నీతి కథలు
రంతిదేవుడు
పూర్వం రంతిదేవుడను రేజేంద్రుడుండెడి వాడు. ఆతడు రాజైననూ మహాయోగి వలె విషయ వాంఛలకు లోనుగాక నిరతం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించిదానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలైనాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు.
ఒకరోజు ప్రాతఃకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వ నీళ్ళు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనముచేయ సిద్ధపడ్డాడు. భరింపరాని క్షుత్పిపాసల బాధతీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథియై వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు.
ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నంపెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒకభాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడువచ్చాడు. “రాజా! నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.
ఇక రంతిదేవుని వద్ద నీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు “అయ్యా! నేను చాలా దీనుడను. చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు”. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి “ఓ అన్నా! నావద్ద అన్నంలేదు కాని ఈ తీయ్యని నీళ్ళున్నాయి. దగ్గరకురా. నీ దాహం తీరేటట్లు త్రాగు.
ఆపదకలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు”? అని రంతిదేవుడన్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్కచేయక రంతిదేవుడు “నా జలదానంతో ఈతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ” అని ఆ చండాలుని పాత్రలో నీళ్ళు పోశాడు.
బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎఱుక కల్గించి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరికలుండవు కదా! కడకు విష్ణుపదాన్ని పొందాడు. ఆ రాజేకాదు ఆ రాజు కథను బాగా విని అర్థంచేసుకున్న వాళ్ళందరూ ఆతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించారు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:
దానము తీసుకొనువానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షరహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం. ఇదియేకాక అడిగినవానిలో భగవంతుడిని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడనికి ఎంతో అవసరమైనది తనకు లేక పోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ధన్యుడు
ధర్మజ్ఞః
“శరణు శరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతి వల్లభా!” అంటూ భక్తశిఖామణియైన విభీషణుడు రావణునిచే తరస్కరింపబడ్డవాడై శ్రీ రామ చంద్రుని శరణువేడినాడు. విభీషణుడు తన మంత్రులతో వచ్చి ఆకాశమార్గాన నిలిచి శ్రీ రాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్రీవుని “మిత్రమా! నీ అభిప్రాయమేమి”? అని అడిగినాడు. రాజశ్రేష్ఠుడైన సుగ్రీవుడిలా అన్నాడు “ప్రభూ! రాక్షసులు మాయావులు కామరూపధారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టమ్. పైగా వచ్చినది సీతాపహారి ఐన రావణుని తమ్ముడు. ఈతడు బలశాలి. సాయుధులైన నలుగురు మంత్రులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు. ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్దేశ్యం”.
స్మితపూర్వావిభాషి ఐన శ్రీ రాముడు ఇట్లు ధర్మ్యము పల్కెను “సుగ్రీవా! తన భార్యను వలపన్ని పట్టిన బోయవాడు ఆర్తుడైవచ్చినప్పుడు ఆ కపోతరాజు బోయవానికి శరణమీయలేదా! అదే అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం కండువ మహర్షి ఈ కథను పల్కి ధర్మసమ్మతమైన గాధలు గానం చేశాడు:
దీనుడై ప్రార్థించుచు శ్రణుజొచ్చిన శత్రువునైనా చంపకూడదు. సజ్జనుడు తన ప్రాణాలసైతం ఇచ్చి శరణార్థి ఐన శత్రువు నైనా కాపాడతాడు”. ఇలా కండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తుచేసి రఘువరుడిలా అన్నాడు “ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్న చాలు వానిని సకల ప్రాణులనుండి అభయమిచ్చెదను. ఇది నా వ్రతం.
అతడే స్థితిలోనున్నను ఏ ఉద్దేశ్యముతో వచ్చినను వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను”. ఎక్కడా కనీ వినీ ఎఱుగని ధర్మజ్ఞతను శ్రీ రాముని లో చూసి వానరులు “శ్రీ రామ చంద్ర మూర్తి కీ జై” అని జయజయ ధ్వానాలు చేశారు.
ఒకడు లోక నిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు. అలాగే సమాజధర్మం గృహధర్మం కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతువుండచ్చు. కానీ వ్రతం (నియమం) అనేది తనకు తానుగా నియమించుకున్నది. అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టమ్. ఎటువంటి హేతువూ లేకుండా కేవలం ధర్మసమ్మతమైన వ్రతనియమం పాటిస్తూ శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట.
ఇదే సదేశం ధర్మరాజు కూడా ఇస్తాడు: ఒక సారి పరమసాధ్వి ఐన ద్రౌపదీ దేవి రాజసూయయాగం చేసి రాజులచే జే జే లందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది “స్వామీ! మీరు ధర్మంకోసం ఇన్ని త్యాగాలు చేశారు. ధర్మం పాటించడం వల్ల మీకేమి వచ్చింది”? భారతీయుని హృదయాన్ని వ్యక్తపఱస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు:
“ద్రౌపదీ! ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతే కాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినౌతాను. ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు పురుషాధముడు”. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీ రాముడు ధర్మరాజు మనకి చెప్పారు.
