నీతి కథలు - 22


























నీతి కథలు



 

సత్సాంగత్యము



పెద్దలు చెప్పిన నీతికథ
దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షీణాంచ నారదఃఅని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండిఅని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి నీవు తూర్పువైపుగా వెళితే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించుఅని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.
పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటకసూత్రధారి ఇలా అన్నాడు ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు. అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదుఅని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.
మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుందిఅని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే. అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
జగద్గురువులైన ఆదిశంకరులు
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిః ||”
అని ఉపదేశించినారు. అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సంగత్యము పురాకృతపుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచిపనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవన్ముక్తి కలుగుతాయి. ఈ కారణముగానే ఇంద్రునిచే శాపగ్రస్తుడైన యయాతి (యయాతి కథ చూడండి) కూడా కనీసం తనను సత్పురుషుల సాంగత్యములో ఉండనివ్వమని ప్రార్థించి సద్భువనములో ఉండుటకు దేవేంద్రుని వద్ద వరం పొంది తరించాడు. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారినుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.













Om Tat Sat
                                                        
(Continued...) 

 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )


నీతి కథలు - 21





















నీతి కథలు




చ్యవనమహర్షి – జాలరులు



శ్రీ  మహాభారతము లోని కథ
భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్థాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచిమహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా 12 యేండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు.
ఓ జాలరులారా! భయపడకండి. మీరేతప్పూ చేయలేదు. మీ విధినిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండిఅని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి అశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపఱచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు.
జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి మహానుభావా! ఈ బెస్తలు తెలియక తప్పుచేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయ్యండిఅని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు రాజా! ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడుఅని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కానీ చ్యవనుడు అది తనకు సరైన వెలకాదన్నాడు. రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధరకాదన్నాడు చ్యవనుడు. నహుషుడుఅయితే అర్ధరాజ్యమిస్తానుఅని అన్నాడు. నీ మంత్రులతో సంప్రదించి చూడుఅన్నాడు చ్యవనుడు. ఆలోచించడానికేమున్నది? నా రాజ్యసర్వస్వమూ ఇస్తానుఅని అన్నాడు నహుషుడు! చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు.
ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహామునిగోవు త్రిలోక పూజ్యమైనది. సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు”. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు.
ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి పని చేశే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. ఇలా అనుకుని మహర్షి కడకేగి అయ్యా! బ్రహ్మ తుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండిఅని అన్నారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకీ మీకూ సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరంకోరుకో మన్నారు. వినయముతో నహుషుడు స్వామీ! మీరు తృప్తిపొందితే అదే చాలు. నాకింకేదీ అక్కరలేదుఅన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదివిని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1.    తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచముకూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు.
2.    జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలరులు.
3.    సత్కర్మలు చేశే అవకాశం అరుదుగా వస్తుందని. వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు.
4.    గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి.
5.    ధర్మపాలనకై తన సర్వస్వమునూ త్యాగం చేయటానికి సిద్ధపడ్డ నహుషుడు మనకు ఆదర్శము కావాలి.



