నీతి కథలు - 19



























నీతి కథలు




 

బ్రహ్మరాక్షసుని విముక్తి




పెద్దలు చెప్పిన నీతి కథ
అది దండకారణ్యమ్. మహా దట్టమైన అడవీప్రాంతమ్. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి. ఆ భీకరారణ్యంలో ఓ మఱ్ఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగావచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు ఓ వ్యాఘ్రేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?
పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రెయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుందిఅని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాంఅని పులి అన్నది.
సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు ఒక 100 వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. రాజకుమారిని పెళ్ళాడాలిఅన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చానుఅన్నాడు బాటసారి.
ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితోఅవును. నీకెలా తెలుసుఅని అన్నాడు బాటసారి. అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది 50 రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకోఅన్నాడు బాటసారి.
ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రాఅంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.     దుష్కర్మలెన్నడునూ చేయరాదు. నేర్చిన విద్య యొక్క సారమును ఎవ్వరికీ పంచకుండా బ్రహ్మరాక్షసుడు సద్గురు దూషణ వలన శిష్యుని కి దుఃఖములు తప్పలేదు.
2.     పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది. కేవలం పరోపకారం ఒక్కటే తమని కాపాడగలదని తెలిసి బ్రహ్మరాక్షసుడు పులి ధృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలచినారు.
3.     దేశద్రోహం చాలా పాపకార్యం. అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి ఉపకారం చేశాడు.



రఘుమహారాజు – కౌత్సుడు



శ్రీమద్రామాయణం లోని కథ
పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకుఅని అన్నారు.
శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనాఅంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.
గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.
అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకోని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. రాజా! అది కష్టములే. నేను వెళతానుఅంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనాఅని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తాఅని చెప్పి పంపాడు రఘుమహారాజు.
పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తుఅని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమనిఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండిఅన్నాడు.
తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు రాజా! నాకు కావలసినవి ౧౪ రాశులే. మిగతా ధనం నాది కాదుఅని వెళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మరి ఈ ధనమెవరిదిఅని రఘుమహారాజు మిగిలనదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.     గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
2.     రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
3.     కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.



భూదాన మహిమ



భరద్వాజ సంహిత లోని కథ
ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:
మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.
ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరిపైరు తయాఱయింది!
ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.
అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
సస్యసంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పాత్రునకు సమర్పించిన వాడికి బ్రహ్మలోకం కరతలామలకం. అజ్ఞానతః తన భూమిలోని పైరు ఇతరులకి ఉపయోగ పడినందుకే తామ్రతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా ఫలవృక్షములున్న భూమిని అర్హునికి దానముచేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు.







Om Tat Sat
                                                        
(Continued...) 

 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )


0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels