నీతి కథలు
చ్యవనమహర్షి – జాలరులు
భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్థాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచిమహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా 12 యేండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు.
“ఓ జాలరులారా! భయపడకండి. మీరేతప్పూ చేయలేదు. మీ విధినిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి” అని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి అశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపఱచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు.
జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి “మహానుభావా! ఈ బెస్తలు తెలియక తప్పుచేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయ్యండి” అని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు “రాజా! ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడు” అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కానీ చ్యవనుడు అది తనకు సరైన వెలకాదన్నాడు. రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధరకాదన్నాడు చ్యవనుడు. నహుషుడు “అయితే అర్ధరాజ్యమిస్తాను” అని అన్నాడు. “నీ మంత్రులతో సంప్రదించి చూడు” అన్నాడు చ్యవనుడు. “ఆలోచించడానికేమున్నది? నా రాజ్యసర్వస్వమూ ఇస్తాను” అని అన్నాడు నహుషుడు! చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు.
ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని “గోవు త్రిలోక పూజ్యమైనది. సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు”. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు.
ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు “ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి పని చేశే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. ఇలా అనుకుని మహర్షి కడకేగి “అయ్యా! బ్రహ్మ తుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి” అని అన్నారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకీ మీకూ సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరంకోరుకో మన్నారు. వినయముతో నహుషుడు “స్వామీ! మీరు తృప్తిపొందితే అదే చాలు. నాకింకేదీ అక్కరలేదు” అన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదివిని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1. తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచముకూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని
నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు.
2. జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి
తమకు తాముగా వెళ్ళారు జాలరులు.
3. సత్కర్మలు చేశే అవకాశం అరుదుగా వస్తుందని. వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని
చేయాలని మనకు చూపించారు జాలరులు.
4. గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో
సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి.
5. ధర్మపాలనకై తన సర్వస్వమునూ త్యాగం చేయటానికి సిద్ధపడ్డ నహుషుడు మనకు ఆదర్శము
కావాలి.
భూతదయ
అది భవ్యమైన ఉజ్జయినీ నగరపు రాచవీధి. ప్రొద్దుకుంకినా ఆ దారిలోని దేశవిదేశ వర్తకుల సంఖ్య బేరసారాలాడుతున్న జనావళి రద్దీ తగ్గలేదు! రాత్రి కొంత గడచిన తరువాత కాస్త కాస్తగా రద్దీ తగ్గటం మొదలుపెట్టింది. ఇంతలో తేనెలమ్మే ఒక వయ్యారి తన వన్నెచిన్నెలు ఒలకబోస్తూ ఆ వీధివెంట వచ్చి బుట్ట క్రిందికి దించి అమ్మకం మెదలుపెట్టింది. నిమిషములో కొన్ని లక్షలాది చీమలు మధువు కోసం ఆ వన్నెలాడి తేనె బుట్ట వద్దకు చేరినాయి. చీమల పుట్టలు చూసి వాటిని బఠానీల్లా నములుదామని ఒక తొండ అక్కడికి వచ్చింది.
రాత్రంతా నగరంలోని వేడుకల వలన జనసంచారమునకు భయపడి బయటకురాని ఎలుక తొండకోసం వచ్చింది. పిల్లిగారు ఆ తొండని గుటకాయస్వాహా చేద్దామని పొంచినిలిచినారు. పిల్లికోసం కుక్క కూడా అక్కడికి వచ్చింది. రాచవీధిలోని వేటకుక్కలు ఊరికుక్కని చూసి హంగామా చేశాయి.
ఇంతలో ఒక మాంత్రికుడు తన మంత్రశక్తి ద్వారా అడవిలోని ఒక పెద్దపులిని బంధించి రాచవీధిన తెస్తున్నాడు రాజుగారికి చూపించి మెప్పుపొందుదామనే ఉద్దేశ్యముతో. పౌరుషంలేని పులిని చూసి వేటకుక్కలు మీదపడ్డాయి. మరే జంతువైనా మంత్రించి బంధించేసేవాడు మాంత్రికుడు కానీ రాజుగారి వేటకుక్కలయ్యేసరికి కిమ్మనక ఉండిపోయాడు. ఈ గందరగోళానికి రాచభటులు ఆ పై మహామంత్రిగారు అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి రాజుగారికి నివేదించారు. రాజుగారు “నగరపు ముఖ్యవీధిలోనే ఇంత అల్లకల్లోలం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించాడు.
సూక్ష్మబుద్ధి అయిన మహామంత్రి ఇలా సమాధానమిచ్చినాడు “ప్రభు! కొద్దికాలముగా మన దేశములోని యువత రాత్రంతా వేడుకలతో సంబరాలతో గడుపుతున్నది. దీనివలన నిశాచరులైన జంతువులకు వేట కుదరటంలేదు. ఆహారము దొరకని కారణముగా ప్రకృతిలో ఈ అసహజస్థితి వచ్చినది. మానవునితో పాటు సహజీవనము చేసే భూతజాలములకు సైతం దయ చూపమని మన భారతీయ సంస్కృతి ఘోషిస్తున్నది కదా”!
ప్రజాహితుడైన ఉజ్జయినీ మహారాజు వెంటనే “రాత్రి ఒక జాము నగారా తరువాత వీధులలో జనసంచారము ఉండరాదు” అని దండోరా వేయించాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
మన చిన్నప్పుడు అమ్మ “బాబూ! రాత్రయిందిరా! ఇంక ఆటలు మాని ఇంటికి రారా. వేళకానివేళ ఆడితే నేలతల్లి కోపిస్తుందిరా! మంచి పిల్లలు త్వరగా పడుకుని తెల్లవారకముందే లేస్తారు” అని చెప్పి మందలించిన సన్నివేశం మనందఱికీ గుర్తే. ఈ సూక్తి వెనుకనున్న తత్త్వం మనకు మహామంత్రి మాటల ద్వారా తెలిసినది. ఈ విధముగానే అన్ని ప్రాచీన ఆచార సాంప్రదాయాల వెనుక ఆరోగ్య, సామాజిక, ఆధ్యాత్మిక హేతువులు కలవు. వాటి వివరమెఱిగి అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకొంటూ ముందు తరాలకు అందించుట మన కనీసకర్తవ్యము.
Om Tat Sat
(Continued...)
(My humble greatfulness to Neethi Kathalu dot com and Hindu dot com for the collection)
(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )
1 comments:
ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
Post a Comment