భూతదయ



పెద్దలు చెప్పిన నీతికథ
అది భవ్యమైన ఉజ్జయినీ నగరపు రాచవీధి. ప్రొద్దుకుంకినా ఆ దారిలోని దేశవిదేశ వర్తకుల సంఖ్య బేరసారాలాడుతున్న జనావళి రద్దీ తగ్గలేదు! రాత్రి కొంత గడచిన తరువాత కాస్త కాస్తగా రద్దీ తగ్గటం మొదలుపెట్టింది. ఇంతలో తేనెలమ్మే ఒక వయ్యారి తన వన్నెచిన్నెలు ఒలకబోస్తూ ఆ వీధివెంట వచ్చి బుట్ట క్రిందికి దించి అమ్మకం మెదలుపెట్టింది. నిమిషములో కొన్ని లక్షలాది చీమలు మధువు కోసం ఆ వన్నెలాడి తేనె బుట్ట వద్దకు చేరినాయి. చీమల పుట్టలు చూసి వాటిని బఠానీల్లా నములుదామని ఒక తొండ అక్కడికి వచ్చింది.
రాత్రంతా నగరంలోని వేడుకల వలన జనసంచారమునకు భయపడి బయటకురాని ఎలుక తొండకోసం వచ్చింది. పిల్లిగారు ఆ తొండని గుటకాయస్వాహా చేద్దామని పొంచినిలిచినారు. పిల్లికోసం కుక్క కూడా అక్కడికి వచ్చింది. రాచవీధిలోని వేటకుక్కలు ఊరికుక్కని చూసి హంగామా చేశాయి.
ఇంతలో ఒక మాంత్రికుడు తన మంత్రశక్తి ద్వారా అడవిలోని ఒక పెద్దపులిని బంధించి రాచవీధిన తెస్తున్నాడు రాజుగారికి చూపించి మెప్పుపొందుదామనే ఉద్దేశ్యముతో. పౌరుషంలేని పులిని చూసి వేటకుక్కలు మీదపడ్డాయి. మరే జంతువైనా మంత్రించి బంధించేసేవాడు మాంత్రికుడు కానీ రాజుగారి వేటకుక్కలయ్యేసరికి కిమ్మనక ఉండిపోయాడు. ఈ గందరగోళానికి రాచభటులు ఆ పై మహామంత్రిగారు అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి రాజుగారికి నివేదించారు. రాజుగారు నగరపు ముఖ్యవీధిలోనే ఇంత అల్లకల్లోలం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించాడు.
సూక్ష్మబుద్ధి అయిన మహామంత్రి ఇలా సమాధానమిచ్చినాడు ప్రభు! కొద్దికాలముగా మన దేశములోని యువత రాత్రంతా వేడుకలతో సంబరాలతో గడుపుతున్నది. దీనివలన నిశాచరులైన జంతువులకు వేట కుదరటంలేదు. ఆహారము దొరకని కారణముగా ప్రకృతిలో ఈ అసహజస్థితి వచ్చినది. మానవునితో పాటు సహజీవనము చేసే భూతజాలములకు సైతం దయ చూపమని మన భారతీయ సంస్కృతి ఘోషిస్తున్నది కదా”!
ప్రజాహితుడైన ఉజ్జయినీ మహారాజు వెంటనే రాత్రి ఒక జాము నగారా తరువాత వీధులలో జనసంచారము ఉండరాదుఅని దండోరా వేయించాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
మన చిన్నప్పుడు అమ్మ బాబూ! రాత్రయిందిరా! ఇంక ఆటలు మాని ఇంటికి రారా. వేళకానివేళ ఆడితే నేలతల్లి కోపిస్తుందిరా! మంచి పిల్లలు త్వరగా పడుకుని తెల్లవారకముందే లేస్తారుఅని చెప్పి మందలించిన సన్నివేశం మనందఱికీ గుర్తే. ఈ సూక్తి వెనుకనున్న తత్త్వం మనకు మహామంత్రి మాటల ద్వారా తెలిసినది. ఈ విధముగానే అన్ని ప్రాచీన ఆచార సాంప్రదాయాల వెనుక ఆరోగ్య, సామాజిక, ఆధ్యాత్మిక హేతువులు కలవు. వాటి వివరమెఱిగి అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకొంటూ ముందు తరాలకు అందించుట మన కనీసకర్తవ్యము.

 






Om Tat Sat
                                                        
(Continued...) 

 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )


నీతి కథలు - 20























నీతి కథలు




మయూరధ్వజుని కథ



శ్రీ  మహాభారతం లోని కథ
ధర్మరాజు చేసే అశ్వమేధయాగం లోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు అమితపరాక్రమవంతుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి వచ్చారు శ్రీ కృష్ణార్జునులు. శ్రీ కృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్దనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణారుజునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. ఈతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదాఅని అడిగిన అర్జునునితో శ్రీ కృష్ణుడు ఫల్గుణా! నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. ఈతని ధర్మబుద్ధి నీకెఱిగించెదఅని అన్నాడు.
మఱునాడు శ్రీ కృష్ణార్జునులు విప్రవేషం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్ళారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మాఱువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తరువాతే మేము ఇతరములు ఆలోచిస్తాము”. “అయ్యా! మీ కష్టమేమిటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తానుఅని మయూరధ్వజుడు వేడినాడు. రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికిందిమయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు”. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నానుఅని శౌరి బదులిచ్చాడు.
ఆహా! ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. దీని కన్నా నేను కోర తగ్గది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండిఅని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని వుంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకోని మయారధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీ కృష్ణార్జునులకు ఓ వింత కనబడింది.
మయూరద్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్ళు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషముగా మనస్ఫూర్తిగా చాస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైచ్యమ్”.
అయ్యా! నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం నివియోగపడుతోంది. ఎడమ భాగ శరీరం నాకా అదృష్టం లేదేఅని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధఅని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీ కృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు.
పిల్లలూ! మనం ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషముగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు.