కపోత కపోతి కథ
అడవిలో వేటకోసం వెళ్ళిన ఓ బోయవాడు కుండపోతగా వర్షం పడటంతో ఓ చెట్టు నీడలో ఆశ్రయం తీసుకున్నాడు. ఆ చెట్టు మీద ఓ పావురాల జంట కాపురముంటున్నాయి. ప్రొద్దుననగా వెళ్ళిన కపోతి తిరిగి రాకపోవడంతో ఎంతో దిగులుగా ఉన్నది కపోతం. ఆ పావురం అలసి ఉన్న బోయవాడిని చూసింది. పక్కనే ఉన్న వలను వేట సామాను చూసి భయపడింది. “ఎప్పుడో ప్రొద్దుననగా వెళ్ళింది. ఎక్కడున్నదో ఎలాగున్నదో? నా ప్రాణేశ్వరికి ఎట్టి ఆపద సంభవించలేదు కదా? అది లేని నా జీవనం శూన్యం శోకమయం. నా హృదయేశ్వరి ఏ బోయవాడి చేతులోనో చిక్కలేదు కదా” అని బాధపడింది. ఇంతలో వాన తగ్గుముఖం పట్టిందికానీ చలి మృత్యుదేవతలా ఆ వనాన్ని కబళించింది. పావురం యొక్క శోకం విని ఆడ పావురం “ఇక్కడ ఈ బోయవాడి వలలో ఉన్నాను ప్రాణనాథ”! అని అన్నది. “హతవిధి! ఈ వలలో చిక్కుకున్నావా” అని బిగ్గరగా ఏడ్వసాగింది మగ పావురం.
“శరీరాలు శాశ్వతాలు కావు. మంచి ఒక్కటే మిగిలివుండేది. ఎల్లప్పుడూ మనకు తోడువుండేదదే. ఆర్తుడైనవాని శరణుజొచ్చిన వాని కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని పెద్దలంటారు. పాపం! ఈ బోయవాడు ఆర్తుడై మన గూటి దగ్గరకు వచ్చాడు. నా గురించి విచారణ మాని అతిథి ఐన ఈతని సంగతి చూడు” మని ఆడ పావురం అమృత వాక్యాలు పలికింది.
వెంటనే ఆ బోయవాని ముందు నిలిచి ఆ కపోతశ్రేష్ఠుడిలా అన్నాడు “అయ్యా! నీవు బాగా అలసినట్టున్నావు. నేనేమి సేవ చేయగలనో చెప్పండి”. బోయవాడు “ఓ పావురమా! నీవెంత దయగలదానవు! చలితో నా శరీరం గడ్డకట్టుకు పోతున్నట్టుంది. ఈ చలినుండి నన్ను కాపాడు” అన్నాడు. పావురం వెంటనే గూటిలో దాచుకున్న ఎండు పుల్లలు తెచ్చి చలిమంట చేసింది. ఆ పావురం చేసిన సహాయానికెంతో సంతోషించి ఆ బోయవాడు చలి కాచుకున్నాడు. చలి తగ్గిన బోయవాడు “గువ్వా! ఎంతో ఆకలిగావుంది” అన్నాడు. కొంతసేపాలోచించి “అయ్యా! పక్షుల దగ్గర దాచిపెట్టుకునే ఆహారం ఉండదుకదా. పరోపకారార్థం ఇదం శరీరం అని మా పెద్దలు చెప్పారు. నా శరీరాన్ని తప్ప నేనేదీ ఇవ్వలేను. దీన్ని తీసుకుని మీ క్షుద్బాధ తీర్చుకోండి” అని నివ్వెఱ పోయి ఆ బోయవాడు చూస్తుండగా ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో దూకింది పావురం.
ఆ దృశ్యం చూసి బోయవాడికి జ్ఞానోదయం అయ్యింది. “ఆహా! ఈ పావురము ఎంత గొప్పది! నా ఆకలి తీర్చుటకు తన శరీరాన్ని భార్యాపిల్లల్ని ప్రలోభాన్ని విడిచి శరీరం తృణప్రాయంగా ఎంచి ఆహుతిచ్చింది. ఏమి త్యాగం! ఏమి దయ! రూపంలో చిన్నదే ఐనా గుణంలో మేటిది. ఇక నేను హింస చేయను. మోహం విడుస్తాను” అని అనుకున్నాడు. వలలోని పక్షులన్నిటినీ విడిచి పెట్టాడు. వెంటనే అగ్ని దగ్గరకు వెళ్ళి ఆ ఆడ పావురం ఇలా ఏడ్చింది “నీవు లేనిది క్షణమైనా మనజాలను. నాకెవరు దిక్కు? బ్రతుకులోను మరణంలోను నీతోనే ఉంటాను”. అగ్నిప్రదక్షిణం చేసి శరీరత్యాగం చేసింది ఆ కపోతి. ఇంతలో ఓ దివ్య విమానము వచ్చి ఆ పావురాల జంటను ఊర్ధ్వలోకాలకు తీసుకుపు వెళ్ళడం పూర్వ జన్మసుకృతం వలన ఆ బోయవాడు చూడగలిగాడు. కడకు ఆతడూ దివ్యత్వం పొందాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:
దయ కరుణ పరోపకారం త్యాగం అనే పదాలకు నిర్వచనం చెప్పాయి పావురాలు. తనకు హాని చేసిన వేటగాడి సైతం కాపాడమని “అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ” అని హితబోధ చేసింది. ఆకలిగొన్న వాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించిన పావురం యొక్క త్యాగం అద్వితీయం
నిజాయితీ
భారతదేశపు వైద్య విధానం ఆయుర్వేదం. బ్రిటిషర్లు మనదేశాన్ని ఆక్రమించి వారి వైద్యవిధానమైన అల్లోపతి ని ప్రవేశపెట్టకముందు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంలో ఉండేది. కాని బ్రిటిషర్ల పాలనవలనో మనలో అలవాటైన బానిస భావన వలనో మెల్లిమెల్లిగా ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. చాలామంది ఆయుర్వేదం పనికిరాదని తోసివేశారు. అట్టి కాలంలో బెంగాలుకు చెందిన ఓ ప్రముఖ విద్యావేత్త ఆయుర్వేదాన్ని కాపాడుకోవటానికి నడుంకట్టాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు.
అలా ఎంతో కష్టపడి ప్రతికూలమైన పరిస్థితులలో సంస్థని నడుపుతుండగా ఒకనాడు ఆ విద్యావేత్తకు ఒక భీషణమైన సమస్య ఎదురయ్యింది. ఆ సంస్థ తయారు చేసిన ఎన్నో మందులు ఏదో కారణముగా పాడైపోయాయి. ఆ విద్యావేత్త ఎంతో దుఃఖించాడు. అతని విచారం చూసి అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ఇలా పలికాడు “అయ్యా! మీరు విచారించకండి. ఇంకా ఈ మందులు పూర్తిగా పాడు అవ్వలేదు. ఇంకొన్నాళ్ళు సునాయాసంగా మనం వీటిని అమ్మవచ్చు. అట్లు చేయకున్న మనకు చాలా నష్టం వస్తుంది. ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలన్న మీ ఆశయం కూడా అప్పుడు నెరవేరక పోవచ్చు”.
ఇటువంటి అవినీతి భరితమైన మాటలు విని ఆ విద్యావేత్త మండిపడుతూ ఇలా జవాబిచ్చాడు “నష్టమొస్తుందని పాడైపోతున్న మందుల్ని అమ్ముతామా? అట్టి నీచమైన కార్యాన్ని నేనెన్నడూ చేయలేను. ఆయుర్వేదం ధర్మం ఉన్నచోటే ఔషధాలు పనిచేస్తాయని చెప్పింది. కనుక నా ఆశయం ధర్మస్థాపనే”. అలా హితబోధ చేసి ఆ మందులన్నిటిని బయటపడ వేయించి తన ఆదర్శాన్ని కాపాడుకొన్నాడు. తరువాత ఆ విద్యావేత్త లోని నిజాయితీని అందరూ కొనియాడారు.
ఆ ప్రసిద్ధ విద్యావేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్. భారతీయుల యొక్క విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసినారు. “Chemical Knowledge of the Hindus of Old” (Isis, Vol.2, No.2, pg. 322-325, The University of Chicago press) అనే వ్యాసం మనమందరం చూడదగినది. ఈ వ్యాసంలో ప్రఫుల్ల చంద్ర గారు మన భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెబుతారు.
1. నిజాయితీ యొక్క ప్రాముఖ్యత మనమీ కథలో తెలుసుకొన్నాము. ఎంత నష్టమైనా రాని
ఏమైనా కానీ ఎన్నడు అవినీతికి పాల్పడరాదని శ్రీ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్
గారు మనకు చూపించారు.
2. మన స్వదేశీ విజ్ఞానం యొక్క గొప్పతనం చంద్ర గారి వ్యాసాల ద్వారా తెలుసుకొన్నాము
ఆశ్రయ పరిత్యాగ దోషం
ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొఱకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యమ్. అట్టి అమ్మ కడుపున పుట్టిన మనమూ ధన్యులమ్.
మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది
“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరమ్? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.
ఇలా ధర్మ్యం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”.
చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.
తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:
మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్టిన నేలతల్లిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యంక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.
ధర్మవ్యాధుని కథ
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మఱచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మఱచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1. “తన కోపమే తన
శత్రువు. తన శాంతమే తనకు రక్ష”
అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది.
కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
2. పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ
పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
3. స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా
స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
4. మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు.
జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.
Om Tat Sat
(Continued...)
(My humble greatfulness to Neethi Kathalu dot com and Hindu dot com for the collection)
(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )
0 comments:
Post a Comment