లాడుతూ మఱొక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భ్రష్టమగుటే కాక సన్మార్గమున నడచువారినికూడా భ్రష్టుపఱచెదరు. వర్ణాశ్రమధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్రపురాణ నిందచేసి అనంతపాపరాశిని సొంతం చేసుకుంటారు. పూజలు దానధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవమివ్వబడును. గురుశిష్య భార్యభర్త మాతాపితభ్రాత అను సంబధములకు విలులేకుండును. ఆడంబరముగా జీవించుచూ వేదమార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకమూ కపటత్వముతో నిండియున్న వారు గురువులై అధర్మబోధలు చేశెదరు. అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగినది తినగూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటిని అన్నివేళలా తినెదరు. అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలను అనుభవించెదరు.
కానీ ఈ కలియుగమున ఒక గొప్పగుణము కలదు. “కలౌ సంకీర్తనాన్ముక్తిః”. యొగ యజ్ఞ పూజాదులకు ఆస్కారములేని ఈ యుగములో భగన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు. ఓ పన్నగాసనా! ఇంద్రజాలికుడు ప్రదర్శించుమాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కానీ అతనిసేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయకుమూలమైన భగంవంతుని శరణుజొచ్చిన వానికి ఆ అనూహ్యమైన మాయ అంటదు.
అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించినాను. మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తుడను. కానీ నా బుద్ధిమాన్యముచే ఇతరదేవతలను దూషించుచుండెడి వాడను. అతిగర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కఱవు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయినీ నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమ శివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్కడ అతిదయాళువు నీతిమంతుడు పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదికపద్ధితిలో అహర్నిశలూ శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడునూ విష్ణు నింద చేయలేదు. కపటబుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతి దినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను కానీ నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను.
నా గురువు నా ప్రవర్తన చూసి చాల బాధపడి నిత్యమూ ఎన్నో సదుపదేశములిచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచూ నాలోని కోపాగ్నిని ప్రజ్వలింప చేయుచూ జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒక రోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వము బోధించి “పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టిది నీవు ద్వేషించుట తగదు” అని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికెగసెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోపపడలేదు.
ఒక రోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచటికి వచ్చెను. నా గర్వము వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెముకూడా కోపమురాలేదు! కాని గురువును నిరాదరించుట మహాపాపము. పరమశివుడు ఇది చూసి సహింపలేక “ఓరీ మూర్ఖుడా! పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్షగొన్నవాడు కోట్లాదియుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేలకొలది జన్మలు క్లేశములభవించును. నీ విప్పుడే అజగరమువై ఒక చెట్టుతొఱ్ఱలో పడివుండు” అని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావశానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు
“ఓ కృపానిధీ! మహాపకారికైనా మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావశానమిచ్చెద” అని నన్ను చూసి “చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు. కానీ నీ గురువు మహిమవల్ల దివ్యమైన అయోధ్యానగరమున పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్సా! ఇంకెప్పుడూ సాధుసజ్జనవిప్రులను నిరాదరింపవద్దు. ఇంద్రుని వజ్రాయుధముతో నాత్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జనద్రోహమనెడి అగ్నిలో పడి మాడిపోతాడు” అని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు. అప్పటినుంచీ ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మఱువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమశ మహర్షి వద్ద శ్రీరామచరితమానసము విని కాకభుశుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను”.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
1. గురుద్రోహం
శివకేశవులను భేదబుద్ధితో చూడడం సాధుసజ్జనులను అవమానించడం ఘోరపాపములని
మహాశివుడు కాకభుశుండితో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులెన్నడునూ
చేయరాదు.
2. కాకభుశుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలుచేసినా
తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏమాత్రమూ కోపగించుకోలేదు.
3. రామభక్తుడైన కాకభుశుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నోతెలిసినాయి.
ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మమార్గములో నడచుచూ నిత్యం
భగవన్నామస్మరణ చేయడమే మన కర్తవ్యమ్
రఘుమహారాజు – కౌత్సుడు
పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.
శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.
గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.
అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకోని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.
పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.
తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి ౧౪ రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది” అని రఘుమహారాజు మిగిలనదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా
సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ
చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
2. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం
చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
3. కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో
అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు
శ్రీ మద్రామాయణం లోని కథపూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.
శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.
గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.
అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకోని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.
పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.
తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి ౧౪ రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది” అని రఘుమహారాజు మిగిలనదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా
సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ
చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
2. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం
చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
3. కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో
అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు
ఆశ్రయ పరిత్యాగ దోషం
ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొఱకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యమ్. అట్టి అమ్మ కడుపున పుట్టిన మనమూ ధన్యులమ్.
మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది
“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరమ్? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.
ఇలా ధర్మ్యం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”.
చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.
తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:
మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్టిన నేలతల్లిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యంక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.
Om Tat Sat
(Continued...)
(My humble greatfulness to Neethi Kathalu dot com and Hindu dot com for the collection)
(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )
0 comments:
Post a Comment