నిజాయితీ



స్వాతంత్ర్య సమరయోధులనాటి కథ
భారతదేశపు వైద్య విధానం ఆయుర్వేదం. బ్రిటిషర్లు మనదేశాన్ని ఆక్రమించి వారి వైద్యవిధానమైన అల్లోపతి ని ప్రవేశపెట్టకముందు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంలో ఉండేది. కాని బ్రిటిషర్ల పాలనవలనో మనలో అలవాటైన బానిస భావన వలనో మెల్లిమెల్లిగా ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. చాలామంది ఆయుర్వేదం పనికిరాదని తోసివేశారు. అట్టి కాలంలో బెంగాలుకు చెందిన ఓ ప్రముఖ విద్యావేత్త ఆయుర్వేదాన్ని కాపాడుకోవటానికి నడుంకట్టాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు.
అలా ఎంతో కష్టపడి ప్రతికూలమైన పరిస్థితులలో సంస్థని నడుపుతుండగా ఒకనాడు ఆ విద్యావేత్తకు ఒక భీషణమైన సమస్య ఎదురయ్యింది. ఆ సంస్థ తయారు చేసిన ఎన్నో మందులు ఏదో కారణముగా పాడైపోయాయి. ఆ విద్యావేత్త ఎంతో దుఃఖించాడు. అతని విచారం చూసి అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ఇలా పలికాడు అయ్యా! మీరు విచారించకండి. ఇంకా ఈ మందులు పూర్తిగా పాడు అవ్వలేదు. ఇంకొన్నాళ్ళు సునాయాసంగా మనం వీటిని అమ్మవచ్చు. అట్లు చేయకున్న మనకు చాలా నష్టం వస్తుంది. ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలన్న మీ ఆశయం కూడా అప్పుడు నెరవేరక పోవచ్చు”.
ఇటువంటి అవినీతి భరితమైన మాటలు విని ఆ విద్యావేత్త మండిపడుతూ ఇలా జవాబిచ్చాడు నష్టమొస్తుందని పాడైపోతున్న మందుల్ని అమ్ముతామా? అట్టి నీచమైన కార్యాన్ని నేనెన్నడూ చేయలేను. ఆయుర్వేదం ధర్మం ఉన్నచోటే ఔషధాలు పనిచేస్తాయని చెప్పింది. కనుక నా ఆశయం ధర్మస్థాపనే”. అలా హితబోధ చేసి ఆ మందులన్నిటిని బయటపడ వేయించి తన ఆదర్శాన్ని కాపాడుకొన్నాడు. తరువాత ఆ విద్యావేత్త లోని నిజాయితీని అందరూ కొనియాడారు.
ఆ ప్రసిద్ధ విద్యావేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్. భారతీయుల యొక్క విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసినారు. “Chemical Knowledge of the Hindus of Old” (Isis, Vol.2, No.2, pg. 322-325, The University of Chicago press) అనే వ్యాసం మనమందరం చూడదగినది. ఈ వ్యాసంలో ప్రఫుల్ల చంద్ర గారు మన భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెబుతారు.

పిల్లలూ!  ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.    నిజాయితీ యొక్క ప్రాముఖ్యత మనమీ కథలో తెలుసుకొన్నాము. ఎంత నష్టమైనా రాని ఏమైనా కానీ ఎన్నడు అవినీతికి పాల్పడరాదని శ్రీ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ గారు మనకు చూపించారు.
2.    మన స్వదేశీ విజ్ఞానం యొక్క గొప్పతనం చంద్ర గారి వ్యాసాల ద్వారా తెలుసుకొన్నాము.
 





Om Tat Sat
                                                        
(Continued...) 

 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

నీతి కథలు - 19



























నీతి కథలు




 

బ్రహ్మరాక్షసుని విముక్తి




పెద్దలు చెప్పిన నీతి కథ
అది దండకారణ్యమ్. మహా దట్టమైన అడవీప్రాంతమ్. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి. ఆ భీకరారణ్యంలో ఓ మఱ్ఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగావచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు ఓ వ్యాఘ్రేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?
పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రెయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుందిఅని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాంఅని పులి అన్నది.
సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు ఒక 100 వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. రాజకుమారిని పెళ్ళాడాలిఅన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చానుఅన్నాడు బాటసారి.
ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితోఅవును. నీకెలా తెలుసుఅని అన్నాడు బాటసారి. అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది 50 రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకోఅన్నాడు బాటసారి.
ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రాఅంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.     దుష్కర్మలెన్నడునూ చేయరాదు. నేర్చిన విద్య యొక్క సారమును ఎవ్వరికీ పంచకుండా బ్రహ్మరాక్షసుడు సద్గురు దూషణ వలన శిష్యుని కి దుఃఖములు తప్పలేదు.
2.     పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది. కేవలం పరోపకారం ఒక్కటే తమని కాపాడగలదని తెలిసి బ్రహ్మరాక్షసుడు పులి ధృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలచినారు.
3.     దేశద్రోహం చాలా పాపకార్యం. అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి ఉపకారం చేశాడు.



రఘుమహారాజు – కౌత్సుడు



శ్రీమద్రామాయణం లోని కథ
పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకుఅని అన్నారు.
శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనాఅంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.
గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.
అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకోని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. రాజా! అది కష్టములే. నేను వెళతానుఅంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనాఅని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తాఅని చెప్పి పంపాడు రఘుమహారాజు.
పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తుఅని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమనిఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండిఅన్నాడు.
తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు రాజా! నాకు కావలసినవి ౧౪ రాశులే. మిగతా ధనం నాది కాదుఅని వెళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మరి ఈ ధనమెవరిదిఅని రఘుమహారాజు మిగిలనదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.     గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
2.     రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
3.     కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.



భూదాన మహిమ



భరద్వాజ సంహిత లోని కథ
ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:
మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.
ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరిపైరు తయాఱయింది!
ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.
అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
సస్యసంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పాత్రునకు సమర్పించిన వాడికి బ్రహ్మలోకం కరతలామలకం. అజ్ఞానతః తన భూమిలోని పైరు ఇతరులకి ఉపయోగ పడినందుకే తామ్రతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా ఫలవృక్షములున్న భూమిని అర్హునికి దానముచేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు.







Om Tat Sat
                                                        
(Continued...) 

 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )


About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels